ఆంధ్రప్రదేశ్‌

నాట్లకు నోచుకోని కృష్ణా డెల్టా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: గత కొద్ది రోజులుగా ప్రకాశం బ్యారేజీకి పుష్కలంగా నీరు చేరుతున్నప్పటికీ, ఇటీవల మూడురోజులపాటు వరద నీటిని సముద్రంలోకి వదలాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పటికీ అన్నపూర్ణగా పేరుగాంచిన కృష్ణాజిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో దాదాపు లక్ష ఎకరాల్లో నేటికీ వరినాట్లు పడక పంట భూములు బీళ్లుగా మారుతున్నాయి. పట్టిసీమ పథకం ప్రారంభంతో కృష్ణా రైతాంగం ప్రస్తుత ఖరీఫ్‌పై గంపెడాశలు పెట్టుకుంది. గత కొనే్నళ్లుగా రబీ సాగు అస్తవ్యస్తంగా మారటమే గాక ఖరీఫ్ సీజన్ పరిస్థితి కూడా అదే విధంగా మారుతూ ధాన్యం పండించే రైతాంగాన్ని ఎంతగానో కుంగదీసింది. కృష్ణాజిల్లాలో వరిసాగు సాధారణ విస్తీర్ణం 6లక్షల 25వేల ఎకరాలు కాగా గతంలో జూన్ మాసంలోనే మొత్తం విస్తీర్ణంలో వరినాట్లు పడేవి.. ఆ సమయంలో కాలువల ద్వారా పుష్కలంగా నీటి సరఫరా జరిగేది. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, దానికి తగ్గట్లు నాగార్జునసాగర్ నుంచి దిగువకు చుక్కనీరు రాని పరిస్థితి, అలాగే పట్టిసీమ నుంచి కూడా సకాలంలో నీటి సరఫరా జరుగని స్థితి.. అయితే ఆగస్టు మాసాంతంలో స్వల్పంగా పడిన వర్షాలు.. అలాగే బోర్లు సాయంతో వరి నారుమళ్లు ఈనెల ఆరంభం నుంచి వరినాట్లు పడసాగాయి. తొలుత వరినారు ఎండిపోయే స్థితి రాగా మంచినీటి పేరిట సాగర్ నుంచి స్వల్పరీతిలో నీటిని రప్పించి కాలువల ద్వారా ఏదో విధంగా భూములకు నీరందించటం జరిగింది. సాధారణంగా నవంబర్ మాసంలో తుఫాన్‌లు వస్తుంటాయి. ఆ సమయానికే కోతలు, నూర్పిళ్లు పూర్తయి ధాన్యం రాశులు రైతుల ఇళ్ల ముంగిట చేరాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దీనికి భిన్నంగా సెప్టెంబర్ మాసంలో వరినాట్లు పడుతుంటే మధ్యలో ఎలాంటి ఉపద్రవాలు జరుగకుండా వుంటే జనవరి మాసాంతానికి గాని వరి కోతలు జరిగే పరిస్థితి కన్పించడం లేదు. ఇక కృష్ణాలో ఇప్పటివరకు కేవలం ఐదు లక్షల 25వేల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. ఇక మిగిలిన లక్ష ఎకరాల్లో వరినాట్లు పడే పరిస్థితి కన్పించడం లేదు.. పోనీ ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుదామంటే ఆ పరిస్థితి కూడా లేదు.. దీంతో కౌలుదారులు, వ్యవసాయ కూలీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆయకట్టు చివరనున్న నాగాయలంక, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లోని కాలువలకు చుక్కనీరందని పరిస్థితి నెలకొంది. కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులు ఏడేళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ మధ్యలోనే నిలచిపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా నిలచిన ఆ పనులు ముందుకు సాగకపోవటం వలన ఈ పరిస్థితి దాపురించింది.
ఇక కృష్ణాలో ఇతర పంటల సాగును పరిశీలిస్తే మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 5వేల 116 హెక్టార్లు కాగా 5వేల హెక్టార్లు, పత్తి సాధారణ విస్తీర్ణం 58వేల 404 హెక్టార్లు కాగా 37వేల 914 హెక్టార్లు, చెరకు విస్తీర్ణం 15వేల 801 హెక్టార్లలో 11వేల 641 హెక్టార్లలోను, పసుపు సాధారణ విస్తీర్ణం 2వేల 159 హెక్టార్లకు గాను 1216 హెక్టార్లు, మిర్చి విస్తీర్ణం 10వేల 035 హెక్టార్లకు గాను 8వేల 840 హెక్టార్లు, వేరుశనగ 1521 హెక్టార్లకు గాను 761 హెక్టార్లలో మాత్రమే సాగు జరుగుతున్నది. మిగిలిన భూముల్లో అక్కడక్కడ ప్రత్యామ్నాయ పంటలు సాగుకు ప్రయత్నాలు కన్పిస్తుంటే మిగిలిన భూములు ఎండిపోయి బీళ్లుగా మారుతున్నాయి. తాజాగా ప్రకాశం బ్యారేజీకి పులిచింతల నుంచి 7వేల క్యూసెక్కులు, పట్టిసీమ నుంచి 3వేల 400 క్యూసెక్కుల నీరు చేరుతుంటే కాలువలన్నింటికి కల్సి 13వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తూ సాగైన పంటలు ఎండుముఖం పట్టకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.