రాష్ట్రీయం

అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: ఎన్నికల ఖర్చు తగ్గించేందుకు లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ఆలోచన చేయాలని ఆయన సూచించారు. బుధవారం నగరంలో ఏర్పాటైన రాష్ట్ర ఎన్నికల అధికారుల 24వ జాతీయ స్థాయి సమావేశాన్ని ఆయన ప్రారంభించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించుకోవడం ద్వారా ఎన్నికల ఖర్చు తగ్గించుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఒకే రకమైన ఓటర్ల జాబితా ఉండాలని, దీనివల్ల అపోహలకు తావుండదని ఆయన తెలిపారు. పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత ఉంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. తరచూ ఉపఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చత్తీస్‌గఢ్‌లో తాను ఈ అనుభవాన్ని చూశానని ఆయన చెప్పారు. అక్కడ సంవత్సరం పొడుగునా ఉప ఎన్నికలు జరిగేవని అన్నారు. ఉపఎన్నికలు అనివార్యమైతే సంవత్సరంలో జనవరి, జూలై రెండు సార్లు నిర్వహిస్తే సరిపోతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలపై ఈ సమావేశంలో అర్థవంతమైన చర్చ జరిపి పరిష్కారమార్గాలు కనుగొనాలని అన్నారు. భవిష్యత్తులో రాబోయే సమస్యలపై చర్చించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులను కోరారు. సామాన్య ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో జరిగే అవకతవకలను రూపుమాపాలని ఆయన తెలిపారు. ఎన్నికైన స్థానిక ప్రజా ప్రతినిధులను రీ-కాల్ చేసే అంశాన్ని పరిశీలించాలని ఆయన సూచించారు. ఎన్నికల సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులు వారి అనుచరులు ఆయా నియోజకవర్గాలను 3 వారాల ముందు నుంచి ప్రవేశించకుండా కేవలం మీడియా ద్వారానే ప్రచారం చేసే విషయాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ప్రారంభించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
సాంకేతిక పరిజ్ఞానం వినియెగం: సిఇసి
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అచత్‌కుమార్ జోతి ప్రసంగిస్తూ దేశంలో ఎన్నికలను సజావుగా, శాంతియుంగా నిర్వహించేందుకు అనేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న అంశాలను ఆయన తెలిపారు. వాట్పాప్ గ్రూపులు, ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎస్‌ఎంఎస్, వెబ్‌పోర్టల్, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ తదితర సాంకేతిక వినియోగం గురించి చెప్పారు. పోలింగ్ సమయంలో వెబ్ కాస్టింగ్, సిసి కెమెరాల ఏర్పాటు, ఇవిఎంల వినియోగం, అబ్జర్వర్ల నియామకం గురించి చెప్పారు.
31 జిల్లాలు: రాజీవ్ శర్మ
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ ప్రసంగిస్తూ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అనేక సవాళ్ళను ఎదుర్కొంటూ పరిపాలనా సంస్కరణలు చేపడుతున్నట్లు చెప్పారు. పరిపాలనా సౌలభ్యం కోసం 10 నుంచి 31 జిల్లాలు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని ఆయన చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి ప్రసంగిస్తూ నూతన రాష్ట్రంలో ఒక ఏడాదిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేశ్ వందన సమర్పణ చేశారు.
ఆ ఫోన్ ఎవరిది..?
ఇలాఉండగా గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తున్నప్పుడు ఫోన్ రావడంతో ప్రసంగాన్ని ఆపి వేదిక దిగి పక్కకు వెళ్ళి ‘చెప్పండీ..’ అని మాట్లాడారు. గవర్నర్ నరసింహన్ ఎడిసి ఆయన వద్దకు వచ్చి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడంతో ప్రసంగాన్ని ఆపి ఒకటిన్నర నిమిషం ఆ ఫోన్ మాట్లాడారు.

హైదరాబాద్‌లో బుధవారం ఎన్నికల అధికారుల 24వ జాతీయ స్థాయి సమావేశాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న గవర్నర్ నరసింహన్. చిత్రంలో సిఇసి అచత్‌కుమార్ జోతి ఉన్నారు.