ఆంధ్రప్రదేశ్‌

ఇథియోపియాలో తెలుగు ప్రొఫెసర్లు క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 12: ఇథియోపియా దేశంలోని మడబాల యూనివర్సిటీలో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్ర ప్రొఫెసర్లు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని, బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందవద్దని, త్వరలో వారిని స్వదేశానికి తీసుకొస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం అనంతపురంలో మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ ఇథియోపియా దేశంలోని బలేరోబు రాష్ట్రం మడబాల యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అనేక మంది ప్రొఫెసర్లు పనిచేస్తున్నారన్నారు. ఆ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధంలో భాగంగా వీరిని దిగ్బంధించారన్నారు. వారితో సెల్‌ఫోన్ కమ్యూనికేషన్ సైతం తెగిపోయిందన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం టనే స్పందించిందని మంత్రి అన్నారు. ఆ దేశంలోని ఒక తెగ వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో తెలుగు ప్రొఫెసర్లు, సిబ్బంది ఇరుక్కు పోయారన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర యంత్రాంగం స్పందించి విదేశీ వ్యవహారాలశాఖ మంత్రితో మాట్లాడటంతో పాటు ఆ దేశ ఇండియన్ ఎంబసి ఫస్ట్ సెక్రటరీ అశోక్‌కుమార్, అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వివరాలు తెలుసుకుంటున్నామన్నారు. అలాగే ఇథియోపియా దేశ విద్యాశాఖ మంత్రితో మాట్లాడామన్నారు. మన ప్రొఫెసర్లు క్షేమంగా ఉన్నారని తెలిపారన్నారు. సుమారు 30 మంది దాకా ప్రొఫెసర్లు అక్కడ ఉన్నారన్నారు. అధిక సంపాదన నిమిత్తం కొంతమంది గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని, అలాంటి వారు నకిలీ, గుర్తింపులేని ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి పల్లె మరోమారు హెచ్చరించారు.
అలాగే ఆయా జిల్లాల కలెక్టరేట్లలో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.

భద్రాద్రి జిల్లా ఆవిర్భావం
లాంఛనంగా ప్రారంభించిన మంత్రి తుమ్మల’

కొత్తగూడెం, అక్టోబర్ 12: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో 23 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో భద్రాద్రి జిల్లా ఆవిర్భవించింది. కొత్త జిల్లాను రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్ర్తిశిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దసరా పండుగ సందర్భంగా మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నూతన జిల్లాలో పాలనా పనులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను కూడా ప్రారంభించారు. కొత్త జిల్లాకు తొలి కలెక్టర్‌గా రాజీవ్‌గాంధీ హనుమంతు, తొలి ఎస్పీగా అంబర్ కిషోర్‌ఝా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా మంత్రి తుమ్మల విలేఖరులతో మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందించాలనే సదుద్దేశ్యంతో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటులో సింగరేణి సంస్థ అందించిన సహకారం మరువలేనిదన్నారు. భద్రాద్రి జిల్లాకు టూరిజం వరంలాంటిదన్నారు. కార్యక్రమంలో జెసి రాంకిషన్, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిసిసి చైర్మన్ విజయబాబు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కొత్తగూడెం, అశ్వారావుపేట, పినపాక, ఇల్లెందు, వైరా, భద్రాచలం శాసనసభ్యులు పాల్గొన్నారు.

