ఆంధ్రప్రదేశ్‌

పునర్నిర్మాణానికీ పుష్కరమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: విజయవాడ హిందూ దేవాలయాల కూల్చివేత జరిగి 20 రోజులవుతోంది. ఇప్పటివరకూ వాటి పునర్మిర్మాణ పనులపై, ప్రభుత్వం నడుం బిగించకపోవడంతో హిందూ సంస్థలు, భక్తుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. విజయవాడలో 45 దేవాలయాలను రోడ్ల విస్తరణ, ఘాట్ల అభివృద్ధి పేరుతో వివాదాస్పదంగా కూల్చివేసిన ఘటనలో బీజేపీ, హిందూ సంస్థలు, ప్రభుత్వానికి మధ్య అంతరం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై బిజెపి నాయకత్వం తీవ్రంగా స్పందించటం, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి కూలిన ఆలయాల దగ్గరకు వెళ్లినప్పుడు టిడిపి నేత బుద్దా వెంకన్న వారిని అడ్డుకోవడం, విజయవాడ ఎంపి కేశినాని నాని స్వాములపై పరుష పదజాలం వాడటం, ఆ తర్వాత పీఠాలు, మఠాధిపతులు మహా ధర్నాకు దిగడంతో ప్రభుత్వం దిగివచ్చిన విషయమూ విదితమే. దానిపై స్వయంగా స్పందించిన బాబు, కూల్చిన దేవాలయాలను ప్రభుత్వ ఖర్చుతో పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించి మంత్రుల కమిటీ నియమించారు.
ఇదంతా జరిగి 20 రోజులవుతున్నా ఇంతవరకూ కూల్చిన దేవాలయాలను ఎక్కడ నిర్మిస్తున్నారు, ఎప్పటిలోగా నిర్మిస్తారు, అక్కడే నిర్మిస్తారా, వాటికోసం వేరేచోట స్థలాన్ని గుర్తించారా? అన్న అంశంపై స్పష్టత లేకపోవడంపై విహీచ్‌పి, బజరంగదళ్, ఆలయ ధర్మపరిరక్షణ సమితి, స్వాములు ఆందోళన చెందుతున్నారు. బాబు హామీ మేరకు కృష్ణా పుష్కరాల్లోపు కూల్చిన ఆలయాలను పునర్నిర్మిస్తారని ఆశించామని, అయితే, ఇప్పటివరకూ మంత్రుల కమిటీ, కనీసం ప్రాథమిక నివేదిక కూడా సమర్పించలేదని వ్యాఖ్యానిస్తున్నారు.
మంత్రుల కమిటీ సమావేశమయ్యేలోగా పుష్కరాలు కూడా పూర్తవుతాయేమోనంటున్నారు. దీనితో ఆలయ పునర్నిర్మాణాలు కృష్ణా పుష్కరాలలోపు ఉంటాయా, మళ్లీ పుష్కరాల లోపు చేస్తారా? అన్న చర్చ మొదలయింది. విహెచ్‌పి, ఆలయ ధర్మ పరిరక్షణ సమితి, శివస్వామి మాత్రం కృష్ణా పుష్కరాలలోపే, కూల్చినచోటనే వాటిని పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి నియమించిన కమిటీలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఉన్నప్పటికీ, ఆయన కూడా ఈ విషయంలో చొరవ తీసుకోకపోవడంపై, బిజెపిలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, హిందువుల విశ్వాసాలను కూల్చివేస్తుంటే కనీసం అధికారికంగానయినా ఖండించలేని దుస్థితిలో ఉన్నామని బిజెపి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూల్చిన దేవాలయంలోని ఆంజనేయస్వామి విగ్రహాన్ని.. సమీపంలోని ఎండోమెంట్ ఆలయంలో భద్రపరచకుండా, ఇప్పటికీ విజయవాడ కార్పొరేషన్ ఆఫీసులో ఉంచారంటే పునర్నిర్మాణంపై ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోందంటున్నారు. ‘ఈ విషయంలో మా ఇద్దరు మంత్రులది చెరోదారి. ఒక మంత్రి అధికారపార్టీకి అనుకూలంగా మాట్లాడతారు. మేం టిడిపిని విమర్శిస్తే ఆయనకు కోపం వస్తుంది. మరొకమంత్రి పార్టీవాది అయినప్పటికీ దేనినీ వ్యతిరేకిస్తూ మాట్లాడలేరు. ఇదీ మా పార్టీ దుస్థితి’ అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
కూల్చిన 45 దేవాలయాల్లో కేవలం 5 ప్రముఖ దేవాలయాలను మాత్రమే కనకదుర్గ గుడి స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తుందన్న, ప్రభుత్వ అధికారుల ప్రతిపాదనను హిందూ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా ప్రసిద్ధి చెందిన శనీశ్వరాలయంలోని గర్భాలయం మాత్రమే మిగిలి ఉందని, దానికి కమిటీ ఉండగా, దానినికూడా స్వాధీనం చేసుకుంటామంటే ఒప్పుకునేది లేదని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. అయితే, కూల్చిన దేవాలయాలన్నీ ఇప్పటివరకూ కమిటీల ఆధ్వర్యాన కొనసాగాయి. వాటికి ఎండోమెంటు డిపార్టుమెంటుతో సంబంధం లేదు. కానీ కూల్చిన వాటిని ప్రభుత్వ ఖర్చుతో పునర్నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఏవిధంగా చెప్పారో తమకు తెలియదని, ఆ శాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.