ఆంధ్రప్రదేశ్‌

అసెంబ్లీలో ‘కాపు’ కాయాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 4: కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా బీసీ-ఎఫ్‌గా గుర్తించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కాపు జేఏసీ సన్నద్ధమవుతోంది. ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని కాపు ప్రజాప్రతినిధులు డిమాండ్‌చేయాలని విజ్ఞప్తి చేసింది.
కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పట్లో పరిష్కారం కాదని భావించిన కాపు జేఏసీ ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్ళాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. కేంద్రం వద్ద ఉన్న సదరు నివేదికను తిరిగి తెప్పించుకుని, రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో కాపులకు బీసీ-ఎఫ్ రిజర్వేషన్లు అమలుచేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేస్తోంది. అలాగే కేంద్రానికి పంపిన నివేదికలో రాష్ట్ర వ్యాప్తంగా కాపులు అని పొందుపరచడాన్ని జేఏసీ అభ్యంతరం తెలుపుతోంది. ప్రకాశం జిల్లా నుండి బలిజలుగా సవరణ చేయాలని, అలాగే తెలగ, ఒంటరి కులాల విషయంలోనూ చిన్న సవరణలు అవసరమని పేర్కొంటోంది.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించని పక్షంలో రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహంపై కార్యాచరణ ప్రణాళిక ప్రకటించే దిశగా కాపు జేఏసీ ముందుకు సాగుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాపులకు బేషరతుగా బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఆరు నెలల అనంతరం కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందిగా మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖలు రాయడం ప్రారంభించారు. అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి సంవత్సరాలు గడిచినా నిర్లక్ష్యం వహించారని నిరసిస్తూ ముద్రగడ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించారు. తర్వాత తునిలో నిర్వహించిన ఐక్య గర్జన ఉద్యమంతో కాపుల రిజర్వేషన్ల పోరు పతాకస్థాయికి చేరింది. రత్నాచల్ రైలు దగ్ధం దుర్ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అనంతరం ముద్రగడ స్వగ్రామం కిర్లంపూడిలో నిరాహార దీక్ష, రాష్ట్ర వ్యాప్తంగా కాపుల ఉద్యమాల నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. తాము చేయాల్సింది చేశామని, ఇక కేంద్రం చేతుల్లోనే సమస్య ఉందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
ఇదిలావుంటే కాపులను బీసీలుగా గుర్తించే విషయమై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల వైఖరి ఒక్కొక్కరిది ఒకో విధంగా ఉంది. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి కాపుల రిజర్వేషన్లపై తన వైఖరిని స్పష్టంచేశారు. కాపుల రిజర్వేషన్ల వ్యవహారం కేంద్రం చేతుల్లో ఉందని, బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్నది తన అభిమతమని చెప్పారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి కాపుల రిజర్వేషన్ల అంశాన్ని 9-ఏ షెడ్యూల్‌లో పెట్టి రిజర్వేషన్లు అమలయ్యేలా చేస్తామని హామీనిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ అధికారంలోకివస్తే కాపులకు రిజర్వేషన్లు అమలుచేసి తీరుతామని హామీనిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాపుల భవిష్యత్ వ్యూహం ఎలా ఉండాలన్న దానిపై ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడలో కాపు జేఏసీ నేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో పవన్‌కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కాపులకు అనుకూలంగా ఉందని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల విషయంలో ఏ రాజకీయ పార్టీ వైఖరి తమకు అనుకూలంగా ఉంటే ఆ పార్టీకే రానున్న ఎన్నికల్లో మద్దతు ప్రకటించేలా సాగాలని వివిధ జిల్లాలకు చెందిన నేతలు వ్యాఖ్యానించారు.
దీనిపై కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా కాపులకు అనుకూలంగా తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందేమో చూద్దామని పేర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుందామని జేఏసీ నేతల వద్ద వ్యాఖ్యానించారు.
చిత్రం..కాపు జేఏసీ నేతలతో సమావేశమైన ముద్రగడ పద్మనాభం