ఉక్కు ఎస్‌ఎంఎస్-2లో
భారీ పేలుడు
ఇద్దరికి తీవ్ర గాయాలు
ఉక్కునగరం, అక్టోబర్ 12: విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎస్‌ఎంఎస్-2 విభాగంలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. దీంతో ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఒక ఉక్కు ఉద్యోగితో పాటు మరో కాంట్రాక్ట్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, కార్మిక వర్గాలు అందించిన వివరాల ప్రకారం ఎస్‌ఎంఎస్-2 విభాగానికి సంబంధించిన కన్వర్టర్-2 నుండి ద్రవపు ఉక్కును లాడిల్‌లో వొంపుతుండగా ప్రమాదవశాత్తు కొత్త ద్రవపు ఉక్కు కింద పడింది. ద్రవపు ఉక్కు కింద పడే సమయంలో ఆ ప్రాంతంలో నీరు ఉండడంతో భారీ పేలుడు సంభవించింది. అయితే పేలుడు సమయంలో సంఘటన స్థలంలో విధులు నిర్వహిస్తున్న ఫోర్‌మెన్ మేడశెట్టి రాజారావు, ఒప్పంద కార్మికుడు సుమన్‌రాయ్ తీవ్రంగా కాలి పోయారు. ఈ ఇద్దరూ సుమారు 70 శాతం కాలిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు. గాయపడిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు అంటున్నారు. సంఘటన స్థలం నుంచి చికిత్స నిమిత్తం తోటి కార్మికులు వెంటనే విశాఖ ఉక్కు జనరల్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం విశాఖలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని గుర్తింపు యూనియన్ నాయకులు మంత్రి రాజశేఖర్, తదితరులు, సిటు నాయకులు బి. అప్పారావు, పూర్ణచంద్రరావు, ఎఐటియుసి నేత సత్యనారాయణ, బాబు సందర్శించారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా యాజమాన్యం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్
సరికొత్త గెటప్
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, అక్టోబర్ 12: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సరికొత్త గెటప్‌తో దర్శనమిచ్చింది. మొన్నటి వరకూ నిక్కర్లతో కార్యక్రమాలు నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ విజయదశమి నుంచి గెటప్ మార్చి ప్యాంట్లతో మార్చ్ ఫాస్ట్ (కవాతు) నిర్వహించింది. విజయదశమి సందర్భంగా మహా నగర్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో మంగళవారం పథ సంచాలనం జరిగింది. విశాఖ సాగరతీరం వేదికగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధుల కవాతు విశేషంగా ఆకట్టుకుంది. ప్రతిసారీ కవాతు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ విజయదశమి రోజున ఆర్‌ఎస్‌ఎస్ కవాతులో ప్రత్యేకత చోటుచేసుకుంది. ఖాకీ నిక్కర్, తెల్లషర్టుతో కవాతు నిర్వహించే పథ సంచాలకులు, నిక్కర్ స్థానే ప్యాంటు ధరించడం విశేషం. ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పడినప్పటి నుంచి వస్తున్న సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఫుల్ సైజ్ ప్యాంటుతో వందల సంఖ్యలో పథ సంచాలకులు ఆర్‌కె బీచ్ నుంచి పార్క్ హోటల్ వరకూ కవాతు నిర్వహించారు. అంతకుముందు ఆర్‌కె బీచ్ వేదికగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రార్థనాగీతాన్ని ఆలపించారు.
పెరుగుతున్న
గోదావరి
4.58 లక్షల క్యూసెక్కులు విడుదల
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, అక్టోబర్ 12: తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజి వద్ద 9.6 అడుగుల నీటి మట్టం నమోదైంది. వరద గోదావరి సముద్రంలోకి ఉరకలేస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో గోదావరిలో ఇంత నీటి లభ్యత కన్పించలేదు. ఈ ఏడాది మాత్రం వరదల సీజన్ ఆరంభమైనప్పటి నుంచీ వరద గోదావరి ఉద్ధృతంగానే కొనసాగుతోంది. ఈ సీజన్ ఆరంభం నుంచీ నిత్యం సరాసరిగా రెండు లక్షల క్యూసెక్కులకు తగ్గకుండా సముద్రంలోకి ప్రవహిస్తూనే వుంది. బుధవారం 4 లక్షల 58 వేల 639 క్యూసెక్కులు సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజికి వున్న 175 గేట్లలో ధవళేశ్వరం, ర్యాలీ ఆర్మ్‌లో గేట్లను 1.2 మీటర్లు, మద్దూరు ఆర్మ్‌లో గేట్లను 1.5 మీటర్లు, విజ్జేశ్వరం ఆర్మ్‌లోని గేట్లను మీటరు మేర ఎత్తివేసి వరద జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. భద్రాచలం వద్ద 31.3 అడుగుల నీటిమట్టం నమోదైంది. బ్యారేజి నుంచి సాగునీటి అవసరాల నిమిత్తం తూర్పు డెల్టాకు 3,500 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2,200, పశ్చిమ డెల్టాకు 6,000 క్యూసెక్కుల వరద జలాలను కాల్వలకు విడుదలచేశారు. అఖండ గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో కూడా వరద నీటి ప్రవాహ ఉద్ధృతి పెరుగుతోంది. కాళేశ్వరం వద్ద 6.49 మీటర్లు, పేరూరు వద్ద 8.07, దుమ్ముగూడెం వద్ద 8.5, కూనవరం వద్ద 11.13, కుంట వద్ద 5, కొయిదా వద్ద 15.1, పోలవరం వద్ద 10.1 మీటర్ల మట్టం నమోదైంది.
రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ రైల్వే బ్రిడ్జి వద్ద 14.79 అడుగుల నీటిమట్టంలో ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది.