ఆంధ్రప్రదేశ్‌

ఎయులో 90 లక్షల ఈ-బుక్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 8: దేశం ఇప్పుడు సాంకేతికతవైపు పరుగులు తీస్తోంది. దైనందిన జీవితంలో చేసే ప్రతి పనిలో టెక్నాలజీ వినియోగం తప్పనిసరైపోతోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం విద్యారంగంలో కీలక భూమిక పోషిస్తోంది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానానికి యువశక్తి తోడైతే దేశ భవిష్యత్ దేదీప్యమానం అవుతుంది. దీన్ని పూర్తిగా నమ్మిన విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ విభాగం సరికొత్త ప్రయోగం చేసింది. విలువైన పుస్తకాలను కొనుగోలు చేయాలంటే ఎంతో ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అదే పుస్తకాలను కాలేజీ లైబ్రరీలకు వెళ్లి చదవాలంటే కొన్ని సమయాల్లో సాధ్యం కాకపోవచ్చు. ఇవే పుస్తకాలను కంప్యూటరీకరిస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచన ఎయు ఇంజనీరింగ్ కళాశాల అధికారులకు వచ్చింది. వెంటనే దాన్ని అమల్లో పెట్టారు. కేవలం కొద్ది నెలల్లో వంద కాదు..వేయి కాదు..లక్ష కాదు.. ఏకంగా 90 లక్షల పుస్తకాలను డిజిటలైజ్ చేశారు. మరికొద్ది రోజుల్లో ఈ సంఖ్య కోటికి చేరబోతోంది. ఇప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో 90 లక్షల మేరకు ఈ-బుక్స్ ఉన్నాయి! ఇంత భారీ సంఖ్యలో ఈ-పుస్తకాలను విద్యార్థులకు, అధ్యాపకులకు అందుబాటులో ఉంచి కళాశాల ఓ చరిత్ర సృష్టించింది. ఇంత భారీ పుస్తకాలను అందుబాటులో ఉంచిన వర్సిటీ లేదా కళాశాల రాష్ట్రంలో లేదంటే అతిశయోక్తి కాదు.
దాదాపు 60 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎయు ఇంజనీరింగ్ కళాశాలలో ప్రస్తుతం 11 విభాగాలతో పాటు మరో నాలుగు అనుంబంధ విభాగాలు పని చేస్తున్నాయి. ఎయులో ప్రత్యేకించి మహిళలకు ఇంజనీరింగ్ కళాశాల ఉంది. దీంతో వీరందరి పుస్తకావసరాలను తీర్చేందుకు కళాశాల ఆవరణలో లైబ్రరీ ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై విద్యార్థులకు, అధ్యాపకులకు మరింత సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎయు ఇంజనీరింగ్ కళాశాల అధికారులు గత రెండు సంవత్సరాలుగా ఈ-లైబ్రరీ ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. దాదాపు 8000 మందికి అవసరమైన ఈ-పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఏడాది జూలై నుంచి 90 లక్షల ఈ-పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడంతో అధికారులు కృతకృత్యులయ్యారు. ఇందులో 46.53 లక్షల పుస్తకాలు కేవలం ఇంజనీరింగ్‌కు సంబంధించినవి కావడం గమానార్హం. ఇంజనీరింగ్‌కు అనుబంధంగా ఉన్న వివిధ సబ్జెక్టుల పుస్తకాలు 44 లక్షల మేరకు అందుబాటులో ఉన్నాయి. ఇందు కోసం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ క్యాంపస్ ఆవరణలో గ్రంథాలయ భవనం ఏర్పాటు చేశారు. డెల్‌నెట్, వరల్డ్‌బుక్‌లైన్, ఈ-ఆచార్య, ఈ-పాఠశాల, ఎన్‌పిటిఎల్, నింబస్ ఈ-బుక్, రీసెర్చ్‌గైడ్ తదితర సంస్థల నుంచి లైసైన్సు తీసుకుని, యాక్సెస్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ పుస్తకాలన్నింటినీ ఆన్‌లైన్‌లో చదువుకోవచ్చు. అవసరమైతే డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం ఉంది. ఆన్‌లైన్‌లో ఈ-పుస్తకాలను చదువుకునేందుకు వీలుగా మూడు ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో 180 కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. గ్రంథాలయంలో అదనంగా మరో 100 కంప్యూటర్లను ఏర్పాటు చేశారు.
ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకూ విద్యార్థులు వీటిని ఉపయోగించుకోవచ్చు. వీటికి అదనంగా ప్రతి ఇంజనీరింగ్ విభాగంలో 30 కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. క్యాంపస్ అంతా వైఫై నెట్ వర్క్ ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు ఈ ల్యాబ్‌ల్లోనే కాకుండా ఎక్కడ నుంచైనా వీటిని యాక్సెస్ చేసే వీలు కలిగింది. దీనికి తోడు వెబ్ రిసోర్సెను గుర్తించేందుకు వీలుగా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీంతో ఏయే వెబ్‌సైట్స్‌లో ఏయే అంశాల వివరాలు అందుబాటులో ఉంటాయి, తదితర వివరాలను ఆ శిక్షణలో తెలియచేస్తున్నారు. ఇవి కాక మరో ఎనిమిది వేల జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ కూడా విద్యార్థులకు, పరిశోధకులకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా ఎయు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి.ఎస్.అవధాని ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ ఇంత భారీ సంఖ్యలో ఈ-బుక్స్ అందుబాటులో ఉన్న కళాశాల రాష్ట్రంలో ఇదే కావచ్చన్నారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని పుస్తకాలు అందుబాటులో ఉంచడమే కాకుండా వినియోగంపై శిక్షణ కూడా ఇస్తున్నామని తెలిపారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ తాత్కాలిక క్యాంపస్ తమ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయడం వల్ల వారి సహకారంతో మరో 10 లక్షల ఈ-పుస్తకాలు కూడా తమ ఈ-లైబ్రరీలో చేరనున్నాయన్నారు. పుస్తకాల ఖరీదు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ-పుస్తకాల వినియోగం ఎక్కువగా ఉందని వివరించారు. గ్రంథాలయాధికారి విజయకుమార్ మాట్లాడుతూ ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయన్నారు. టెక్విప్ కింద దాదాపు 90 వేల పుస్తకాలను కొనుగోలు చేశామన్నారు.

చిత్రం.. ఎయు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పిఎస్ అవధాని
ఎయు ఇంజనీరింగ్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన
కంప్యూటర్లలో ఈ-బుక్స్ చదువుతున్న విద్యార్థులు