ఆంధ్రప్రదేశ్‌

పోలవరం నిర్వాసితుల వడపోత..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 30: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిస్థితి కుడి, ఎడమల దగా దగా అన్నట్టుగా ఉంది. ఆర్ అండ్ ఆర్ జాబితా నుంచి ఏదో వంకతో పేర్లను తొలగిస్తూ వడపోత కార్యక్రమాన్ని చేపట్టారని తెలుస్తోంది. దీంతో నిర్వాసితులు పడరాని పాట్లు పడుతున్నారు. అఖండ గోదావరి నది ఎడమ గట్టు వైపు కంటే, కుడి గట్టు వైపు నిర్వాసితులు అగచాట్లు అధికంగా ఉన్నాయి. ముంపునకు గురయ్యే పల్లపు భూములకు కాకుండా మెరక భూములకు నష్ట పరిహారం ఇస్తూ అధికారులు కొత్త పుంతలు తొక్కారు. చెంతనే ఉన్న భూములకు అధికారులు మొండి చేయి చూపడంతో నష్టపోయిన నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారు. ఎవరితో చెప్పుకోవాలో తెలియని స్థితి. ఎన్నిసార్లు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఆదివాసీ నిర్వాసితుల మొర ఆలకించే వారు కనిపించడం లేదు.
విలీన మండలాల్లోని చింతూరు, విఆర్ పురం, కూనవరం, ఎటపాక మండలాల్లోనూ, దేవీపట్నం మండలంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బూర్గంపహాడ్ మండలంలో కొంత భాగం, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో అనేక మంది నిర్వాసితులకు సక్రమంగా పరిహారం అందని పరిస్థితి దాపురించింది. కొంతమందికి రేషన్ కార్డు లేదని, మరి కొంత మందికి రేషన్ కార్డు ఉన్నా సక్రమంగా సరుకులు తీసుకోవడం లేదని, కొంత మందికి ఆధార్‌కార్డు లేదని, ఆధార్ కార్డు ఉన్నా అడ్రస్ స్థానికంగా లేదని, ఓటర్ ఐడి కార్డు లేదని ఇలా వందలాది మంది పేర్లను అర్ అండ్ ఆర్ జాబితా నుంచి తొలగించారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏదో వంకతో తమ పేర్లను వడపోస్తున్నారని నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు కుడి, ఎడమ వైపు దాదాపు 1100 మంది పేర్ల వరకు జాబితా నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. రాజధాని అమరావతి విషయంలో భూములిచ్చినవారికి సకల సదుపాయాలు కల్పించి పరిహారం చెల్లిస్తుంటే, ఇక్కడ సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు మాత్రం సక్రమంగా పరిహారం కూడా అందించడం లేదు.
ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి అన్నట్టుగా ఉంది. 2013 చట్టం ప్రకారం పరిహారం అనేది ఎక్కడా సక్రమంగా అమలైన దాఖలాలు కన్పించడం లేదు. నిర్వాసితులను ఏదో విధంగా వడబోస్తున్నారు. దీనికి తోడు భూసర్వే కూడా తప్పుల తడకగా సాగిందంటున్నారు. గోదావరి చెంతనే ముంపులో ఉండే భూములకు పరిహారం లేకుండా, మెరకలో వున్న భూములకు పరిహారం అందిస్తున్నారని, పొలంలో ఉన్న ఇల్లు మునిగిపోతుందని పరిహారం ఇస్తే అదే పొలానికి మాత్రం పరిహారం జాబితా నుంచి తొలగించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. పొలంలో ఉన్న ఇల్లు మునిగిపోతుందని నష్టపరిహారం జాబితాలో పేరు నమోదు చేస్తే ఆ భూమి ఏ విధంగా మునగదో అర్ధం కాని పరిస్థితి ఉంది. ఇంటికి పరిహారం ఇచ్చి భూమికి పరిహారం ఇవ్వని స్థితి నెలకొంది. ఇక్కడ ఉదాహారణకు కొన్ని