ఆంధ్రప్రదేశ్‌

అవాంతరాలు అధిగమించి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: రాష్ట్రం విడిపోయిన రెండున్నరేళ్ల తర్వాత అమరావతిలో సొంత పాలన మొదలుకానుంది. విజయదశమి పర్వదినం నుంచి నవ్యాంధ్ర దశ తిరుగుతుందన్న ఆశాభావం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతోంది. హైదరాబాద్ సచివాలయం నుంచి వెలగపూడి తాత్కాలిక రాజధానిలో పాలన ప్రారంభం కానుండటం ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. దీనితో ప్రవాసపాలనకు తెరపడినట్టయిందని, అడ్డంకులు అధిగమించి తాత్కాలిక సచివాలయం నుంచి పాలన ప్రారంభిస్తున్న చంద్రబాబునాయుడు ప్రభుత్వం, ఇంతకుముందు వివిధ దేశాల కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, హామీలకు వాస్తవరూపం ఇస్తేనే ఆయన ఇమేజ్ పెరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది. విజయదశమి సందర్భంగా వెలగపూడి తాత్కాలిక సచివాలయం కళకళలాడుతుంటే, కొద్దిరోజుల క్రితం వరకూ పాలనకు కేంద్రబిందువుగా మారిన హైదరాబాద్ సచివాలయం వెలవెలపోతోంది. ఇన్నాళ్లకు సొంత రాష్ట్రంలో సొంత పాలన ప్రారంభమవుతున్న ఆనందం రాష్ట్ర ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఏపి ప్రజలు కూడా కోరుకున్నది ఇదే. దానిని నెరవేర్చడంలో బాబు సఫలీకృతులయ్యారు. స్పీకర్ కోడెలయితే గత రెండున్నరేళ్ల నుంచి సొంత రాష్ట్రంలోనే అసెంబ్లీ నిర్వహించుకోవాలని చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించనున్నాయి. ఇప్పటివరకూ మంత్రులు, అధికారులు హైదరాబాద్‌లో ఉంటూ, విజయవాడ నుంచి సాగిన ప్రవాస పాలనకు తెరపడటంపై హర్షం వ్యక్తమవుతోంది. అయితే, ఈ విజయదశమి నేపథ్యంలో బాబు ప్రభుత్వం ముందు అనేక సమస్యలు, సవాళ్లు పరిష్కారం కోసం వేచి ఉన్నాయి. అవి వచ్చే విజయదశమిలోగా పరిష్కారం కావాలన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అమరావతి నగరానికి ప్రధాని మోదీ వేసిన శిలాఫలకం చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు తప్ప, ఇప్పటివరకూ అక్కడ ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. నగర నిర్మాణానికి రూపొందించిన స్విస్ చాలెంజ్ విధానంపై ఇంకా కోర్టు నుంచి తీర్పు రాలేదు. అక్కడ నగర నిర్మాణం సాధ్యం కాదని, పర్యావరణం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ పలువురు వేసిన పిటిషన్లు గ్రీన్‌ట్రైబ్యునల్, సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ దీనిపై సీరియస్‌గానే దృష్టి సారించడంతో, అవి ఎప్పటికి ఒక కొలిక్కి వస్తాయన్నది సందేహంగానే ఉంది. అక్కడ నిర్మాణాలు మొదలైతే బాబు ఇమేజ్ పెరుగుతుంది. ఎన్నికల నాటికి ఒక్క నిర్మాణం కూడా లేకపోతే జగన్‌కు ఒక అవకాశం ఇద్దామన్న భావన పెరుగుతుంది. ప్రస్తుతం నవ్యాంధ్రలో రాజకీయాలు ఈ కోణం చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. అటు నగర నిర్మాణం కోసం రైతులు ముందుకొచ్చి ఇచ్చిన 3400 ఎకరాల వ్యవసాయభూమి వృధాగా మారుతుందన్న విమర్శలకు తెరదించకపోతే, ప్రతిపక్షాల