ఆంధ్రప్రదేశ్‌

అందరూ ఓటు వేసేలా ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఎన్నికల్లో ప్రజలంతా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రామ్‌ప్రకాష్ సిసోడియా స్పష్టం చేశారు. సచివాలయం 5వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం సిసోడియా అధ్యక్షతన అందరికీ అందుబాటులో ఎన్నికలు అనే అంశంపై తొమ్మిది మంది సభ్యులతో కూడిన రాష్టస్థ్రాయి స్టీరింగ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి స్టీరింగ్ కమిటీలను జిల్లా, శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దివ్యాంగులు, అంధులు, మూగ, చెవుడు ఓటర్లు పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేసేందుకు తగిన సదుపాయాలు కల్పించాలని సూచించారు. వీటి పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గంలో ఒక నోడల్ అధికారి ఉంటారని, అయితే ఎలాంటి సౌకర్యాలు కల్పించారో కమిటీ సభ్యుల సలహా మేరకు నిర్ణయించాల్సి ఉందన్నారు. బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్ ఉంటుందని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లో కూడా ఈ లిపి ఉంటుందని వివరించారు. పోలింగ్ స్టేషన్లు అన్నీ కింది అంతస్తులోనే ఉండే విధంగా చూడాలన్నారు. ఇంకా కొన్ని మొదటి అంతస్తులో ఉన్నాయని, వాటికి ప్రత్యామ్నాయంగా గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. జిల్లాల్లో అలాంటి పోలింగ్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాల్లో ఎక్కడ ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో కేటగిరీల వారిగా పూర్తి వివరాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు ఎన్ని ఉన్నాయో కూడా వివరాలు సేకరించాలని, పోలింగ్‌బూత్‌లు ఉన్న పాఠశాలలకు ఏవైనా మరమ్మతులు చేయించాల్సి ఉంటే త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రాష్ట్రంలో దివ్యాంగులు, అంధులు, మూగ, చెవిటి వారు 12లక్షల మంది ఉన్నారని, వీరిలో 5.5 లక్షల మంది పింఛన్లు తీసుకుంటున్నారని వివరించారు. వీరిలో ఎంతమది ఓటర్లుగా నమోదయ్యారో, ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఎంతమంది ఉన్నారో లెక్కతేల్చితే వారికి అవసరమైన రవాణా, వీల్‌చైర్ వంటి సౌకర్యాలు కల్పించటానికి ప్రయత్నిస్తామన్నారు. ఓటర్లలో ఇలాంటి వారిని ఇప్పటి వరకు 2.72 లక్షల మందిని గుర్తించామని, గుర్తింపు ఇంకా కొనసాగుతోందని చెప్పారు. వారు లైన్‌లో నిలబడకుండా నేరుగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటు వేసే అవకాశం కల్పించాలన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఏదైనా లోపం ఉంటే స్వయంగా నమోదు చేయించుకోవాలని సూచించారు. అలాంటి వారి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని గుర్తించి వారితో ఎన్నికల సమయంలో ఒక యాడ్ రూపొందించి ప్రచారం చేస్తామన్నారు. రాష్ట్రానికి చెందిన అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ అజయ్‌కుమార్‌రెడ్డితో పాటు పలువురు క్రీడాకారులను సభ్యులు సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే 18 ఏళ్లు దాటిన వారిని ఓటర్లుగా చేర్పించాలని, ఆ బాధ్యతలను సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు అప్పగించాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ పరిధిని జియో ఫెన్సింగ్ ద్వారా గూగుల్ మ్యాప్‌లో గుర్తించాలని సూచించారు. ప్రతి రెండు నెలల కోసారి కమిటీ సమావేశమవుతుందని చెప్పారు. కమిటీలో పంచాయతీరాజ్ తదితర మరో 5 ప్రభుత్వ శాఖలకు చెందిన వారిని సభ్యులుగా చేర్చనున్నట్లు ప్రకటించారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం, సాంఘిక సంక్షేమం, విద్యా, రోడ్లు, భవనాలశాఖల అధికారులు, విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్, డెఫ్ అండ్ డమ్ ఏపీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని సలహాలు, సూచనలిచ్చారు. ప్రతి కమిటీలో దివ్యాంగులు, అంధులు, మూగ, చెవిటి వారు ముగ్గురూ సభ్యులుగా ఉంటే మంచిదని, ఓటు వేసే విధానం గురించి వారికి శిక్షణ ఇవ్వాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంధుల వెంట సహాయకులను అనుమతించలేదని, అందుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ కుమార్ రాజా మాట్లాడుతూ కొన్ని వీల్‌చైర్లు తమ వద్ద ఉన్నాయని, అవసరమైన చైర్ల సంఖ్య లెక్కతేలితే మరిన్ని కొనుగోలు చేస్తామన్నారు. సమావేశం లో విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అ ధ్యక్షులు రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.