వివరాలను ఇవ్వడం జరుగుతోంది. రేపాక గొమ్ము గ్రామంలో సర్వే నెంబర్ 199 తెల్లం కమలమ్మకు 2.20 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలోనే నివాసానికి ఇల్లు కట్టుకుంది. ఈ భూమికి చుట్టూ వున్న భూమికి నష్టపరిహారం ఇచ్చారు గానీ, ఈ భూమిలో మాత్రం ఇల్లు మాత్రమే మునుగుతుందని పరిహారం తయారు చేశారు. చుట్టూ వున్న భూమిని మునుగుతుందని నివేదికలో పేర్కొని, మధ్యలో ఉన్న తన భూమి ఎందుకు మునగదో అర్ధం కాక కమలమ్మ నేటికీ అధికారుల చుట్టూ తిరుగుతోంది. అదేవిధంగా తెల్లం సావిత్రి, తెల్లం చినరాములు ఈ భూములకు చుట్టూ ఉన్న భూములు మునిగినట్టు చూపించి మధ్యలో పల్లంలో ఉన్న భూమి ఎందుకు మునగదో తెలయని స్థితి. 1986 వరద ఆధారంగా ప్రామాణికంగా తీసుకుని పరిహారం చెల్లించినట్టు అధికారులు చెబుతున్నారంటున్నారు. దాచారం గ్రామంలో మెరక పొలానికి పరిహారం ఇచ్చి, పల్లంలో ఉన్న సర్వే నెంబర్ 96లోని దాదాపు 90 ఎకరాల భూమికి నయాపైసా కూడా పరిహారం ఇవ్వలేదు. సర్వేనెంబర్ 218లో మూడు ఎకరాలు, సర్వే నెంబర్ 246లో 26 కుంటలు కోయ కులానికి చెందిన కొట్ల బుచ్చమ్మకు ఆ పొలంలోనే ఇల్లు, ఇల్లు మునుగుతుందని పరిహారం ఇచ్చారు. పొలానికి మాత్రం పరిహారం ఇవ్వలేదు. ఇల్లు మునిగినపుడు, పొలం ఎందుకు మునగదని పేర్కొంటూ అర్జీలు పెడుతూ బుచ్చమ్మ అధికారుల కోసం తిరుగుతోంది. సర్వే నెంబర్ 288లో ముంపునకు గురైనట్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో పేర్కొన్నారు. కొట్ల సింగయ్యకు చెందిన ఈ పొలంలో ఇంటికి పరిహారం ఇవ్వలేదు. నిర్వాసితులు దూర ప్రాంతాల నుంచి అధికారుల వద్దకు వచ్చి తమ గోడు చెప్పుకోవాలంటే ఆదివాసీ నిర్వాసితులకు ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి రావడానికి, తిరిగి ఇంటికి వెళ్లడానికి రెండు రోజుల పని. తీరా పని మానుకుని వస్తే అధికారులు అందుబాటులో ఉండని స్థితి. చింతూరు, విఆర్ పురం, కూనవరం, ఎటపాక మండలాల నుంచి ఇటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలంటే రంపచోడవరం రావాల్సిందే. నిర్వాసితులకు అందుబాటులో వుండేందుకు కుకునూరు మండలంలో ఏర్పాటు చేసిన ఆర్ అండ్ ఆర్ కార్యాలయం తూతూ మంత్రంగా నడుస్తోంది. అక్కడ రికార్డు లేదు. ఇద్దరు సిబ్బందిని పెట్టి నడిపిస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకోవాలంటే బాధితులకు అధికారులు అందుబాటులో ఉండరు. దీంతో ఎడమ గట్టు వైపు నిర్వాసితులంతా కేఆర్ పురంలో పడిగాపులు కాస్తున్నారు. కనీసం మంచినీళ్లు కూడా దొరకని దుస్థితి. తిరిగి ఇంటికి పోదామనుకుంటే.ఆరు దాటితే ఇక బస్సు ఉండదు. కెఆర్ పురం ఐటీడీఏ పీవోకే పునావాస కల్పన కార్యకమాన్ని నిర్వహిస్తున్నారు. కెఆర్ పురం బాధితులంతా రావాలంటే వ్యయ ప్రయాసలకోర్చి రావాల్సిందే. నష్టపరిహారం చెల్లింపు లోపభూయిష్టంగా ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి, మొత్తం ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకొస్తాయని నిర్వాసితులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ పరిహారం సంగతి మెరక భూమికెరుక అన్నట్టుగా పరిస్థితి తయారైంది.