ఆంధ్రప్రదేశ్‌

పంచలోహ విగ్రహాలు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, ఆగస్టు 27: దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన ఐలూరు శ్రీరామేశ్వరస్వామి ఆలయంలో రూ.3లక్షల విలువైన 400 సంవత్సరాల నాటి పంచలోహ విగ్రహాలు చోరీకి గురయ్యాయి. శనివారం ఉదయం విగ్రహాల చోరీ విషయం వెలుగులోకి రావటంతో ప్రజలు, భక్తులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి క్లూస్ టీమ్, డాగ్‌స్క్వాడ్‌లను రప్పించి దర్యాప్తు చేపట్టారు. శ్రీరామేశ్వరస్వామి ఆలయంలో అర్చకుడు లీలాప్రసాద్ శుక్రవారం రాత్రి పూజలు ముగిసిన తరువాత 7.30 గంటలకు తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయం 5 గంటలకు రిటైర్డ్ అటెండర్ లోయ శివాజీ ఆలయానికి వచ్చి ఆవరణను తుడుస్తూ ప్రధాన ద్వారానికి తాళంలేని విషయాన్ని గమనించాడు. వెంటనే అర్చకుడి ఇంటికి వెళ్లి గుడికి తాళంలేదని చెప్పాడు. శ్రీరామేశ్వరస్వామి, పార్వతీ అమ్మవారు, చండేశ్వరస్వామి విగ్రహాలు, రెండు బంగారు మంగళసూత్రాలు చోరీకి గురయినట్టు గుర్తించాడు. ఆలయ మేనేజర్ జయశ్రీకి విషయం తెలపటంతో ఆమె పోలీసులకు సమాచారం అందించారు.
కొనసాగుతున్న అల్పపీడనం
విశాఖపట్నం, ఆగస్టు 27: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో రానున్న 24 గంటల్లో చాలా చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఇదే సమయంలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది మరింత బలపడే అవకాశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు.
పుష్కరాల అవినీతిపై విచారణ జరిపించాలి
తిరుపతి, ఆగస్టు 27: కృష్ణా పుష్కరాల్లో అవినీతి జరిగిందని,దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పిసిసి ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఆర్ అండ్ బి అతిథిభవనంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి, కృష్ణ పుష్కరాల్లో ఏ ఏ పనులకు ఎంత ఖర్చుపెట్టారో ప్రభుత్వం శే్వతపత్రం విడుదల చేసి తన చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. కృష్ణా పుష్కరాల్లో ఏర్పాటుచేసిన టైల్స్‌ను భారతదేశంలో దొరకవన్నట్లు ఇతర దేశాల నుంచి తెప్పించాలా అన్నారు. పొరుగురాష్టమ్రైన తమిళనాడులో బాణాసంచా అందుబాటులో ఉన్నా ఆస్ట్రేలియా నుంచి తెప్పించారన్నారు. ఈక్రమంలోనే పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందన్నారు. ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ మేక్ ఇన్ ఇండియా అని ప్రచారం చేస్తుంటే చంద్రబాబునాయుడు విదేశాల మోజులో కొట్టుమిట్టాడుతున్నారని ఎద్దేవా చేశారు.
బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 65 కోట్లు కేటాయింపు
విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఆగస్టు 27: బ్రాహ్మణుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రాహ్మణ కార్పొరేషన్‌కు 65కోట్లు మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి పి మాణిక్యాలరావు తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు విశేష కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎపి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పధకాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. విద్య కోసం భారతి పథకం అమలు చేసేందుకు 14.81కోట్లు, పోటీ పరీక్షల శిక్షణ కోసం విశిష్ట పథకం కింద 22.79కోట్లు, ద్రోణాచార్య పథకం కింద 9.58కోట్లు, గాయత్రి పథకం, భారతీ విద్యా పథకం తదితరాలు అమలు చేసి బ్రాహ్మణులను అన్ని విధాలుగా అందుకునేందుకు సిఎం కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఉద్యోగుల సంక్షేమనిధి ట్రస్ట్ ద్వారా ఆలయాల్లో సేవలు అందిస్తున్న ఉద్యోగులు, అర్చకులను ఆదుకునేందుకు ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. వార్షికాదాయం 20 లక్షలు దాటిన ప్రతీ ఆలయం నుండి వచ్చే ఆదాయంలో 3 శాతం ఈ సంక్షేమనిధి ట్రస్ట్‌కు ఫిక్స్‌డ్‌డిపాజిట్ చేసేలా నిబంధన విధించి ఈ నగదుపై వచ్చే వడ్డీని అర్చకులు, ఉద్యోగుల, ఇళ్ళ నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు రుణం రూపంలో అందించాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
తెనాలి రూరల్, ఆగస్టు 27: తెనాలి - విజయవాడ ప్రధాన రహదారిపై నందివెలుగు గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ ఎస్‌ఐ ప్రభాకర్ కథనం ప్రకారం మున్నంగి నుండి తెనాలి వైపు వస్తున్న ఆటోను నందివెలుగు సమీపంలో ఎదురుగా వస్తున్న టాటా ఏస్ ట్రక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో దుగ్గిరాలకు చెందిన ఆటోడ్రైవర్ అమర్తలూరు నరసింహారావు (25), ప్రయాణికురాలు మున్నంగికి చెందిన బొమ్మిశెట్టి నాగశైలకుమారి (65) అక్కడే మృతి చెందారు. మిగిలిన ప్రయాణికులు ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రక్ డ్రైవర్, క్లీనర్ తాగి ఈ ఆటోకు ముందు రెండు ఆటోలను ఢీకొట్టబోయి, తప్పుకుని వెనక వస్తున్న ఈ మూడో ఆటోను ఢీకొట్టిందన్నారు.

