ఆంధ్రప్రదేశ్‌

17లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: ప్రస్తుత ప్రపంచంలో ఆహార ధాన్యాల కొరత ప్రధాన సమస్యగా మారింది. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఆహారోత్పత్తి జరగడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా దేశాల ప్రభుత్వాలు తిండి గింజల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. భారతదేశంలో ప్రస్తుత జనాభా 120 కోట్ల పైమాటే. ఇంతమందికి సరిపడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి సాగించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం)ను ప్రారంభించింది. అతివృష్టి వచ్చినా... అనావృష్టి ఏర్పడినా తిండి గింజలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయం. ఇటువంటి పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి కేంద్రం సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. జాతీయ ఆహార భద్రతా మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో అధిక దిగుబడులు సాధించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. 4.20 లక్షల హెక్టార్లలో శ్రీవరి సాగుతోపాటు వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేయడం, పొలం గట్లపై కందులు సేద్యం చేయడంపై అవగాహన కల్పిస్తారు. అపరాలు, చిరుధాన్యాలు, వాణిజ్య పంటలు, నూనె గింజల మధ్యలో అంతరపంటగా కంది సాగు చేయడం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరిస్తారు. ఖరీఫ్ పంట కాలంలో రెండు పంటలు వేయడంపైనా శిక్షణ ఇస్తారు. సమస్యాత్మక భూముల్లో కొత్త వంగడాల వినియోగాన్ని వివరిస్తారు. నీటి ఎద్దడి తట్టుకునే సహభాగిధాన్, ఐ.ఆర్-64 వంగడాలను రైతులకు అందుబాటులో ఉంచుతారు. ఇలా 2016-17లో ఖరీఫ్, రబీతోపాటు వేసవిలో అపరాల సాగును 17 లక్షల హెక్టార్లలో ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.120 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. వరి సాగుకు రూ.29.21 కోట్లు, అపరాలకు 83.83 కోట్లు, ముతక చిరుధాన్యాల కోసం రూ.5.50 కోట్లు, ప్రత్తికి రూ.44 లక్షలు, గోగుకు రూ.91 లక్షలు, చెరకుకు రూ.20 లక్షల మేర ప్రభుత్వం వెచ్చిస్తోంది. తృణ ధాన్యాల సాగు విస్తీర్ణం, ఉత్పత్తితోపాటు వినియోగం పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తృణ ధాన్యాల సమగ్ర పునరుద్ధరణ కార్యక్రమాన్ని 2015-16లో ప్రారంభించింది. దీనిలో భాగంగా ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. చిరు ధాన్యాల ఉత్పత్తి పెంచడంతోపాటు వాటి వినియోగంపై ఆసక్తి కలిగేలా చేస్తోంది. తొలుత ఈ పథకాన్ని రాష్ట్రంలో 47 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఉన్న 16 గిరిజన మండలాలతోపాటు అనంతపురం, చిత్తూరు, కర్నూల్ జిల్లాల్లో ఉన్న 31 కరవు మండలాల్లో రాగులు, జొన్నలు వంటి తృణ ధాన్యాల సమగ్ర పునరుద్ధరణ పథకాన్ని ప్రారంభించారు. 47 మండలాల్లో రైతులకు తృణ ధాన్యాల సాగు, అధిక దిగుబడులపై శిక్షణ ఇచ్చారు. పట్టణాల్లో చిరు ధాన్యాల ఎగ్జిబిషన్లు, ఫుడ్ క్యాంపులు, వాటి వినియోగం వల్ల కలిగే లాభాలపై అవగాహన కల్పించారు.
పప్పు ధాన్యాల
ఉత్పత్తి లక్ష్యం పెంపు
పప్పు ధాన్యాల పథకం అమలు ద్వారా దేశంలోనూ, రాష్ట్రంలోనూ కలిపి సాగు విస్తీర్ణం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 15.80 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు అవసరమని లెక్కగట్టారు. ఇవి కేవలం మానవ అవసరాలకు మాత్రమే. విత్తనాలు, పశువుల మేత వంటి ఇతర అవసరాలకు మరింత ఉత్పత్తి అవసరముంది. ఆంధ్రప్రదేశ్‌లో 14.72 టన్నుల పప్పు ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. జాతీయ ఆహార భద్రత మిషన్ అమలులో భాగంగా 12వ పంచవర్ష ప్రణాళికలో 24.49 లక్షల టన్నుల మేర ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వం రూ.120 కోట్ల వరకూ వెచ్చిస్తోంది. ఈ మొత్తంతో ఆయా జిల్లాల్లో వరి, పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలతో పాటు ప్రత్తి, గోగునార సాగు చేయాల్సి ఉంటుంది. రైతులకు విత్తనాలు, వ్యవసాయ యంత్ర పరికరాలను రాయితీతో అందజేస్తారు. శ్రీకాకుళం జిల్లాకు రూ.16.89 కోట్లు, విజయనగరానికి రూ.12.23 కోట్లు, విశాఖపట్నం జిల్లాకు రూ.10.16 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అలాగే తూర్పు గోదావరికి 6.69 కోట్లు, పశ్చిమ గోదావరికి రూ.4.37 కోట్లను అందజేయనుంది. కృష్ణా జిల్లాకు రూ. 8.69 కోట్లు, గుంటూరుకు 8.47 కోట్లు, ప్రకాశం జిల్లాకు 10.62 కోట్ల రూపాయలను వెచ్చించనుంది. అదే సమయంలో నెల్లూరుకు రూ.4.88 కోట్లు, కర్నూలుకు 12.29 కోట్లు, అనంతపురం జిల్లాకు 11.07 కోట్లు కేటాయించింది. కడప, చిత్తూరు జిల్లాలకు రూ.9.95 కోట్లు, 3.49 కోట్లను వెచ్చిస్తోంది.