ఆంధ్రప్రదేశ్‌

‘వెనుకబడిన’ నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: ‘వెనుకబడిన జిల్లాలకు మీరు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయండి’
‘మేం ఇంతకుముందు ఇచ్చిన నిధులకు సంబంధించిన ఖర్చు వివరాలు పంపించండి’
‘ఆ ఖర్చుల వివరాలు మీకు ఇచ్చేశాం. కొత్త నిధులు విడుదల చేయండి’
‘అబ్బే.. మీరిచ్చిన వివరాలు సరిపోవు. లెక్కలు తేడాలొస్తున్నాయి. పూర్తి వివరాలిస్తే మళ్లీ నిధులిస్తాం’
ఇదీ వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇస్తున్న నిధులకు సంబంధించి ఏపి, కేంద్రం మధ్య జరుగుతున్న లేఖల యుద్ధం!
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపిలో వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు కేంద్రం 700 కోట్లు విడుదల చేసింది. వాటిని ఖర్చుపెట్టిన తీరు, ఏయే పనులకు ఖర్చు పెట్టిన వివరాలకు సంబంధించిన యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు తిరిగి కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. అప్పుడు తిరిగి కొత్తగా నిధులు కేటాయిస్తుంది. కేంద్రప్రభుత్వ నిధుల మంజూరు ప్రక్రియ ఇదేవిధంగా ఉంటుంది. ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వానికయినా వర్తిస్తుంది.
అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని సొంత పథకాలకు మళ్లించుకోవడమో, అత్యవసర ఖాతాలకు మళ్లించుకోవడమో, ఇతర పనులను వినియోగించుకోవడమో చేస్తుంటాయి. ఇది సహజంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ జరిగేదే. అందుకే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు, కేంద్రం నిధులివ్వకుండా తమను చిన్నచూపు చూస్తోందని ఆరోపించడం, యుటిలైజేషన్ సర్టిపికెట్లు ఇవ్వనిదే కొత్త నిధులు ఎలా మంజూరు చేస్తామని కేంద్రంలో ఉన్న నేతలు ప్రశ్నించడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రానికి సంబంధించినంత వరకూ కేంద్రం ఇస్తున్న నిధులకు లెక్కలు చెప్పకుండా తమపై బురద చల్లుతున్నారని బిజెపి అగ్రనేతలయిన పురంధ్రీశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ చాలాకాలం నుంచి ఎదురుదాడి చేస్తున్నారు.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం, వెనుకబడిన ఏడు జిల్లాలకు నిధులు విడుదల చేయాలని కేంద్రానికి లేఖ రాయగా, ఇంతకుముందు ఇచ్చిన నిధులకు సంబంధించిన పూర్తిస్థాయి లెక్కలు సమర్పించాలని కేంద్రం తిరిగి జవాబు రాసింది. 2014-15, 2015-16 సంవత్సరానికి జిల్లాకు 50 కోట్లు చొప్పున రెండేళ్లు 700 కోట్లు విడుదల చేసింది. నిజానికి ఈ లేఖల యుద్ధం చాలాకాలం నుంచీ కొనసాగుతోంది.
తాము ఖర్చుల లెక్కలు సమర్పించామని రాష్ట్రం, మీరిచ్చిన లెక్కల వివరాలు సరిపోవని, అలాకాకుండా ఏ పనులకు ఎంత ఖర్చు చేశారన్న పూర్తి వివరాలు ఇవ్వాలని కేంద్రం లేఖలు రాస్తున్నా, ఇప్పటివరకూ ఈ సమస్య పరిష్కారం కావడం లేదు.
చిత్తూరుకు 100 కోట్లు కేటాయించగా అందులో 1.88 కోట్లు, కడపకు 100 కోట్లకు కేవలం లక్షరూపాయలు, అనంతపురానికి 100 కోట్లకు 1.8, కర్నూలుకు 100 కోట్లకు 2.26, శ్రీకాకుళానికి 100 కోట్లకు 5.58, విజయనగరానికి 100 కోట్లకు 2.19, విశాఖకు 102.1 కోట్లకు గాను 2.43 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లు కేంద్రం దృష్టికి వెళ్లింది. వీటిలో ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే ఐదుకోట్లు, ఆ తర్వాత విశాఖ 2.43 కోట్లు ఖర్చు పెట్టినట్లు కనిపిస్తోంది.
ఇదిలాఉండగా, రెండు ప్రభుత్వాల మధ్య జరుగుతున్న లేఖల యుద్ధం ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి లెక్కలు సమర్పిస్తే తప్ప, కొత్త నిధులు విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదని ఆర్ధిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి నిధులకు సంబంధించిన ఖర్చులన్నీ ఆయా పద్దులకే ఖర్చు పెట్టడం ఏ ప్రభుత్వానికయినా కష్టమేనని, ఆ విషయం తెలిసినా కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం సరైనది కాదని చెబుతున్నారు. ప్రభుత్వ ఖర్చులకే కేంద్ర నిధులు వాడుతున్నాము తప్ప, వ్యక్తిగత ఖర్చులకు వినియోగించడం లేదు కదా? అని ప్రశ్నిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన లెక్కలపై కేంద్రం ఎప్పటికి సంతృప్తి వ్యక్తం చేస్తుంది? ఎప్పుడు కొత్త నిధులు విడుదల చేస్తుందో చూడాలి.