ఆంధ్రప్రదేశ్‌

పోలీసు నియామకాలకు రెండు రోజుల్లో నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూలై 17: రాష్ట్ర విభజన అనంతరం మొట్టమొదటిసారిగా పోలీసు శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయనున్నామని, అందుకు సంబంధించి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర డిజిపి జాస్తి వెంకటరాముడు స్పష్టం చేశారు. ఇక నుంచి పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో 5 కి.మీ పరుగు పందెం స్థానంలో 1 లేదా 2 కి.మీ పరుగు పందెం పరీక్ష మాత్రమే ఉంటుందని తెలిపారు. డిజిపి ఆదివారం కడప నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసు శాఖలో యుద్ధప్రాతిపాదికన తొలి విడతగా 6వేల మంది పోలీసుల నియామకం చేపట్టనున్నామని, వచ్చే ఏడాది మరికొంతమందిని రిక్రూట్ చేసుకుంటామని తెలిపారు. పోలీసుశాఖలోనే రిక్రూట్‌మెంట్ బోర్డుకు పూర్తిస్థాయి బాధ్యత అప్పగించామని, పోస్టుల భర్తీ పారదర్శకంగా జరుగుతుందన్నారు. ఇక నాణ్యమైన పెట్రోల్ సరఫరా చేసేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా ప్రభుత్వానికి, కంపెనీలకు ప్రయోజనం ఉంటుందని, అలాగే పోలీసు శాఖకు ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా అదుపులోకి వచ్చిందని, స్మగ్లర్ల ఆటకట్టించేందుకు ప్రత్యేకంగా ఒక డిఐజిని నియామకం చేసినట్లు తెలిపారు. స్మగ్లర్లకు సహకరిస్తే సొంత శాఖ వారైనా వదిలే ప్రసక్తేలేదని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ నేతృత్వంలో కూడా ప్రత్యేక బృందాలు నిఘా వుంచాయన్నారు. డిజిపితో పాటు రాయలసీమ జోన్ ఐజి శ్రీ్ధర్‌రావు, కర్నూలు డిఐజి రమణకుమార్, జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ, ఏఎస్‌పి విజయకుమార్, ఓఎస్‌డి(ఆపరేషన్స్) సత్యయేసుబాబు, పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్, డీఎస్పీలు అశోక్‌కుమార్, రాజేంద్ర, పూజితనీలం, శ్రీనివాసులు, నాగేశ్వరరెడ్డి, తదితరులు ఉన్నారు.

విశాఖలో ఢిల్లీ బాలుడి కిడ్నాప్!

పర్యాటకులను విడిచిపెట్టి
కారుతో డ్రైవర్ పరార్

పరవాడ, జూలై 17: ఢిల్లీకి చెందిన 10 ఏళ్ల బాలుడి కిడ్నాప్ ఉదంతం విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలకలం రేపింది. పరవాడ పోలీసులు అందించిన వివరాలివి. ఢిల్లీ ప్రాంతానికి చెందిన ఖలీల్‌ఖాన్, గీత, కబీర్‌ఖాన్‌లతో పాటు గీత కుమారులైన జాదు, హక్క్‌లు విశాఖ అందాలను తిలకించేందుకు రైలులో శనివారం నగరానికి చేరుకున్నారు. రైల్వేస్టేషన్ వద్ద శ్రీకాంత్ అనే డ్రైవర్ ఒక విజిటింగ్‌కార్డు ఇచ్చి కారు అవసరం ఉంటే ఫోన్ చేయాలని చెప్పాడు. అనంతరం ఖలీల్‌ఖాన్, గీత, కబీర్‌ఖాన్‌లతో పాటు ఇరువురు చిన్నారులు విశాఖపట్నంలో గల ఒక లాడ్జిలో దిగారు. ఆదివారం ఉదయం విశాఖ అందాలను చూసేందుకు రైల్వేస్టేషన్ వద్ద విజిటింగ్ కార్డు ఇచ్చిన డ్రైవర్ శ్రీకాంత్‌కు ఫోన్ చేశారు. వెంటనే ఆయన ఇన్నోవా కారును తీసుకుని లాడ్జికి వెళ్లి అక్కడ నుండి వారిని ఎక్కించుకుని విశాఖ అందాలను చూపించారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు లంకెలపాలెం వద్దకు చేరుకున్నారు. లంకెలపాలెం వద్ద వాటర్ బాటిల్‌ను కొనుగోలు చేసుకునేందుకు కారులో ప్రయాణిస్తున్న మొత్తం అయిదుగురిలో నలుగురు కిందకి దిగారు. జాదు అనే 10 ఏళ్ల బాలుడు కారులో నిద్రపోతుండంతో కారులోనే విడిచిపెట్టారు. నలుగురు వ్యక్తులు కారు దిగిన వెంటనే డ్రైవర్ కారుతో పరార్ అయ్యాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అనకాపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే, సంఘటన జరిగింది పరవాడ పోలీస్‌స్టేషన్ కావడంతో వెనువెంటనే అనకాపల్లి పోలీసులు పరవాడ పోలీసులకు సమాచారం అందించారు. పరవాడ ఇన్‌స్పెక్టర్ సోమునాయుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో అన్ని పోలీస్‌స్టేషన్లను అప్రమత్తం చేశారు. కిడ్నాపర్ కోసం గాలింపు ప్రారంభించారు. డ్రైవర్ శ్రీకాంత్‌గా భావిస్తున్న ఒక ఫోటోను పోలీసులు విడుదల చేశారు. కారులో బాలుడు జాదుతో పాటు 30వేల రూపాయల నగదుతో ఓ బ్యాగు ఉన్నట్టు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఢిల్లీ బాలుడు జాదు కిడ్నాప్‌పై పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి గీత,
బంధువులు... కారు డ్రైవర్‌గా భావిస్తున్న వ్యక్తి