ఆంధ్రప్రదేశ్‌

పట్టు సాధించిన పరకాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: ఏపి ప్రభుత్వ మీడియా (కమ్యూనికేషన్) సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ ప్రాధాన్యం పెరిగింది. ఆయనకు మళ్లీ రెండేళ్ల పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. సహజంగా ఈ పదవిని ఏడాదిపాటు మాత్రమే పొడిగించే సంప్రదాయం ఉంది. అందుకు భిన్నంగా రెండేళ్లు పొడిగించడాన్నిబట్టి, ఆయనకు తిరిగి ప్రాధాన్యం ఏర్పడిందన్న సంకేతాలు వెళ్లాయి.
ఓటుకు నోటు కేసులో బాబును సమర్థిస్తూ మీడియాకు వచ్చే ముందు వరకూ పరకాలకు ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యం లభించింది. మంత్రివర్గ సమావేశాల్లో సీఎం చంద్రబాబు పక్కనే కూర్చునేవారు. బాబు బిజీగా ఉన్న సమయంలో కొన్ని కీలక శాఖల సమీక్షలు, బాబు తన వద్దకు వచ్చిన ముఖ్య వ్యక్తులను పరకాల వద్దకు పంపి, ప్రాజెక్టు రిపోర్టులపై చర్చించమని పురమాయించేవారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, వాటికి సంబంధించిన కీలక సమావేశాలు కూడా పరకాల ఆధ్వర్యాన నడిచాయి. ఒకరకంగా పరకాల చాంబర్ బ్యాక్ ఆఫీసుగా ఉండేది. ఒకదశలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రివర్గంలో తీసుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. కాగా, తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకునోటు కేసులో.. బాబు తరఫున పరకాల సమర్థవంతంగానే వాదించినప్పటికీ, బాబు కోటరీ ప్రముఖులు, పరకాల వల్లనే బూమెరాంగయిందని చెప్పడంతో అప్పటినుంచి ఆయన ప్రాధాన్యం తగ్గింది. ఫలితంగా మునుపటిమాదిరిగా మంత్రివర్గ సమావేశాల్లో సీఎం పక్కన కనిపించకపోవడం ఆ ప్రచారానికి బలం చేకూరింది.
అయితే, జాతీయ వ్యవహారాలు, జాతీయ మీడియాతో మాట్లాడేందుకు సమర్ధులైన మంత్రులు లేకపోవడం, గత కొద్దికాలం క్రితం ఆంగ్ల చానెల్‌లో పార్టీ ఎంపి ఒకరు మాట్లాడిన భాష సరిగా లేకపోవడంతో అది అభాసుపాలయింది. ప్రస్తుతం మంత్రివర్గంలో యనమల రామకృష్ణుడు వంటి ఒకరిద్దరికి మాత్రమే ఆంగ్లంపై పట్టు ఉంది. కానీ ఆయన తన పరిధిని మించి ఎప్పుడూ ముందుకు వెళ్లరు. ఎంపిల్లో కూడా ఆంగ్లంపై పట్టున్న వారి సంఖ్య తక్కువ. విదేశాల నుంచి ప్రముఖులు వచ్చిన సందర్భాల్లో వారితో సంభాషించే స్థాయి మంత్రులు కూడా లేకుండా పోయారు. ఇదే పరకాలకు మళ్లీ ప్లస్ పాయింట్ అయినట్లు కనిపిస్తోంది.
ఆంగ్లం, హిందీ, తెలుగుపై మంచి పట్టుతోపాటు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలను, ఆంగ్లంలో సూటిగా స్పష్టం చేసే ఆయన భాషాప్రావీణ్యం, రాష్ట్ర-జాతీయ మీడియాపై నిరంతర విశే్లషణ కోసం చేసే కసరత్తు బాబును మెప్పించింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏపి ప్రభుత్వంపై కాపీ రైట్ యాక్టు కింద సైబర్ కేసు నమోదు చేసిన సందర్భంలో, పరకాల వాదన కూడా ముఖ్యమంత్రిని మెప్పించిందంటున్నారు. కాగా, పరకాల ప్రాధాన్యం తగ్గిపోయిందని, ఆయనను పక్కకుపెట్టారని ప్రభుత్వంలో ఒక వర్గం ప్రచారం చేసిన నేపథ్యంలో, ఆయన పదవీకాల పొడిగింపుపై సందేహాలు తలెత్తాయి. అయితే ఏకంగా రెండేళ్లు పొడిగింపు ఇవ్వడంతో, పరకాల మళ్లీ ప్రభుత్వ వ్యవహారాల్లో పట్టుబిగించారని స్పష్టమవుతోంది. సహజంగా సలహాదారులకు ఏడాదిమాత్రమే పదవీకాలం పొడిగిస్తుంటారు.