ఆంధ్రప్రదేశ్‌

పోలవరానికి ఆర్థిక సంస్థల నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవసరమైతే జలవనరుల కార్పొరేషన్ ద్వారా మళ్లింపు
కేంద్రం నుంచి వస్తే తిరిగి చెల్లింపు
సకాలంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికావాలి
సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
--------------------------------------------------
అమరావతి, అక్టోబర్ 1: పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేసేందుకు అవసరమైతే ‘ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఏపీ డబ్ల్యూ ఆర్‌డీసీ) ద్వారా నిధులు సమకూర్చుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్దేశించారు. రాష్ట్రానికి వరదాయినిగా ఉన్న ఈ బహుళార్థసాధక ప్రాజెక్టుకు నిధుల కొరతలేకుండా అవసరమైతే కార్పొరేషన్ ద్వారా, వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుని కేంద్రప్రభుత్వం నుంచి నిధులు రాగానే తిరిగి చెల్లించేలా సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో పోలవరం, ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులకు సంబంధించిన పనుల పురోగతిపై సమీక్షించారు. జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ముఖ్యకార్యదర్శి శశిభూషణ్, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. నిర్వాసితుల సహాయ, పునరావాస లక్ష్యాలను డిసెంబర్‌లోగా పూర్తిచేయాల్సి ఉందని, నిర్ణీత సమయంలోగా పనులు పూర్తిచేసిన నిర్మాణ సంస్థలకు సకాలంలో చెల్లింపులు పూర్తి చేస్తామని ప్రకటించారు. ఏ దశలోనూ నిధులకు ఇబ్బందిలేకుండా చూడాలన్నారు. గత వారంలో జరిగిన 0.22 శాతం పనులతో కలిపి మొత్తం 58.77 శాతం వరకు పనులు పూర్తయ్యాయని జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ ముఖ్యమంత్రికి వివరించదారు. ప్రాజెక్టు హెడ్ వర్క్స్ పనులు గత వారం 45.8 శాతం కాగా, ప్రస్తుతం 46.12 శాతం జరిగాయన్నారు. మెయిన్ డ్యామ్ ప్యాకేజీ శనివారం నాటికి 44.92 శాతం పూర్తయిందని చెప్పారు. ప్రధాన డ్యామ్ పనుల్లో స్పిల్‌వే, స్పిల్ ఛానెల్, అప్రోచ్ ఛానెల్, పైలెట్ ఛానెల్, లెఫ్ట్‌ప్లాంక్ తవ్వకాలలో ఈ వారం 0.20 శాతం పురోగతి సాధించామని, ఇప్పటి వరకు 78.20 శాతం మేర పనులు జరిగాయని తెలిపారు. ప్రధాన డ్యామ్‌కు సంబంధించి స్పిల్‌వే తవ్వకం, స్పిల్‌ఛానెల్, అప్రోచ్ ఛానెల్, పైలెట్ ఛానెల్, లెఫ్ట్‌ప్లాంక్ పనుల్లో 1115.90 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు జరగాల్సి ఉండగా, అందులో 872.44 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు పూర్తయ్యాయని వివరించగా, మిగిలిన 243.15 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు సత్వరమే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి నిర్మాణ సంస్థల ప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. వర్షాకాలం ముగిసినందున పనుల్లో జాప్యం జరగటానికి వీల్లేదన్నారు. స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్‌ఛానెల్, క్రివైసిస్ ఫిల్లింగ్ కాంక్రీట్ పనుల్లో ఇప్పటివరకు 39.2 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. 36.79 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 14.44 లక్షల క్యూబిక్ మీటర్ల మేర స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానెల్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఇప్పటివరకు మొత్తం 61.85శాతం రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పనులు పూర్తయ్యాయని వివరించారు. 1397 మీటర్ల డయాఫ్రమ్ వాల్ ఇప్పటికే పూర్తయిందని, జెట్‌గ్రౌటింగ్ 94.2శాతం పనులు జరిగాయని తెలిపారు. కనెక్టివిటీ ప్యాకేజెస్‌లో ఇప్పటి వరకు 59.04 శాతం పనులు జరగ్గా, అందులో లెప్ట్ కనెక్టివిటీ పనులు 47.79 శాతం, రైట్ కనెక్టివిటీ పనులు 71.77శాతం ఉన్నాయని శశిభూషణ్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ప్రాజెక్టు మొదటిగేటు ఈనెలలో ఏర్పాటు కానున్నట్లు ప్రకటించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 15వేల ఇళ్లు నిర్వాసితులకు నిర్మించాల్సి ఉందన్నారు.
