ఆంధ్రప్రదేశ్‌

కర్నూలులో టీడీపీ విలవిల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 18: కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ విపత్కర పరిస్థితుల్లో విలవిలల్లాడుతోంది. 2014 ఎన్నికల కంటే అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్న పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆశలకు గండికొట్టే విధంగా పరిస్థితులు తయారవుతున్నాయి. శ్రీశైలం అభ్యర్థిగా తాజా, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పేరు ఖరారు చేసి అధికారికంగా ప్రకటించిన అనంతరం చివరి క్షణంలో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు, రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయాలకు, కుటుంబానికి, కార్యకర్తలకు సరైన న్యాయం చేయలేకపోతున్నానని, అందుకే రాజకీయ జీవితానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నట్లు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం తన స్వగ్రామం వేల్పునూరులో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుడ్డా అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజకీయాలకు దూరం కావద్దని నినదించినా ఆయన నిర్ణయం మార్చుకోలేనని ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని ఆవేదనకు లోనయ్యారు. రాజకీయాల్లో తనకు అండగా ఉన్న చంద్రబాబు, తనను గెలిపించిన ప్రజలను ఆయన క్షమాపణలు కోరారు. ఇక నంద్యాల లోక్‌సభ లేదా శాసనసభ స్థానాల నుండి పోటీ చేసే అవకాశం దక్కకపోతే స్వతంత్రంగా బరిలోకి దిగుతామని ఎంపీ ఎస్పీవైరెడ్డి అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. తమ కుటుంబానికి అవకాశం కల్పించాలంటూ కుమార్తె సుజలను పోటీకి సిద్దం చేసిన ఆయన ఇప్పటికే పలుమార్లు పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలిసి విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై బాబు ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే నంద్యాల ఎంపీ స్థానానికి మాండ్ర శివానందరెడ్డి, శాసనసభ స్థానానికి భూమా బ్రహ్మానందరెడ్డి పేర్లు ఖరారు అయ్యాయని ప్రచారం ప్రారంభం కావడంతో ఎస్పీవైరెడ్డి తన సన్నిహితులు, అభిమానులతో సమావేశం ఏర్పాటు చేసి తమకు అవకాశం కల్పించని పక్షంలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులుగా తమ కుటుంబ సభ్యులు స్వతంత్రంగా పోటీ చేస్తారని ప్రకటించారు. మరోవైపు కోడుమూరు నియోజకవర్గంలోని ముగ్గురు నేతలను ఒప్పించి అభ్యర్థిని ఖరారు చేసే అంశంలో జరుగుతున్న జాప్యం పార్టీని గందరగోళంలోకి నెట్టేస్తోంది. ఈ నియోజకవర్గంపై పట్టుఉన్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పార్టీ ఇన్‌చార్జి విషువర్థన్‌రెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి తలా ఒకరి పేరు సిఫార్సు చేయడంతో ఎవరికి ఖరారు చేయాలో చంద్రబాబు నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో ఎదురూరు విష్ణువర్థన్‌రెడ్డి తన అభిమానులు, సన్నిహితులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తాను ఇన్‌చార్జిగా ఉన్న కోడుమూరు నియోజకవర్గానికి తాను సూచించిన అభ్యర్థికి టీడీపీ టికెట్ దక్కకపోవడంతో కఠిన నిర్ణయం తప్పదని హెచ్చరించారు. ఇదిలాఉండగా ఎప్పటి నుంచో నానుతున్న కర్నూలు శాసనసభ అభ్యర్థి ఎంపిక పీటముడి వీడలేదు. ఈ స్థానం నుండి తాజా మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే వారిరువురిని సర్దిచెప్పి ఒకరిని అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉన్నా జాప్యం జరుగుతుండడంతో ఇరువురు నేతలు ఆందోళనలకు గురవుతున్నారు. ఇరువురిలో ఏ ఒక్కరికి అవకాశం కల్పించకపోయినా వారు టీడీపీని వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతుంది. దీంతో ఎలాగైనా రానున్న ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకోవాలనుకున్న చంద్రబాబు ప్రయత్నాలు దినదినగండంగా మారాయి. మరి ఈ చర్యలు, ప్రతి చర్యలపై చంద్రబాబు ఎలాంటి వ్యూహాలు పన్ని సర్దుబాటు చేస్తారో వేచి చూడాల్సిందే.