ఉండవల్లిది అవగాహనా రాహిత్యం
మంత్రి నారాయణ ఫైర్

విజయవాడ, ఆగస్టు 27: ఉండవల్లి అరుణ్‌కుమార్ రాజధాని మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు మీద చేస్తున్న వ్యాఖ్యలను పురపాలక శాఖ మంత్రి నారాయణ నిరసించారు. ఉండవల్లి వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధంగా, అవగాహన రాహిత్యంగా ఉన్నాయని విమర్శించారు. సింగపూర్ గురించి ఉండవల్లి నుండి నేర్చుకోవాల్సిందేమీ లేదని, ఒక్కసారి సింగపూర్‌ను విజిట్ చేసి అక్కడి వారి అభివృద్ధిని కళ్లారా చూసి మాట్లాడాలని ఉండవల్లికి మంత్రి నారాయణ హితవు పలికారు. వారికున్న పరిమిత వనరుల్లో తక్కువ కాలంలో ఎలా అభివృద్ధి సాధించారో అది మనకు స్ఫూర్తి కావాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశమన్నారు. కాంగ్రెస్ వాళ్లకు అభివృద్ధి అంటే తెలియదు. దొంగతనాలు, దోపిడీలు, అవినీతి, అక్రమాలు ఇవే వారు చూడగలిగింది. అందుకే సింగపూర్ వారికి దొంగల దేశంగా కనబడుతోందన్నారు. ఏదైనా మన దృష్టి కోణాన్ని బట్టి ఉంటుందని మంత్రి నారాయణ అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులను అమలు చేయలేదని ఉండవల్లి బాధపడుతున్నారు కానీ ఆ శివరామకృష్ణన్ కమిటీ అడవుల్లో రాజధాని కట్టుకోమని చెప్పింది, అలా చేయమంటారా? మొక్కుబడిగా శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది చేయడానికి చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, ఇది తెలుగుదేశం ప్రభుత్వమన్నారు. రాజధాని విషయంలో ప్రతి అంశాన్ని కూలంకషంగా విశే్లషించి నిర్ణయం తీసుకున్నామని, ప్రపంచంలోని ప్రముఖ రాజధానులను స్వయంగా అధ్యయనం చేశాం. కాబట్టి హైకోర్టు ఎక్కడ కట్టాలి, అసెంబ్లీ ఎక్కడ కట్టాలి తదితర అంశాల మీద తమకు స్పష్టమైన క్లారిటీ ఉందన్నారు. స్విస్ ఛాలెంజ్ మీద స్పందించిన మంత్రి... స్విస్ ఛాలెంజ్ మంచి పద్ధతే కాని న్యాయపరంగా కొన్ని సూచనలు పాటించాలని హైకోర్టు ఇచ్చిన సూచనలు ఈ ప్రభుత్వం తప్పకుండా ఫాలో అవుతుందని వివరించారు.