ఆంధ్రప్రదేశ్‌

ఓడరేవుల అభివృద్ధి బోర్డుకు కేంద్రం అడ్డుకట్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 17: అక్షర దోషాలను సైతం సాకుగా చూపిస్తూ రాష్ట్రంలో ఓడరేవుల అభివృద్ధి బోర్డు ఏర్పాటుకు కేంద్రం కొర్రీలు వేస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మూడు సంవత్సరాలుగా చిన్న చిన్న విషయాలను, పదాల్లో అక్షరదోషాలను వంకగా చూపిస్తున్న కేంద్రం బిల్లును అమోదించడంలో కక్షసాధింపుగా వ్యవహరిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఆరవరోజు సోమవారం సభ ముందుకు పలు బిల్లులు వచ్చాయి. ఓడరేవుల అభివృద్ధి బోర్డు బిల్లును ప్రవేశ పెట్టిన సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2015 నుండి ఇప్పటి వరకు పలు దఫాలుగా ఇదే బిల్లును కేంద్రానికి పంపిస్తే చిన్న చిన్న అంశాలను సాకుగా చూపి కొర్రీలు వేస్తోందన్నారు. ఇటువంటి బిల్లునే కర్నాటక ప్రభుత్వం పంపిస్తే వెంటనే అమోదించిన కేంద్రం మన బిల్లును మాత్రం అడ్డుకుంటోందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలుసార్లు కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ స్పందన లేదన్నారు. దీనిపై స్పందించిన బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ సందు దోరికితే బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బిల్లును అమోదించే సమయంలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు. వీటిని కూడా రాజకీయ కోణంలో చూడటం తగదన్నారు. అయితే ఈబోర్డులో కేవలం పారిశ్రామిక వేత్తలనే నియమించడం సరికాదని, ఎమ్మెల్యేలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడంలో కేంద్రం చురుకుగా ఉందని వ్యాఖ్యానించారు. ఓడరేవులకు సంబంధించి దుగ్గరాజుపట్నం పోర్టును పక్కన పెట్టిన కేంద్రం రామాయపట్నం పోర్టుపై కూడా నోరుమెదపడం లేదన్నారు. సముద్ర ఉత్పత్తులను అత్యధికంగా ఎగుమతి చేస్తున్న మన రాష్ట్రంలో ఓడ రేవుల అభివృద్ధి జరగాలన్నారు. ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ 974 కిలో మీటర్ల సుదీర్ఘ సముద్రతీరం ఉన్న ఏపీలో సుమారు 800 కిలోమీటర్ల మేర ఉపయోగంలో లేదన్నారు. ఈ ప్రాంతాలను కూడా ఉపయోగంలోనికి తీసుకు వచ్చి అభివృద్ధి చేయాలన్నారు. ఓడరేవుల అభివృద్ధి బోర్డుకు ముఖ్యమంత్రి అధ్యక్షులుగా కమిటీ ఉందని, నిత్యం దీనిపై సమీక్షలు జరుపుతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చర్చ చివరలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుకు అడుగడుగునా అవరోధాలు
విజయవాడ: ఆంధ్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో రాత్రి పగలు శ్రమిస్తుంటే అటు వైపు కనె్నత్తి కూడా చూడని ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి, ఢిల్లీలో వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్రరావు అసత్య ఆరోపణలతో కేంద్రానికి లేఖలపై లేఖలు రాస్తూ, మరో వైపు కేసులు వేయిస్తూ, నిర్వాసితులను రెచ్చగొడుతూ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.
శాసనసభలో సోమవారం స్వల్ప వ్యవధి ప్రశ్నోత్తరాలలో పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర పోలవరంలో అక్కడి వాస్తవ పరిస్థితులకు, కేంద్ర మంత్రులు ఇచ్చే ప్రకటనలకు వ్యత్యాసాలు వస్తున్నాయని, సవరించిన అంచనాల ఆమోదంలో కేంద్రం కాలయాపన చేస్తున్నదన్నారు. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ కల్పించుకుంటూ పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తున్నారని అన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ పెనె్మత్స విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం చిత్తశుద్ధితో సహకరిస్తోందన్నారు. ఇందుకు అయ్యే ఖర్చులో ప్రతి నయాపైసా కేంద్రం భరిస్తుందన్నారు. చర్చకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బదులిస్తూ ప్రాజెక్టు నిర్మాణపు పనులు 58.38 శాతం పూర్తయ్యాయని అన్నారు. 2010-11 అంచనాల ప్రకారం రూ. 16వేల కోట్లు ఖర్చవుతుందన్నారు.
రకరకాల కారణాలతో 2013-14 అంచనాల ప్రకారం రూ. 33,200 కోట్లకు ఖర్చు పెరిగిందన్నారు. తొలి అంచనాల ప్రకారం రూ. 57,461 ఎకరాల భూమిని తీసుకోవటం, అలాగే ఎకరాకు రూ. 65వేల చొప్పున పరిహారం లెక్కించారన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం అంచనా వ్యయం రూ. 11.50 లక్షలకు పెరిగిందని ఏడు ముంపు మండలాలను కలిపినందున లక్షా, 7వేల మంది నిర్వాసితులు పెరిగారని అన్నారు. ధరల వ్యత్యాసం, క్షేత్ర స్థాయిలో డిజైన్ల మార్పిడి వల్లనే అంచనా వ్యయం పెరిగిందన్నారు. గత నాలుగేళ్లలో కేంద్రం పది సార్లు నివేదికలు అడగ్గా తక్షణమే పంపించామన్నారు. వారి అనుమానాలన్నీ తీరుస్తూ వస్తున్నామని అన్నారు. పనులు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 14,781 కోట్ల, 51 లక్షల రూపాయల వ్యయం అయిందని కేంద్రం ఇంకా రూ. 2,918 కోట్ల, 38 లక్షల రూపాయలు విడుదల చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికీ లక్షా, 10వేల మంది రైతులు డ్యామ్ సైట్‌కు వెళ్లి పనులు చూసి సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. దేశంలో 16 జాతీయ ప్రాజెక్టుల పనులు జరుగుతుంటే ఒక్క పోలవరానికి మాత్రమే ఖర్చుల వివరాలన్నీ ఎప్పటికప్పుడు పారదర్శకతతో వెబ్‌సైట్‌లో ఉంచుతున్నామని మంత్రి ఉమా అన్నారు.
చిత్రం..అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు