ఆంధ్రప్రదేశ్‌

అధికారంలోకి వస్తే విభజన హామీలన్నీ అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళ్ల, అక్టోబర్ 8: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని విధాలా అభివృద్ధి జరుగుతుందని పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరులో సోమవారం ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమాన్ని రఘువీరారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. నాలుగున్నరేళ్ల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడితే ప్రజల సమస్యలు తీరతాయనే ముందస్తు ఎన్నికల ప్రణాళికతో ముందుకు వచ్చామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రత్యేక హోదాపైనే ఆధారపడి ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన మరుక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా ఫైల్‌పై సంతకం చేస్తారన్నారు. విభజన హామీలు అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రాంతీయ పార్టీలు వీటిని ముందుకు తీసుకువెళ్లలేకపోయాయన్నారు. రాహుల్ ప్రధాని అయిన పది రోజుల్లో ప్రతీ రైతుకీ రూ.2 లక్షలు రుణమాఫీ, ప్రతీ డ్వాక్రా సంఘానికి రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఒక్కో సంఘానికి రూ.10 లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పారు. చౌక డిపోల ద్వారా 9 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. కార్పొరేట్ కళాశాలలు, అసుపత్రులు వసూలుచేసే ఫీజులపై నియంత్రణ తీసుకువస్తామని రఘువీరా స్పష్టంచేశారు.
డీజిల్, పెట్రోలు ధరలు జీఎస్టీ పరిధిలోకి తెస్తామన్నారు. వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులూ లేనివిధంగా జీఎస్టీని సవరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే తాము ప్రభుత్వం ఏర్పాటుచేసిన వంద రోజుల్లో 1.6 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రఘువీరారెడ్డి చెప్పారు.
వితంతువులు, వికలాంగులకు పెన్షన్ ఇవ్వడం సక్రమని, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా కంటి తుడుపు చర్యగా భృతి పేరుతో పెన్షన్ ఇవ్వడమేమిటని రఘువీరా ప్రశ్నించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 50-60 ఏళ్ల వయస్సున్న వారికి రూ.2000, 60-70 వయస్సున్న వారికి రూ.2,500, 70 ఏళ్లు దాటితే రూ.3000 పెన్షను ఇస్తామన్నారు. అంతే కాకుండా వికలాంగులకు వయస్సుతో సంబంధం లేకుండా రూ.3000 పెన్షను అందిస్తామన్నారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు.
కరపత్రం కాదు.. ప్రమాణ పత్రం
ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమంలో తానీ రోజు పంచేది కరపత్రం కాదని, అది తమ పార్టీ ప్రమాణ పత్రమని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. కేవలం పార్టీ కార్యక్రమంలో పాల్గొనడానికే కాదని, ప్రజల్లో ధైర్యాన్ని నింపేందుకు వచ్చానని ఆయన స్పష్టంచేశారు. కాళ్లకూరు సెంటర్‌లో మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, పీసీసీ ప్రధాన కార్యదర్శి గాదిరాజు లచ్చిరాజు ఆధ్వర్యంలో ప్రతీ దుకాణం వద్దకు వెళ్లి, వారి క్షేమ సమాచారాలు రఘువీరారెడ్డి అడిగితెలుసుకున్నారు.
ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఘోరంగా విఫలమయ్యారని రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు.
మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలిచేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఈ సందర్భంగా పలువురు పీసీసీ చీఫ్ రఘువీరా సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బడుగు, బలహీన వర్గాలవారికి మేలుచేసింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రఫీయుల్లా బేగ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గాదిరాజు లచ్చిరాజు, నడింపల్లి అన్నపూర్ణ, జిల్లా ఇన్‌ఛార్జి నరహరశెట్టి నర్సింహరావు, అంకెం సీతారామ్, వేగేశ్న గోపాలకృష్ణంరాజు, ఆరేటి రంగారావు, బొల్లం ఏడుకొండలు, సోడదాసి గంగయ్య తదితరులు పాల్గొన్నారు.