ఆంధ్రప్రదేశ్‌

రెయిన్‌గన్ల పేరుతో నాటకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 4: కరవు కోరల్లో చిక్కి అనంత రైతాంగం కునారిల్లుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్ధాలతో కపట నాటకాలు అడుతున్నారని వైకాపా అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రాయలసీమలో, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట నిలువునా ఎండిపోతున్నా తనకు తెలీదని, ఎవరూ చెప్పలేదంటూ, రెయిన్‌గన్ల సినిమా మొదలు పెట్టారని విమర్శించారు. ఆరు రోజుల పాటు జిల్లాలో పర్యటించి జలఫిరంగుల ద్వారా 4 లక్షల ఎకరాలకు నీరిచ్చామని, కరవు పారదోలామని బూటకపు మాటలు మాట్లాడారని విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ మంగళవారం అనంతపురం కలెక్టరేట్ ఎదుట వైకాపా ఆధ్వర్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అధ్యక్షతన రైతు మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు హాజరైన జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ బాబుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. అనంతపురం జిల్లాలో 15 లక్షల ఎకరాల్లో వేరుశెనగ, మరో3 లక్షల ఎకరాలు ఇతర పంటలు వేశారన్నారు. వీటిలో 80 శాతం పంటలు ఎండిపోయాయన్నారు. రాయలసీమ మొత్తంగా 21.6 లక్షల ఎకరాల్లో పంట వేస్తే 17.27 లక్షల ఎకరాల్లో పంట నిలువునా ఎండిపోయిందన్నారు. అనంతపురం జిల్లాలో కరవు ఉందా..నాకు తెలియదే... అధికారులెవరూ చెప్పలేదే.. మంత్రులు కూడా తెలియజేయలేదే.. అంటూ ముఖ్యమంత్రి కల్లిబొల్లిమాటలు చెప్పారన్నారు. మరి తన వద్ద కోర్ డ్యాష్‌బోర్డు ఉందికదా.. కంప్యూటర్లు ఉన్నాయికదా.. అందులో ఒక బటన్ నొక్కితే మొత్తం తెలిసి పోతుందంటున్నారే.. ఆగస్టు నెలలో 15 రోజుల్లోపే రెండుసార్లు అనంతపుర జిల్లాకు వచ్చిన ఆ పెద్దమనిషికి ఇక్కడి కరవు కనిపించలేదా అని ప్రశ్నించారు. తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు రెయిన్‌గన్ల సినిమా మొదలు పెట్టారన్నారు. నాలుగు రోజుల్లోనే 4 లక్షల ఎకరాలకు నీటి తడులు ఇచ్చామని అబద్ధాలాడారని ధ్వజమెత్తారు. హెలికాప్టర్‌లో పరిశీలిస్తే కరవు కనిపిస్తుందా అని ఎద్దేవా చేశారు. ఎకరాకు 5 నుంచి 6 ట్యాంకర్ల లెక్కన రోజుకు 25 లక్షల నుంచి 30 లక్షల ట్యాంకర్లు మేరకు నీరివ్వాల్సి ఉందని, అది సాధ్యమేనా అని జగన్ ప్రశ్నించారు.
మంత్రి కొల్లు రవీంద్ర సెప్టెంబర్‌లో జిల్లాలో పర్యటించినపుడు 80 శాతం పంట ఎండిపోయిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నానని చెప్పారన్నారు. ఓపక్క పంట ఎండిపోయిందని మంత్రి అంటున్నారు... మరోపక్క పంటలు రక్షించామని సిఎం చెబుతున్నారు.. ఏది నిజమో చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు, డిండి ప్రాజెక్టుల ద్వారా 120 టిఎంసిల నీటిని తెలంగాణ తరలించుకుపోతున్నా, పోలవరంపై లిఫ్ట్ పెట్టి నీటిని తీసుకుపోతున్నా అడిగే పరిస్థితిలో సిఎం లేరని జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, అనంతపురం జిల్లాలో హంద్రీ నీవా డిస్ట్రిబ్యూటర్లు, పిల్లకాలువల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలవాలని, రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హంద్రీనీవాకు 12 పంపులు ఏర్పాటుచేసినా ఎందుకు నీరివ్వలేదని ప్రశ్నించారు.
రైతాంగాన్ని ఆదుకున్నది వైఎస్సే..
వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో సిఎం అయ్యాక ఉచిత విద్యుత్, రైతు రుణ వడ్డీ మాఫీ, రుణాల రెన్యూవల్, కొత్త రుణాలు ఇవ్వడంపై కేంద్రంతో పోరాడి సాధించారన్నారు. అప్పట్లో వైఎస్ కృషి ఫలితంగా దేశంలో మొత్తం 21 జిల్లాల్లో కరువు ఉందని కేంద్రం ఆమోదించిందని, అందులో 16 మండలాలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయని గుర్తుచేశారు. హంద్రీనీవా, గాలేరు నగరి, పులిచింతల, వెలిగొండ ప్రాజెక్టులు ప్రారంభించిన ఘనత వైఎస్‌దేనన్నారు. కేంద్రంతో పోరాడి కరవు నిధులు సాధించడంలో బాబు విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి, మాజీ ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశే్వశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. అనంతపురంలో మంగళవారం వైకాపా అధినేత జగన్ దీక్ష