సూక్ష్మసేద్యంపై సీఎం సమీక్ష
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సేద్యపునీటి ప్రాజెక్టుల ముఖచిత్రాలతో జిల్లాకు ఒక క్యాలెండర్ తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రిజర్వాయర్లు, కాల్వలకు సెన్సర్లు ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు జలవనరులను అంచనావేస్తే సేద్యపు అవసరాలకు ఎంతమేర నీళ్లు వస్తున్నాయో రైతులకు అవగాహన వస్తుందన్నారు. ఒక మండలంలో భూ ఉపరితలంలో, భూగర్భంలో ఎంతమేర నీళ్లు లభ్యమవుతాయో ఆ మండలంలో ఉన్న రైతాంగానికి తెలియజేయాలని సూచించారు. జలవనరులతో ఈ- క్రాప్, మైక్రో ఇరిగేషన్‌ను ఇంటిగ్రేట్ చేయాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించి స్థానికంగా ఉండే విద్యార్థులకు జలవనరులపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆయా ప్రాజెక్టులను సందర్శించి అనుభూతి చెందే విధంగా వర్చువల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతపురం జిల్లాలో జలవనరుల లభ్యతపై ఆధ్యయనానికి వేసిన కమిటీ నివేదికపై సమావేశంలో కొద్దిసేపు చర్చించారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చెరువుల్లో నీరు నింపాలని సూచించారు. అన్ని ప్రాంతాలకు సమదృష్టితో నీటి సరఫరా జరగాలని నిర్దేశించారు. అప్పుడే ప్రభుత్వంపై విశ్వసనీయత పెరుగుతుందన్నారు. వర్షపునీటితో చెరువులు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా రిజర్వాయర్లు నింపుకుంటే కరవు అనే మాట వినిపించదన్నారు. గ్రావిటీ, లిఫ్ట్‌ల ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తామని వెల్లడించారు. రాష్ట్రాన్ని కరవురహిత మాగాణంగా మార్చటమే అంతిమంగా ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక సేద్యపు అవసరాల కోసం వినియోగించుకుంటామని తెలిపారు. సూక్ష్మ వ్యవసాయాభివృద్ధిలో 20లక్షల చదరపు మీటర్ల మేర జంగిల్ క్లియరెన్స్ జరగాల్సి ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించగా ఈ పనుల్లో జాప్యం చేయకుండా సత్వరమే పూర్తిచేయాలన్నారు. మారాల, చెర్లపల్లి, మడకశిర, అడవిపల్లి, అడవిపల్లి లిఫ్ట్, కుప్పం ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేసేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. మారాల, చెర్లపల్లికి ఈనెల 10వ తేదీన, మదనపల్లికి నవంబర్ 10, పుంగనూరుకు 15, కుప్పం బ్రాంచి కెనాల్‌కు నవంబర్ 22, కుప్పంకు డిసెంబర్ ఒకటిన, గొల్లపల్లి నుంచి మడకశిరకు డిసెంబర్ ఒకటిన, హిందూపూర్‌లో నవంబర్ 20న నీరు చేరుకుంటుందనే అధికారులు అంచనా వేశారు. నీటి లభ్యతకు అనుగుణంగా నిర్ణీత సమయంలో ఆయా ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. పనుల గడువును ఇప్పటికి మూడు పర్యాయాలు మార్చిన సంగం ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ ప్రతినిధులపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. డిసెంబర్ 15 లోగా ఈ పనులను పూర్తిచేయకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గౌరవంగా అందరం కలసి పనిచేద్దామని అనుకుంటే కొంతమంది తేలిగ్గా తీసుకుంటున్నారని ఇకముందు అలాంటి వారిని ఉపేక్షించేదిలేదని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా వైకుంఠపురం ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.