ఆంధ్రప్రదేశ్‌

సీఎస్ రేసులో కల్లం, దినేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోసం ఇద్దరు సీనియర్ అధికారులు పోటీ పడుతున్నారు. ప్రస్తుత సీఎస్ ఠక్కర్ పదవీకాలం ఆగస్టు నెలాఖరుతో ముగియనుండటంతో కొత్త సీఎస్ రేసులో 1983 బ్యాచ్‌కి చెందిన అజయ్ కల్లం, దినేష్‌కుమార్ ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. వీరిద్దరూ కాకుండా ప్రస్తుతం సీసీఎల్‌ఏగా ఉన్న అనిల్‌చంద్ర పునేఠా కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి పరిస్థితి ప్రకారం అజయ్‌కల్లం అందరికంటే ముందున్నట్లు సమాచారం. ఢిల్లీకి చెందిన దినేష్‌కుమార్ కోసం ఎయిర్‌పోర్టుల నిర్మాణంలో పేరున్న ఒక కంపెనీ అధిపతి తన సామాజికవర్గ కోణంలో ప్రయత్నిస్తున్నారని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న దినేష్‌కుమార్ ప్రస్తుతం పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఉన్నారు. ఆయనకు మంచి అధికారిగా పేరుంది. ఇక ఏపిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన అజయ్ కల్లం కోసం, కొద్దినెలల క్రితం కాంగ్రెస్ నుంచి తెదేపాలో చేరిన సోదరులు ప్రయత్నిస్తున్నట్లు అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. రెడ్డి సామాజిక వర్గాన్ని తెదేపా నిర్లక్ష్యం చేస్తోందన్న అసంతృప్తి ఉన్నందున, అదే సామాజికవర్గానికి చెందిన అజయ్ కల్లంకు సీఎస్ ఇస్తే ఆ వర్గంలో ఉన్న అసంతృప్తిని పోగొట్టవచ్చని ఆ సోదరులు ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం.
దానికితోడు నిజాయితీపరుడిగా పేరున్న కల్లానికి ఎప్పుడూ, ఎవరికీ ఇవ్వనన్ని శాఖలు కేటాయించడం కూడా ఆయన ప్రాముఖ్యాన్ని స్పష్టం చేస్తోంది. ఫైనాన్స్, రెవిన్యూ, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, స్టాంప్ అండ్ ఎక్సైజ్, ప్లానింగ్ వంటి కీలక శాఖలన్నీ కల్లం పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు గతంలో సీఎంగా పనిచేసినప్పుడు కూడా ఒకే అధికారికి ఇన్ని శాఖలు కట్టబెట్టిన దాఖలాలు లేవని అధికారవర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ కోణంలో పరిశీలించినా అజయ్ కల్లానికి సీఎస్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి.
అదే సమయంలో సీఎంఓలో ఒక ముఖ్య అధికారి మాత్రం సీసీఎల్‌ఏగా ఉన్న అనిల్‌చంద్ర పునేఠా కోసం ప్రయత్నిస్తున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆయన రేసులో ఉన్న అజయ్ కల్లం, దినేష్‌కుమార్ కంటే జూనియర్ అయినందున, అవకాశాలు తక్కువగా ఉన్నాయని విశే్లషిస్తున్నారు. కాగా, ఠక్కర్ మరో మూడునెలల పొడిగింపు అవకాశాల కోసం అభ్యర్ధిస్తున్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి.