ఆంధ్రప్రదేశ్‌

చుక్కల భూముల సమస్యకు ఇక ముగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 3: రాష్టవ్య్రాప్తంగా చుక్కల భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలోనే ముగింపు పలికి, శాశ్వత పరిష్కారం చూపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చుక్కల భూములపై అవసరమైతే చట్టంలో మార్పులు చేసైనా రైతుల రుణం తీర్చుకుంటామని తెలిపారు.
గుంటూరు జిల్లా అచ్చంపేటలో గురువారం జరిగిన జన్మభూమి - మా ఊరు గ్రామ సభకు ముఖ్యఅతిథిగా చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఊరంతా భూమి ఎవరిదని చెబితే వారికే చెందేలా చూస్తామని, దీనిలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. రైతుల రుణమాఫీకి కేంద్రం ఏ మాత్రం సహకరించకపోగా రాష్ట్భ్రావృద్ధికి ఇవ్వాల్సిన నిధులను సైతం తొక్కిపట్టి మరీ ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చించేందుకు బీజేపీ నేతలు సిద్ధమేనా అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయాల్సిన కేంద్రం విభేదాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు పన్నుతోందన్నారు.
ఆంధ్రులకు చేయూతనిస్తే గుజరాత్‌ను మించిపోతామన్న దురుద్దేశంతో అడుగడుగునా అభివృద్ధికి అడ్డుపడుతున్న మోదీపై నిప్పులు చెరిగారు. ఓ పక్క ఆదాయం లేదు, రాజధాని లేమి, మరోపక్క లోటుబడ్జెట్ ఉన్నప్పటికీ ప్రజల శ్రమతో రాష్ట్రాన్ని నిలదొక్కుకునేలా చేసుకున్నామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును కాంగ్రెస్ హయాంలోనే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒరగబెట్టిందేమీ లేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టుకు 58 వేల కోట్లు అంచనా వ్యయం ఉండగా కేవలం 7 వేల కోట్ల రూపాయలు మాత్రమే అందించి చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే 3,500 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. రాష్ట్రానికి సహకారం అందించకపోగా కేంద్రం ఎదురుదాడి చేస్తోందని ఆరోపించారు. అదేమని ప్రశ్నిస్తే ఐటీ దాడులు చేస్తూ భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి తీవ్ర పరాభవం ఎదురైందని, ఇంత జరిగినా మోదీ సమర్ధించుకోవడం హాస్యాస్పదమన్నారు. తెలుగుదేశం పార్టీ ఎవరికీ దాసోహం కాదని చంద్రబాబు స్పష్టంచేశారు.
మోదీ, కేసీఆర్, జగన్ త్రయం కలిసి ఎన్ని కుట్ర రాజకీయాలు చేసినా చివరకు విజయం తమదేనని ధీమా వ్యక్తంచేశారు. దేశంలోనే అతి తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం మనదేనని, రాఫెల్ డీల్‌లో అవినీతికి పాల్పడిన వారు తమను విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనులపై ఇప్పటికే 10 శే్వతపత్రాలను విడుదల చేశామన్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తామని, 2029 నాటికి దేశంలోనే ఏపీని నెంబర్ వన్‌గా నిలుపుతామని పేర్కొన్నారు. జగన్ మెడపై సీబీఐ కత్తి ఉండటం వలనే వారికి దాసోహమయ్యాడని ఎద్దేవాచేశారు. జగన్‌కు రాజకీయ అనుభవమే లేదని, తప్పుడు లెక్కల్లో అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని, చివరి బాధితుడి వరకు పరిహారం అందిస్తామని, ఇప్పటికే తప్పుచేసిన వారిని జైలులో పెట్టామని గుర్తుచేశారు. కార్యక్రమంలో భాగంగా స్థానికంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. కాగా రానున్న సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందస్తు వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భోగి వేడుకల్లో పాల్గొనడంతో పాటు, గాలిపటాలను ఎగురవేశారు. సభలో పాల్గొన్న గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్, జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..ముందస్తు సంక్రాంతి వేడుకల్లో భాగంగా భోగి మంటలు వెలిగిస్తున్న ముఖ్యమంత్రి