ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గంపేట, జూలై 17: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో ఆదివారం ఆగి ఉన్న తాటి దుంగల లోడు ట్రాక్టర్ ట్రక్కును మోటారుసైకిల్ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. రాజమండ్రి నుంచి మోటారుసైకిల్‌పై కత్తిపూడి వెళ్తున్న ముగ్గురు యువకులు జగ్గంపేటరామవరం జాతీయ రహదారి 16పై జగ్గంపేట శివారు సామిల్లు వద్ద ఆగివున్న తాటి దుంగల ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఈ సంఘటనలో షేక్ నబీసాహెబ్ (20), వేల్పూరి శ్రీహరి (19), ఒరిగంటి దుర్గారావు(20)లు అక్కడికక్కడే మృతి చెందారు. మోటారుసైకిల్ నడుపుతున్న షేక్ నబీసాహెబ్, మరో ఇద్దరు లారీ క్లీనర్లుగా పనిచేస్తున్నారు. కత్తిపూడిలో ఉన్న తన లారీపై క్లీనర్‌గా ఎక్కేందుకు నబీసాహెబ్ తన స్నేహితులు శ్రీహరి, దుర్గారావులతో మోటారుసైకిల్‌పై రాజమండ్రి నుంచి కత్తిపూడికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఈ ప్రమాదం సంభవించింది. ముగ్గురు యువకులకూ వివాహాలు కాలేదు. ఇదిలా ఉంటే కేసును తప్పుదోవ పట్టించేందుకు సామిల్లు నిర్వాహకులు ట్రాక్టరును సంఘటనా స్థలం నుంచి తీసుకువెళ్లి ఒక పెంకు మిల్లు ఫ్యాక్టరీ ఆవరణలో దాచిపెట్టారు. ట్రాక్టర్ ఇంజనును సామిల్లు ఆవరణలో దాచిపెట్టారు. మృతదేహాలను సైతం తీసివేసి ఒకరిపై ఒకరిని పడేసి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి పోయినట్లుగా ప్రచారంచేసి పుకార్లు సృష్టించారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట ఇన్‌ఛార్జి, పెద్దాపురం సిఐ శ్రీధర్‌బాబు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి, ట్రాక్టర్ టైర్ల ఆనవాళ్ల ప్రకారం సామిల్లు నిర్వాహకులు దాచి ఉంచిన ట్రాక్టర్ ట్రక్కును పోలీసులు సీజ్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వారంలోగా
శ్రీనివాస్ ఇంటికి..
వైద్య పరీక్షల అనంతరం
తిరుగు ప్రయాణం
భార్య లలితను
పరామర్శించిన మంత్రి గంటా
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 17: నైజీరియాలో కిడ్నాపర్ల చెర నుంచి విడుదలైన ఇంజనీర్ సాయి శ్రీనివాస్ వారం రోజుల్లోగా స్వస్థలానికి తీసుకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖలోని ఆయన కుటుంబీకులను ఆదివారం పరామర్శించిన ఆయన భార్య లలితతో మాట్లాడారు. నైజీరియా కిడ్నాప్ కథ సుఖాంతమైందని, అయితే కొన్ని సాంకేతిక కారణాలతో శ్రీనివాస్ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని స్వస్థలానికి తిరిగి వస్తారని మంత్రి వివరించారు. నైజీరియాలో విశాఖ వాసి కిడ్నాపైన విషయాన్ని స్థానిక అధికారులు తనకు వివరించారని, సిఎం చంద్రబాబు, భారత విదేశాంగ శాఖతో చర్చించి విడుదలకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇదే సందర్భంలో భర్తను ఎక్కడో విదేశంలో కిడ్నాప్ చేసిన ఉదంతం తెలిసినప్పటికీ ఎంతో గుండె ధైర్యంతో ప్రభుత్వం, అధికారులతో మాట్లాడి, భర్తను విడుదలకు పట్టుదలతోశ్రమించిన లలితను మంత్రి గంటా అభినందించారు.
ఎయు విసిగా
నాగేశ్వరరావు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 17: ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ఆ విశ్వవిద్యాలయానికి చెందిన స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ సీనియర్ ప్రొఫెసర్ గొల్లపల్లి నాగేశ్వరరావు పదవీ బాధ్యతలను ఆదివారం స్వీకరించారు. దాదాపు ఐదు నెలలుగా ఇన్‌చార్జి పాలనలో ఉన్న ఎయుకు ఎట్టకేలకు పూర్తిస్థాయి వీసీని నియమించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యా ప్రమాణాల మెరుగుకు, పరిశోధనలకు పెద్దపీట వేస్తామని తెలిపారు. ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరిచేందుకు వీలుగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర గవర్నర్‌కు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
పెద్దకోటలో డయేరియా..
తల్లి, కుమార్తె మృతి
ఎల్‌ఎన్ పేట, జూలై 17: శ్రీకాకుళం జిల్లా, ఎల్‌ఎన్ పేట మండలంలోని ఎల్‌ఎన్ పేట గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దకోట గ్రామంలో డయేరియా విజృంభించింది. దీంతో తల్లి, కుమార్తె మృతి చెందారు. కొద్ది రోజులుగా గ్రామంలో పారిశుద్ధ్యం లోపించింది. ఎక్కడికక్కడే పైప్‌లైన్లు మరమ్మతులకు గురవడంతో మంచినీటిలోకి మురికినీరు చేరిపోయి నీరు కలుషితమైంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన జనలక్ష్మి(55) శనివారం రాత్రి మృతి చెందగా, ఆమె కుమార్తె డి.రమణమ్మ(35)ను ఆదివారం వ్యాధి పొట్టనపెట్టుకుంది. ఇంకా గ్రామంలో మరో పది మంది వరకూ వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఆదివారం పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గ్రామాన్ని సందర్శించారు. వైద్య సిబ్బంది పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది రోగులు ప్రైవేటు వైద్యుల వద్ద చికిత్స పొందుతుండగా, మరికొంతమంది శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. భార్య, కూతురు మృతి చెందగా భర్త జన గురువులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్‌కు తరలించారు. డిఎం అండ్ హెచ్‌ఒ మెండ ప్రవీణ్ గ్రామానికి చేరుకున్నారు. గ్రామ పాఠశాల ఆవరణలో వైద్య శిబిరం ఏర్పాటు చేయించారు.
తిరుమలలో భారీ వర్షం
తిరుమల, జూలై 17: తిరుమలలో ఆదివారం సాయంత్రం ఓ గంటపాటు వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రం 5.30 గంటలకు ఒక్కసారిగా మారిపోయి చల్లబడింది. అటు తరువాత 6 గంటల నుంచి సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో తిరుమలలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. షాపింగ్ కాంప్లెక్స్, కల్యాణకట్ట, మాధవ నిలయం తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా బయట ఉన్న దుకాణాలు మూతబడ్డాయి. ఇదిలా ఉండగా వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. రద్దీ అధికంగా ఉండడంతో గదులు దొరకక రోడ్లపై సేదదీరుతున్న భక్తులు వర్షంవల్ల ఇబ్బందులు పడ్డారు.