నుంచి బాబు విమర్శలు ఎదుర్కోవడమే కాదు, ప్రజలకు సమాధానం చెప్పడం కూడా కష్టమవుతుంది. ఇక వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్, సీమ జిల్లాలను కలుపుతూ ఏర్పాటుచేయనున్న హైవే ఎక్స్‌ప్రెస్, తరచూ చెప్పే ఇంటింటికీ 149 రూపాయలకే ఇంటర్‌నెట్, టీవీ, ఫోన్ సర్వీసుల హామీ, మూడేళ్లలో విజయవాడ మెట్రో రైల్ పూర్తి, 2022 నాటికి అందరికీ ఇళ్లు, బాబు తన విదేశీ పర్యటనల సందర్భంగా పారిశ్రామిక, వాణిజ్య వర్గాలతో కుదుర్చుకున్న ఒప్పందాలకు వాస్తవరూపం ఇవ్వాల్సి ఉంది. నిజానికి ఈ విషయంలో బాబు ప్రతిపక్షాల నుంచి అవాంతరాలు ఎదుర్కొంటున్నారు. ఒప్పందాల ప్రకారం పారిశ్రామికవేత్తలకు భూములివ్వాలి. కానీ, రాష్ట్రంలో మిగులుభూములు కాకుండా, పరిశ్రమలకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో భూములు లేవు. వాటిని సేకరించాలంటే రైతుల అనుమతి అవసరం. కానీ విపక్షాలు భూసేకరణను వ్యతిరేకిస్తున్నాయి. ఇది కత్తిమీద సాములా మారింది. వీటిని అధిగమిస్తే తప్ప, బాబు కన్న కలలు నిజమయ్యే అవకాశాలు కనిపించటం లేదు. ఐటికి ఆద్యుడిగా పేరున్న బాబు హయాంలో ఇప్పటివరకూ ఏపిలో ఒక్క ఐటి పరిశ్రమ కూడా రాకపోవడం విమర్శలకు దారితీస్తోంది. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటివరకూ పరిపాలన, రాజకీయ సమస్యలు ఎదుర్కోవడంతోనే సరిపోయిన బాబు, ఎట్టకేలకు పార్టీపైనా దృష్టి సారించడం క్యాడర్‌కు ఆనందం మిగిల్చింది. వివిధ కులాల కోసం ఏర్పాటుచేసిన కార్పొరేషన్లు, సొసైటీల వల్ల ఆయా వర్గాలకు లబ్థి జరుగుతున్నా, పెన్షన్ల వంటి భారీ స్కీములతో లక్షలమందికి ప్రయోజనం చేకూరుతున్నా, దాని వల్ల ప్రభుత్వానికి రావలసినంత కీర్తి రాకపోవడం ఆందోళన కలిగించే అంశమే. చాలామంది జిల్లా కలెక్టర్లు మంత్రులు, ఎమ్మెల్యేలను లెక్కచేయటం లేదన్న విమర్శలున్నాయి. నేరుగా సీఎం తమతో మాట్లాడుతుండటంతో అధికారులు చివరకు సీఎస్‌ను కూడా లెక్కచేయని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో బాబు పాత విధానాలనే అమలుచేస్తున్నారని, దీనివల్ల 2004 నాటి ఫలితాలు తప్పవన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. కొత్త రాష్ట్ర అభివృద్ధి కోసం బాబు కష్టపడుతున్నారన్న భావన, ప్రతిపక్షాలు సమయం ఇవ్వడంతోపాటు, అడ్డుపడుతున్నాయన్న అభిప్రాయం, ప్రజల్లో ఉండటమే కొంత సానుకూల అంశంగా కనిపిస్తోంది. కేంద్రం నుంచి కూడా తగినంత సహకారం లభించకపోవడం, ఇటు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ బలపడుతుండటం బాబుకు ఆందోళన కలిగిస్తోంది. హోదా బదులు ప్యాకేజీ ప్రకటించినందున దాన్ని సద్వినియోగం చేసుకుని అమరావతి నిర్మాణంపై ఇప్పటినుంచి దృష్టి సారిస్తే, వచ్చే దసరా నాటికి కొంతయినా ఫలితాలుంటాయని, ఆ తర్వాత ఎన్నికల ఏడాది కాబట్టి ఏ ప్రయత్నాలు చేసినా ఫలించవంటున్నారు. వచ్చే దసరా నాటికి అమరావతిలో కొన్ని నిర్మాణాలయినా ప్రారంభం కాకపోతే, బాబు ప్రభుత్వానికి భవిష్యత్తులో సమస్యలు తప్పవని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.