ఆంధ్రప్రదేశ్‌

పనులు చేయని కంపెనీపై ప్రేమ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంలో తన పలుకుబడి ఉపయోగించి పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి చరిత్ర సృష్టించాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్రమం తప్పకుండా పోలవరం వెళ్లి పనులను పర్యవేక్షిస్తున్నారు. అయినా కాంట్రాక్టు పొందిన ట్రాన్స్‌ట్రాయ్ మాత్రం ఆ మేరకు పనులను వేగంగా పూర్తి చేయడంలో విఫలమవుతోంది. అధికార పార్టీ ఎంపికి చెందిన ఈ కంపెనీ వ్యవహార శైలిపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల్లోగా పనుల్లో వేగం చూపి, ప్రజల మన్ననలను పొందాలని చూస్తున్న ప్రయత్నాల్లో కాంట్రాక్టర్ పదోవంతు కూడా శ్రద్ధ చూపించడం లేదంటున్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుతోపాటు, ప్యాకేజీలో దానికోసం పట్టుపట్టిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి కాంట్రాక్టు కంపెనీ నత్తనడక తీరు వల్ల బూడిదలోపోసిన పన్నీరవుతోంది. రెండేళ్లలో పోలవరం పూర్తి చేయాలన్న బాబు ఆశలు ఫలించేలా కనిపించడం లేదు. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ స్పిల్ చానల్ పనులు చేస్తూ, స్పిల్‌వే ఎర్త్ పనులను త్రివేణి సంస్థకు సబ్‌కాంట్రాక్టుగా ఇచ్చింది. రోజుకు సుమారు 50 వేల క్యూబిక్ మీటర్ల ఎర్త్‌వర్క్ పనులను త్రివేణి నిర్వహించేది. ట్రాన్స్‌ట్రాయ్ మాత్రం కేవలం 15-20 వేల క్యూబిక్ మీటర్ల పనులే చేసేది. ఆ తర్వాత ఆ పనులు కూడా త్రివేణికే అప్పగించి, తాను మాత్రం అప్రోచ్ చానల్ పనులే చేస్తోంది. అయితే, ప్రధాన కంపెనీ అయిన ట్రాన్స్‌ట్రాయ్ సబ్‌కాంట్రాక్టు సంస్థకు సుమారు 70 కోట్ల వరకూ బిల్లులు చెల్లించక పోవడంతో ఆ కంపెనీ పనులు నిలిపివేసినట్లు సమాచారం. అయితే పైకి మాత్రం డీజిల్ కొరత వల్ల పనులు ఆపివేశామని త్రివేణి సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
ట్రాన్స్‌ట్రాయ్‌లో పనిచేసే వందలమంది కార్మికులు కూడా తమకు జీతాలు చెల్లించడం లేదంటూ పనులు నిలిపివేశారు. మరో సబ్ కాంట్రాక్టు సంస్థ అయిన బాపర్-ఎల్ అండ్ టికి సైతం ట్రాన్స్‌ట్రాయ్ బిల్లులు చెల్లించడం లేదన్న వ్యాఖ్యలు అధికారవర్గాల్లో వినిపిస్తున్నాయి. ట్రాన్స్‌ట్రాయ్ మాత్రం తమకు ప్రభుత్వం నుంచి బిల్లులు రావలసి ఉందని, అవి వస్తే చెల్లిస్తామంటోంది. అందువల్లే పనులు నిలిచిపోతున్నాయంటున్నారు. చంద్రబాబునాయుడు పరిశీలనకు రావడంతో పనులు మళ్లీ మొదలు పెట్టిన భావన కల్పించారు. సోమవారం పనుల పరిశీలనకు వెళ్లిన మీడియాపై దాడి చేయడానికి అసలు కారణం పనుల వ్యవహారం బయటకు పొక్కుతుందన్న భయమేనంటున్నారు. నిజానికి పనుల పురోగతిపై బాబు సైతం సమీక్ష సమావేశాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగుగంటల పాటు పనిచేసిన మట్టితవ్వే యంత్రం 3వేల క్యూబిక్ మీటర్లు మాత్రమే తవ్వడంపై ఆయన సంతృప్తిగా లేరు.
