ఆంధ్రప్రదేశ్‌

విజ్ఞాన కేంద్రంగా అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 19: రాజధానిలో నెలకొల్పిన విద్యాసంస్థలు వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని పరస్పర విజ్ఞాన సమాచార మార్పిడికి ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు అమరావతిలో కొలువుదీరటం గర్వకారణమని, తరగతి గదుల్లో బోధిస్తున్న విజ్ఞానాన్ని క్షేత్ర స్థాయిలో పరిచయంచేసి ఫలితాలు సాధించినప్పుడే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని వివరించారు. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై బుధవారం రాత్రి సచివాలయంలో సీఆర్డీఎ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాజధానిలో భూములు పొందిన వివిధ సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్టీజీ, వ్యవసాయం, పునరుత్పాదక ఇంధన వనరులు, విద్యుత్ వాహనాలు మొదలైన అంశాల్లో వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ శాఖలు మరింత మెరుగ్గా పనిచేసేందుకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించేందుకు ముందుకు రావాలని కోరారు. సింగపూర్‌లోని ప్రఖ్యాత లీక్వాన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ పాలనలో పోటీతత్వం పెంచేలా పరిశోధన, శిక్షణ అంశాల్లో సహకరించేందుకు ముందుకు వచ్చిందని, ఇప్పటికే ఇక్కడ నెలకొల్పిన విశ్వవిద్యాలయాలతో కలసి పనిచేసి వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అత్యుత్తమ సంస్థల రాకతో నూతన రాజధానికి కీర్తిప్రతిష్టలు పెరగాలనేదే తన ఆలోచన అన్నారు. నాలెడ్జి ఎకానమీ విస్తృతితో అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ సంకల్పానికి పేరొందిన అంతర్జాతీయ సంస్థలు సహకరించటం విశేష పరిణామమన్నారు. రాజధానిలో భూ కేటాయింపులు జరిపిన 15 సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై నిర్మాణ పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు. పుష్కలమైన జలవనరులే కొత్త నగరానికి అదనపు ఆకర్షణగా చెప్తూ ఫౌంటైన్లు, ఇతర జలక్రీడా వసతుల ఏర్పాటుతో ప్రతి ఆవరణలో ఆహ్లాద భరిత వాతావరణాన్ని సృష్టించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి సంస్థ తమ నిర్మాణంలో అత్యధికభాగం పచ్చదనానికి విధిగా ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. శారీరక వ్యాయామం కల్పించేలా తగిన క్రీడా సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. 7లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరిపిన భవంతులలో ఈ ఏడాది 20 రాష్ట్రాల నుంచి వచ్చిన 12 వందల మంది విద్యార్థులు ప్రపంచ ప్రమాణాలతో కూడిన విద్యను అందుకుంటున్నారని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ వీసీ సత్యనారాయణ ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతి హ్యాపీనెస్ పేరుతో వాణిజ్య అవసరాలకు 12 వందల ప్లాట్లతో అపార్టుమెంట్ నిర్మాణాన్ని చేపట్టామని సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ తెలిపారు. 14 ఎకరాల్లో చేపట్టే ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. సమావేశంలో పురపాలకశాఖ మంత్రి పి నారాయణ, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, సీఆర్డీఏ కార్యదర్శి అజయ్‌జైన్, పురపాలకశాఖ కార్యదర్శి కరికాల వలవన్, ఏడీసీ సీఎండీ లక్ష్మీ పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.