ఆంధ్రప్రదేశ్‌

అది ప్రతీకార చర్య కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, అక్టోబర్ 12: ఆంధ్ర - ఒడిసా సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం జరిగిన మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ను ఇటీవల జరిగిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమా హత్యలకు ప్రతీకారంగా భావించనవసరం లేదని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో కొత్తగా నిర్మించిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఏజెన్సీ, సరిహద్దుల్లో ప్రత్యేక దళాల కూంబింగ్ నిత్యం జరుగుతూనే ఉంటుందని, ఆ సమయంలో మావోయిస్టులు తారసపడితే ఎదురుకాల్పులు జరుగుతాయని, వాటిని ప్రతీకార దాడులుగా భావించరాదన్నారు. కూంబింగ్ సమయంలో కొందరు మావోయిస్టులు లొంగిపోవడం, కొందరిని పట్టుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేక దళాల కూంబింగ్ జరుగుతోందని చెప్పారు. ఇటీవల జరిగిన కిడారి, సోమాల హత్యలకు మావోయిస్టులే కారణామా కాదా అన్నదానిపై విచారణ జరుగుతోందన్నారు. తామే ఈ హత్యలకు పాల్పడినట్టు మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖ వాస్తవమా కాదా అన్నదానిపై సిట్ విచారణ జరుపుతోందన్నారు. మావోయిస్టుల దాడులు, పోలీసుల కూంబింగ్ నేపధ్యంలో ప్రజాప్రతినిధులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటుందని చెప్పారు. ఇదిలావుండగా, తిత్లీ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు. ఒక డివిజన్ పూర్తిగా దెబ్బతిందన్నారు. తిత్లీ ప్రభావంతో మన రాష్ట్రంలోని శ్రీకాకుళంతోపాటు ఒడిస్సాలోని ఏడు జిల్లాల్లో నష్టం వాటిల్లిందన్నారు.
ఐటీ దాడులు కేంద్రం కక్ష సాధింపే
ఎన్డీయే నుంచి తెలుగుదేశం పార్టీ విడిపోయాక రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ సారధ్యంలోని కేంద్రం అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతోందని చినరాజప్ప ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబును బాబ్లీ ప్రాజెక్టు కేసులో ఇరికించి ఇబ్బందులకు గురిచేయాలని చూస్తోందన్నారు. తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ తదితర నాయకులపై ఐటి దాడులు చేయించి, మరోసారి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ దాడులు తప్పుకాదని, బీజేపీ నేత జీవిఎల్ నరసింహారావు అనడం సమంజసం కాదన్నారు. కేంద్రం కూడా ఎన్నో కుంభకోణాల్లో ఇరుక్కుందని, ముందు వాటిపై విచారణలు జరిపించి, రాష్ట్రంపైకి రావాలన్నారు. పోలీసులకు గతంతో పోలిస్తే పనిభారం పెరిగిందని, దానికి తగ్గట్టుగా వారికి అన్ని సౌకర్యాలూ కల్పించడానికి మోడరన్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో 73 మోడరన్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం ప్రారంభించగా ఇప్పటికి 40 పూర్తయ్యాయన్నారు. కోనసీమలోనే తొలి మోడరన్ పోలీస్టేషన్‌ను శుక్రవారం అమలాపురంలో ప్రారంభించామన్నారు. అలాగే పోలీసులకు విశ్రాంతి గదులు తదితర నిర్మాణాలపై కూడా దృష్టిసారించామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో మూడు నెలలకొకసారి సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ కెవి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.