ఆంధ్రప్రదేశ్‌

టీడీపీతో జనసేన జతకట్టేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 2: తెలుగు రాష్ట్రాలు కేంద్రంగా ఫెడరల్ ఫ్రంట్.. బీజేపీ యేతర ఐక్య ఫ్రంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో మహాకూటమి.. ఇలా పొత్తులపై వ్యూహాత్మక రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఫెడరల్ ఫ్రంట్‌లో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భాగస్వామి కానున్నారని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ కేంద్రంలో రెండే రెండు కూటములని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని బీజేపీ యేతర కూటమి మాత్రమే మిగులుతాయని స్పష్టం చేస్తున్నారు. తనతో పాటు మమత కూడా ఈ కూటమిలో భాగస్వామిగా ఉంటారని తేల్చిచెప్తున్నారు. అంతేకాదు రాష్ట్ర హక్కుల సాధన కోసం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తమతో కలసి వస్తే వైసీపీకి అభ్యంతరమెందుకని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పవన్‌కళ్యాణ్ ప్రభుత్వంపై కత్తికట్టారని చంద్రబాబు ఆరోపిస్తూ వస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితం వరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. లోకేష్.. మంత్రులు..ఎమ్మెల్యేలపై కత్తులు నూరుతున్న జనసేన పార్టీ టీడీపీతో జతకడుతుందనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై పవన్ కళ్యాణ్ వౌనం వహించటం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిస్తోంది.
రాష్ట్ర విభజన సమయంలో పవన్‌కళ్యాణ్ దేశంలో కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేస్తామని, అవసరమైతే ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తానని ప్రకటించటంతో పాటు గత సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అంతేకాదు రాష్ట్రంలో అనుభవం ఉన్న వ్యక్తిగా చంద్రబాబుతో జతకట్టి తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చారు. అయితే అప్పటికి పార్టీ ఆవిర్భవించిన తొలిరోజులు కావటంతో గత సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి ప్రచారం చేశారు. గత ఏడాదిన్నర కాలంగా పవన్‌కళ్యాణ్ టీడీపీతో విభేదిస్తూ తీవ్ర విమర్శలకు దిగటంతో టీడీపీ ఒంటరి పోరాటం చేస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి టీడీపీ ఏర్పాటు చేసిన మహాకూటమి ఘోర పరాజయాన్ని చవిచూసిన నేపథ్యంలో ఏపీలో పొత్తులపై సందిగ్ధత నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో కేంద్రం అనుసరిస్తున్న అణచివేత విధానాలపై ప్రజల సెంటిమెంట్‌ను రగిల్చేలా టీడీపీ ప్రచారం చేస్తోంది. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తరువాత విభజనతో రాష్ట్రానికి రూ 75వేల కోట్లు రావాల్సి ఉందని జనసేన పార్టీ నిజనిర్ధారణలో తేలింది. టీడీపీతో ఢీకొన్న దగ్గర నుంచి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఈ అంశాలను పక్కనపెట్టారనే ఆరోపణలు ప్రచారంలో ఉన్నాయి. అంతేకాదు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లో వైసీపీ, జనసేన చేరతాయనే వాదనలు కూడా వినవచ్చాయి. అంతేకాదు టీడీపీపై మూక్ముడి దాడి కూడా ఈ వాదనలకు బలాన్నిచ్చింది. ఫెడరల్ ఫ్రంట్ మాటెలా ఉన్నప్పటికీ రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలకు పోటీచేయాలని జనసేన నిర్ణయించింది. ఇంతలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించాల్సి ఉంది. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఒంటరి పోరాటం చేస్తున్నట్లు టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లాలంటే ప్రత్యేక హోదాతో పాటు విభజన అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశాలు లేకపోలేదని పవన్ భావిస్తున్నారు. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం నేతల అవినీతికి అంతులేకుండా పోతోందనే ఆరోపణలపైనే ఆయన నిలదీస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయానికొస్తే టీడీపీతో జతకట్టినా లేకున్నా ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చాలనే డిమాండ్‌ను ముందుకు తీసుకురాక తప్పదు. ఈ పరిస్థితుల్లో గత కొద్దిరోజులుగా జనసేన అధినేత టీడీపీపై విరుచుకుపడటం తగ్గించారు.
ఇదే అదనుగా టీడీపీ, జనసేన మధ్య ముసుగు తొలగిందంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. ఇదిలా ఉండగా గత కొద్దిరోజుల క్రితం వరకు రాష్ట్రంలో 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ గెలిచితీరాలని పార్టీనేతలకు దిశానిర్దేశం చేస్తున్న చంద్రబాబు తాజాగా 25 పార్లమెంటుతో పాటు 150 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిస్తున్నారు. దీంతో ఆ పాతిక సీట్లు పొత్తు కుదుర్చుకునే పార్టీకి ఆఫర్ చేస్తున్నారేమో అని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. మహాకూటమి ఏర్పాటైతే కాంగ్రెస్ కలయికతో పోటీ చేసేందుకు సంఖ్యను తగ్గించారా? లేక జాతీయ స్థాయిలో బీజేపీ యేతర కాంగ్రెస్ కూటమికి మద్దతిస్తూ జనసేనకు ఆఫర్ చేస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. కాగా బాబు వ్యాఖ్యలపై పవన్ ఏ రకంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే.