ఆంధ్రప్రదేశ్‌

ఎర్రన్న ఇంట్లో ముగ్గురు విజేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 24: దివంగత కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబం నుంచి రాజకీయ వారసులుగా అడుగుపెట్టిన ప్రతిఒక్కరూ ప్రజల మన్ననలు పొందిన వారే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎర్రన్న కుటుంబంలో ముగ్గురు విజేతలుగా నిలిచారు. రాష్టవ్య్రాప్తంగా వైసీపీ ప్రభంజనంలో కూడా ఎర్రన్న ఇంట మాత్రం టీడీపీ నుంచి చట్టసభలకు మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, తొలిసారిగా రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగిన ఎర్రన్న కుమార్తె ఆదిరెడ్డి భవానీ ఎన్నికయ్యారు. ఎర్రన్న సోదరుడు కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వరుసగా రెండోసారి గెలుపొంది చరిత్ర సృష్టించి 8,857 ఓట్లతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి ఎర్రన్న కుమారుడు కింజరాపు రామ్మోహన్‌నాయుడు కూడా రెండోసారి గెలిచారు. ఉత్కంఠ రేపిన ఎంపీ నియోజకవర్గ ఫలితాలలో 6258 ఓట్ల మోజార్టీ సాధించారు. ఒకే ఇంటి నుంచి బరిలోకి దిగిన వీరు ముగ్గురిని ప్రజలు ఆశీర్వదించడం గమనార్హం. ఇదిలా ఉండగా 2019 ఎన్నికల ఫలితాలకు 2004 ఫలితాలతో బలీయమైన సంబంధం ఉంది. 2004లో కూడా వైఎస్ హవా రాష్ట్రాన్ని కుదిపేసిన సమయంలో దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు టీడీపీ ఎంపీగా గెలిచారు. తాను ప్రజానేతనని నిరూపించుకునేందుకు ఆ గెలుపు దోహదపడింది. అంతకంటే ప్రభంజనమైన జగన్ హవాలో రామ్మోహన్‌నాయుడు గెలిచి తాను తండ్రికి తగ్గ తనయుడినని చాటుకున్నారు. జగన్ ధాటికి మహామహులంతా కుప్పకూలిన నేపథ్యంలో రామ్మోహన్‌నాయుడు మాత్రం గెలిచి నిలిచారు. శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు సెగ్మెంట్లు వైసీపీ విజయాలు సాధించింది. పదిహేను వేల పైచిలుకు మోజార్టీలతో ఆ పార్టీ అభ్యర్థులు ఆయా సెగ్మెంట్లలో గెలుపొందారు. టీడీపీ నుంచి టెక్కలి, ఇచ్చాపురం అభ్యర్థులు మాత్రమే పట్టుమని పదివేల ఓట్ల మోజార్టీ కూడా సాధించుకోలేకపోయారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రామ్మోహన్‌నాయుడు 6258 ఓట్ల తేడాతో దువ్వాడ శ్రీనివాస్ (వైసీపీ) అభ్యర్థిపై గెలుపొందారు. ప్రత్యర్థి ఎమ్మెల్యేలంతా బలమైన మోజార్టీలతో గెలిచినప్పటికీ జిల్లా రాజకీయాల్లో రామ్మోహన్‌నాయుడు ఉనికిని నిలబెట్టుకున్నారు. మూడుపదుల వయస్సు నిండని రామ్మోహన్‌నాయుడు రెండోసారి ఎంపీగా పార్లమెంట్‌లో అడుగుపెడుతున్నారు. జిల్లా ప్రజలు వైసీపీ అభ్యర్థులను ఎన్నుకున్నప్పటికీ ఎంపీగా మాత్రం రామ్మోహన్‌నాయుడును మాత్రమే కావాలని తీర్మానించుకున్నారు. ఈ విషయంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. సుమారు లక్షా 20,000 ఓట్లు వైసీపీ ఎమ్మెల్యేలకు, టీడీపీ ఎంపీ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ జరిగినట్టు గణాంకాలు రుజువుచేస్తున్నాయి.
రాత్రంతా హైడ్రామా
ఎంపీగా రామ్మోహన్‌నాయుడు ఎన్నికైనట్లు ప్రకటించడం వెనుక గురువారం రాత్రంతా కౌంటింగ్ కేంద్రాల్లో హైడ్రామా చోటుచేసుకుంది. తొలుత రామ్మోహన్‌నాయుడు తొమ్మిది వేల పైచిలుకు మోజార్టీతో ఎన్నికయ్యారని జిల్లా ఎన్నికల అధికారి నివాస్ ప్రకటించడానికి సిద్ధపడ్డారు. సాయంత్రానికి వైసీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళి మళ్లీ ఎంపీ ఓట్లను లెక్కించాలని కోరారు. దీంతో రీ-కౌంటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. గురువారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభమైన రీ-కౌంటింగ్ శుక్రవారం ఉదయం 4.30 గంటలకు ముగిసింది. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్‌లో మూడు వేల ఓట్లు రామ్మోహన్‌నాయుడుకు తగ్గడంతో మెజారిటీ 6258 ఓట్లకు దిగిపోయింది. టెక్కలి నియోజకవర్గంలో ఆరు పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థికి ఒకటి రెండు ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయని, పూర్తిగా అచ్చెన్న అడ్డా కావడంతో రిగ్గింగ్ జరిగిందని, ఆ పోలింగ్ కేంద్రాలకు మళ్ళీ పోలింగ్ నిర్వహించాలంటూ జిల్లా ఎన్నికల అధికారి దువ్వాడ శ్రీనివాస్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసారు. అయితే, ఆ డిమాండ్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించడంతో జిల్లా ఎన్నికల అధికారి రామ్మోహన్‌నాయుడుకు శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో ఎంపీగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ విషయంపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసిన దువ్వాడ శ్రీనివాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు. ఏదిఏమైనప్పటికీ రామ్మోహన్‌నాయుడు ఎన్నిక మాత్రం సిక్కోల్ జనం అభీష్టానికి వేదికగా నిలుస్తోంది!!