ఆంధ్రప్రదేశ్‌

పులిచింతలకు భారీ వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 14: అల్పపీడనం కారణంగా రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువన క్యాచ్‌మెంట్ ఏరియాతో పాటు శ్రీశైలం జలాశయం నుంచి అవుట్‌ఫ్లోగా 20వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయటంతో ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రిజర్వాయర్ సామర్థ్యం 45.6 టిఎంసిలు కాగా బుధవారం సాయంత్రానికి 21.5టిఎంసీల నీటిని నిల్వచేశారు. అవుట్‌ఫ్లోగా ఐదువేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ముంపు గ్రామాలైన పులిచింతల, చిట్యాల, చిట్యాల తండా, కేతవరం, వేమవరం, వెల్లంపల్లి గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా భారీ వర్షాలకు అతలాకుతలమైన పల్నాడు ప్రాంతంలో ప్రశాంత పరిస్థితి నెలకొంది. పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాలను భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పల్నాడులో లోతట్టు ప్రాంతాలను వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపి రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ కాంతిలాల్ దండే సందర్శించి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గురజాల పట్టణంలోనే 750 ఇళ్లు నీట మునిగాయి. వర్షం తెరపివ్వటంతో నిర్వాసితులు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. మాచర్ల- గుంటూరు రైలుమార్గంలో కొట్టుకు పోయిన ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేయటంతో ట్రాక్ పునరుద్ధరణ చర్యలపై అధికారులు సంశయిస్తున్నారు. కాగా దుర్గి, మాచర్ల, గురజాల, రెంటచింతల, కారంపూడి మండలాల్లో సహాయ పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కాంతిలాల్ దండే రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదార్లు, విద్యుత్ లైన్లను పునరుద్ధరిస్తున్నారు.
గోదావరికి పెరుగుతున్న వరద
రాజమహేంద్రవరం: అఖండ గోదావరి నది ఆవాసిత ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. బుధవారం ధవళేశ్వరం వద్ద 9.5 అడుగుల వరద నీటి మట్టం నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహ ఉద్ధృతి పెరుగుతుండటంతో భద్రాచలం వద్ద కూడా గంట గంటకూ వరద నీటి మట్టం పెరుగుతోంది. భద్రాచలం వద్ద 32 అడుగుల నీటి మట్టం నమోదైంది. దీంతో ధవళేశ్వరం వద్ద కూడా వరద నీటి మట్టం క్రమేణా పెరుగుతోంది. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి వున్న 175 గేట్లను ఒక మీటర్ మేర ఎత్తివేసి వరద జలాలను సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. బ్యారేజి నుంచి 4 లక్షల 55వేల 308 క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి మళ్లించారు. ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి ఉపనది శబరికి కూడా వరద తాకిడి రావడంతో గోదావరి నదిలో వరద నీటి ఉద్ధృతి పెరిగింది. బుధవారం రాత్రి సమయానికి అఖండ గోదావరిలో ప్రవాహవేగం మరింతగా పెరిగింది. తూర్పు డెల్టాకు 1800 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2200 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 5000 క్యూసెక్కులు సాగునీటిని విడుదల చేశారు.
కోస్తా, తెలంగాణకు వర్ష సూచన
విశాఖపట్నం: పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా కదులుతూ తెలంగాణను ఆనుకుని స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణ, కోస్తా పరిధిలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రెండు ప్రాంతాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాతీరంలో భారీ గాలులు వీచే అవకాశం ఉందన్నారు. పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోస్తా మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడుతోందని తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ కోస్తాలోని తునిలో 11సెంటీమీటర్లు కొయ్యలగూడెంలో 9సెంటీమీటర్లు, తెర్లాం, పోలవరంలలో 7సెంటీమీటర్లు, గాలేరు 6సెంటీమీటర్లు చింతపల్లిలో 3సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.