ఆంధ్రప్రదేశ్‌

చదువుల విప్లవం తీసుకువస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 14: రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ చదువుల విప్లవాన్ని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. బిడ్డల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదన్న సదుద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని రూపొందించామని పేర్కొన్నారు. శుక్రవారం రాజధాని ప్రాంతం తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యాశాఖ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన రాజన్న బడిబాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన జగన్ చదువుల తల్లి సరస్వతీదేవి చిత్రపటానికి పుష్పమాలలు అర్పించారు. దాదాపు రెండు వేల మంది బాలలకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ తన మనస్సుకు అన్నింటికన్నా నచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందన్నారు. ప్రతి పిల్లవాడు బడికి వెళ్లాలని, ఆ తర్వాత, కళాశాలకు వెళ్లి ఉన్నత చదువులు అభ్యసించాలన్నదే తన ఆశయమన్నారు. పేద ప్రజలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించేందుకు రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశానన్నారు. ఆ సమయంలో తమ పిల్లల్ని చదివించుకునే క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆత్మహత్యలను తాను కళ్లారా చూశానన్నారు. వ్యవస్థలో సంపూర్ణ మార్పు తీసుకువచ్చే ధృడసంకల్పంతో ప్రతి తల్లి, అక్క, చెల్లికి ఆ రోజే మాట ఇచ్చానని, ఆ మాటను నేడు నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టామని, వచ్చే జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున తమ పిల్లలను బడులకు పంపించే ప్రతి తల్లికి రూ. 15 వేలను అందించి పండుగ వాతావరణం సృష్టిస్తామన్నారు. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం సరాసరి 26 శాతం మంది చదువులేని వారు ఉంటే మన రాష్ట్రంలో 33 శాతం మేర ఉండటం అత్యంత బాధాకరమన్నారు. విద్యార్థులకు సరైన సమయంలో పుస్తకాలు, యూనిఫారం అందించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, విద్యావ్యవస్థను నాశనం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీగోడలు, ఫర్నీచర్ లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొని ఉంటే తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు ఎలా పంపిస్తారంటూ ప్రశ్నించారు. ప్రైవేటు విద్యారంగంలో వసూలు చేస్తున్న ఫీజులు చూస్తుంటే షాక్ కొడుతున్నాయని, నారాయణ, చైతన్య వంటి ప్రైవేటు పాఠశాలల్లో ఎల్‌కేజీకే రూ.20 వేలకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇటువంటి అన్యాయ పరిస్థితులను ఎదుర్కోవాలంటే తల్లిదండ్రులు కష్టపడాలని, దీనికి తాము చేదోడువాదోడుగా నిలుస్తామన్నారు. రాష్టవ్య్రాప్తంగా 40 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వీటి ప్రస్తుత స్థితిగతులపై ఫొటోలు సేకరించాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించామని తెలిపారు. రెండేళ్లలో వాటి రూపురేఖలను మార్చి ఇప్పటి, అప్పటి ఫొటోలను బేరీజు వేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో వౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూనే, ప్రతి పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. మీ పిల్లలను బడులకు పంపించండి, ఆ పిల్లలకు ఒక మామగా అండగా ఉంటానని జగన్ భరోసా కల్పించారు. అనంతరం విద్యాశాఖ రూపొందించిన అకడమిక్ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.