ఆంధ్రప్రదేశ్‌

పులకించిన పుష్కరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 15: కర్నూలు జిల్లాలో కృష్ణా పుష్కరాల నాల్గవ రోజున కృష్ణానదీ తీరంలో భక్తులు పోటెత్తారు. ప్రధాన ఘాట్లు శ్రీశైలం, సంగమేశ్వరంలో 1.50 లక్షల మంది భక్తులు సోమవారం పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల రద్దీ పెరగడంతో శ్రీశైలం, సంగమేశ్వరంలో అధికారులు అప్రమత్తమయ్యారు. శని, ఆది, సోమవారాలు సెలవుదినాలు కావడంతో భక్తులు అత్యధిక సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా వేసినా వారి అంచనాలకు తగ్గట్లు రాకపోవడం గమనార్హం. అయితే స్వాతంత్ర దినోత్సవమైన సోమవారం శ్రీశైలంలో లక్ష మందికి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు లెక్కలు కడుతున్నారు. సంగమేశ్వరంలో 35 వేలు, నెహ్రూనగర్‌లో 15 వేల మంది భక్తులు స్నానాలు చేశారని అధికారులు ప్రకటించారు. ఇవికాక ప్రజలు ఏర్పాటు చేసుకున్న ఘాట్లలో కూడా భారీ సంఖ్యలోనే పుష్కర స్నానాలు ఆచరించినట్లు వెల్లడవుతుంది. శ్రీశైలంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజి, సంగమేశ్వరంలో నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, ఆయన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పుష్కర స్నానాలు ఆచరించి పితృదేవతలకు పిండ ప్రధానం చేశారు. శ్రీశైలంలోని లింగాలగట్టుకు తెలంగాణ వైపు నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఉన్నతాధికారులు అక్కడే మకాం వేసి భద్రత, వసతి సౌకర్యాలను పర్యవేక్షించారు. శ్రీశైలం పాతాళగంగ ఘాట్ రద్దీ సాధారణంగానే ఉన్నా లింగాలగట్టుకు జనం పోటెత్తడంతో ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలను ఆ ప్రాంతంలో విహరింపచేసి భక్తుల భద్రతను పర్యవేక్షించారు. మరోవైపు ఎన్‌డిఆర్‌ఎం బృందాన్ని లింగాల గట్టు వద్ద రంగలోకి దింపారు. శ్రీశైలం, సంగమేశ్వరంలో భక్తులు భారీ సంఖ్యలో వచ్చినా అన్నదాతలు వారి ఆకలిదప్పులను గుర్తించి అన్నివేళలా భోజన సదుపాయాలు కల్పించడం విశేషం.
నీట మునిగి భక్తుడి మృతి
కాగా పుష్కరాల సందర్భంగా కర్నూలు జిల్లాలో అపశృతి చోటుచేసుకుంది. జూపాడుబంగ్లా వద్దఎస్‌ఆర్‌బిసి బ్రాంచి కెనాల్‌లో మునిగి ఓ యువకుడు మరణించాడు. మండలంలోని కనకయ్య కొట్టాల గ్రామానికి చెందిన సాయి ఫణీంద్ర(19) పుష్కర స్నానానికి వెళ్లి కాలు జారీ నీటిలో పడిపోవడంతో నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. గంట తరువాత ప్రజలు శవాన్ని వెలికితీశారు.
పుష్కరాల ప్రారంభకులు సీమ సిఎంలే!
కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించిన తరువాత మూడో పుష్కరాన్ని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రారంభించారు. గతంలో కోట్ల, వైఎస్ పుష్కరాలను ప్రారంభించారు. దీంతో మూడు పుష్కరాలను ప్రారంభించిన వారు రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహించిన ముఖ్యమంత్రులు కావడం గమనార్హం. కృష్ణా పుష్కరాలను 1992లో అధికారికంగా నాటి ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి విజయవాడలో ప్రారంభించారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విజయవాడలోనే ప్రారంభించారు. తాజాగా చంద్రబాబునాయుడు విజయవాడలో ప్రారంభించారు. తుంగభద్ర పుష్కరాలను ప్రభుత్వం అధికారికంగా 2008 నుండి నిర్వహిస్తోంది. అప్పట్లో వాటిని ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కర్నూలులో ప్రారంభించారు.

చిత్రం.. భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలం ఆలయ పరిసరాలు