ఆంధ్రప్రదేశ్‌

సంక్షేమ పథకాల వేలంపాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 9: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాల వేలం పాట జరుగుతోందని, ఒక్క రూపాయైనా ఎక్కువిచ్చి ఓటర్ల మనసు దోచుకునేందుకు రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు రూపొందిస్తున్నాయంటూ పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. జన చైతన్య వేదిక ఆధ్వర్యాన విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివారం జరిగిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఈ వేలంపాట స్పష్టంగా వెలుగులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం రూ.1000 ఇస్తున్న సామాజిక పింఛన్లను రూ.3000కు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే రూ.3,016 ఇస్తామంటూ టీఆర్‌ఎస్ వాగ్దానం చేసిందని గుర్తు చేశారు. అంటే ప్రజాప్రతినిధులు తాము చేస్తున్న అవినీతిలో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారని విమర్శించారు. ఒక్క అసెంబ్లీ సీటు గెలిచేందుకు రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక్కొక్కరు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నారని, అంటే రోజుకు సుమారు రూ.లక్ష ఖర్చు చేస్తున్నారన్నారు. ఈ మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు రాజకీయ వ్యాపారం చేస్తున్నారే తప్ప, అభివృద్ధిపై దృష్టి సారించట్లేదన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై పెట్టుబడి పెట్టే పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు అంతకు రెండింతలు రాబట్టకుండా వదలరన్నారు. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బిచ్చి ప్రలోభపెట్టడం సర్వసాధారణమైందని, కొన్ని రాజకీయపార్టీలు మాత్రం ఎదుటి పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకోండి, కానీ ఓటు మాత్రం మాకే వేయండంటూ ప్రచారం చేసుకుంటున్నాయన్నారు. ఇదే సందర్భంలో మా పార్టీ అభ్యర్థి ఓటుకు డబ్బిస్తే ఓడించండని ఎందుకు ప్రజలను కోరట్లేదని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సందర్భంగా జరిగిన పరిణామాలను ఉండవల్లి వివరించారు. తలుపులు మూసి, లైట్లార్పి రాష్ట్రాన్ని అసంబద్ధంగా విభజించారని, ఈ విభజన చెల్లదని తాను మొదటి నుంచి వాదిస్తున్నానన్నారు. రాజకీయాల్లో మార్పు రావాలని చెబుతూనే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఉదహరించారు. కేజ్రీవాల్ రాజకీయ ప్రవేశం, ముఖ్యమంత్రిగా విజయం సాధించి కీలక నిర్ణయాలే తీసుకున్నారన్నారు. ప్రధాని కాకముందు నరేంద్ర మోదీ కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారని, అయితే కొద్ది కాలానికే పరిస్థితులు మారిపోయాయన్నారు. బీజేపీ ఆవిర్భావం నుంచి రాని పార్టీ ఫండ్, నాలుగేళ్లలో పదింతలు పెరిగిందన్నారు. రాజకీయాలు లాభసాటి వ్యాపారంగా మారిపోయిందని, కలకాలం అధికా రం చెలాయించాలన్న కాంక్ష పెరుగుతుందన్నారు.
రాజకీయాలు, సినిమాల్లోనే వారసత్వం నడుస్తోందని, ఒక రైతు తన కొడుకును రైతుగా చూడాలని కోరుకోవట్లేదన్నారు. విపత్తులు, విధ్వంసాలను కూడా రాజకీయంగా ప్రచారానికి వాడుకుంటున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు. కమిషన్ల కోసమే ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అందుకు ఆదరణ-2 పథకమే నిదర్శనమన్నారు. విద్యార్థుల కోసం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి రూ.10 కూడా ఖర్చు పెట్టని ప్రభుత్వం అన్న కేంటీన్లలో మాత్రం సబ్సిడీ భరించి భోజనం పెడుతోందన్నారు. కేవలం ఓట్ల కోసమే ఈ పథకాలు అమలు చేస్తున్నారంటూ విమర్శించారు. రాజకీయాల్లోకి మచ్చలేని నిజాయితీపరులు అవసరం లేదని, నిబంధనల మేరకు పనిచేసే వారైతే చాలన్నారు. అన్ని అంశాలపై స్పందించే యువత రాజకీయాలు, నీతి వంతమైన పాలన తదితరాలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పి.లక్ష్మణరెడ్డి, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ ప్రసంగించారు.
చిత్రం.. సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సులో మాట్లాడుతున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్