అటు ఇదే ట్రాన్స్‌ట్రాయ్ దక్కించుకున్న కాకినాడ-రాజమహేంద్రవరం (కేఆర్ రోడ్డు) విస్తరణ ప్రాజెక్టు కూడా మందకొడిగా సాగుతుండటం ప్రభుత్వానికి అప్రతిష్టగా మారింది. ఈ ప్రాజెక్టు పుణ్యాన రాష్ట్రంలో తొలిసారి ప్రపంచబ్యాంకు అర్ధంతరంగా ఒక ప్రాజెక్టు నుంచి వైదొలగ వలసి వచ్చింది. ఈ రోడ్డు నిర్మాణానికి రుణం మంజూరు చేసిన ప్రపంచబ్యాంక్, కంపెనీ వైఖరితో విసిగిపోయి ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుని, ఆ రోడ్డు పనులకు నిధులు ఇవ్వలేమని స్పష్టం చేయడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతిందని భావిస్తున్నారు.
విధించిన గడువు లోగా పనిచేయని ట్రాన్స్‌ట్రాయ్‌ని ఆ పనుల నుంచి తప్పించాలని కోరిన ప్రపంచబ్యాంకు సూచనను, ప్రభుత్వం పట్టించుకోకపోవడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి ఈ పనులు 2103 మార్చిలో ప్రారంభమై 2016 మార్చి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అందుకోసం 25 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా తీసుకున్నట్లు ఏపిఆర్‌డిసి అధికారులు చెబుతున్నారు. ఈ కంపెనీపై ప్రభుత్వం అనవసరంగా వల్లమాలిన ప్రేమ చూపిస్తోందన్న విమర్శలను పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. ఈ ప్రాజెక్టులో భాగమైన పెడన-నూజివీడు-విస్సన్నపేట రోడ్డులోని పనులు సక్రమంగా, సకాలంలో చేయని కాంట్రాక్టర్‌ను తప్పించి, జరిమానా విధించారు. మరి ప్రధాన పనులు చేపట్టిన ట్రాన్స్‌ట్రాయ్ మీద కూడా జరిమానా విధిస్తారా? లేదా చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకూ అక్కడ కేవలం 6 శాతం పనులే పూర్తయ్యాయి. ఎప్పుడూ ఆ రోడ్డులో ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోతుండటంతో పనులు వేగంగా పూర్తి చేయని ట్రాన్స్‌ట్రాయ్‌ను, పనుల నుంచి తప్పించాలని ప్రపంచబ్యాంకు మూడుసార్లు ప్రభుత్వానికి నివేదికలిచ్చినా పట్టించుకోలేదు. దానితో ప్రభుత్వ వైఖరికి ఆగ్రహించిన ప్రపంచబ్యాంకు ఇకపై ఆ రోడ్డుకు రుణం ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. అసలే ఆర్ధిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వం ఈ పరిస్థితిలో 300 కోట్లు ఖర్చయ్యే ఈ రోడ్డు ప్రాజెక్టుకు నిధులు వెచ్చించే పరిస్థితి ఉందా అన్నది ప్రశ్న. నిజానికి ఈ ప్రాజెక్టు ట్రాన్స్‌ట్రాయ్‌కు అప్పగించినప్పుడు అంచనా వ్యయం 200.53 కోట్లు. ఇప్పుడు అది మరో వంద కోట్లకు దాటనుంది. ఒకవైపు వివిధ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ప్రపంచబ్యాంకు చుట్టూ తిరుగుతోంది. వాటికోసం లక్షలు వెచ్చించి కన్సల్టెంట్లను నియమించుకుంది. అయితే అదే ప్రపంచబ్యాంకు సంస్థ ముందుకొచ్చి చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసే అనుకూల వాతావరణం కల్పించాల్సి ఉండగా, రాజకీయ మొహమాటంతో కాంట్రాక్టర్లను రక్షించడంపై సొంత పార్టీ వర్గాల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.