ఆంధ్రప్రదేశ్‌

అధికారులకే అందలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ అక్టోబర్ 19: ‘పేరుకే మేమంతా ప్రజాప్రతినిధులం. పెత్తనమంతా అధికారులదే. కలెక్టర్లు మాట వినరు. చివరకు ఆర్డీవోలు కూడా లెక్కచేసే పరిస్థితి లేదు. మా సార్ కూడా అధికారులనే అందలమెక్కిస్తున్నారు. సీఎంఓ నుంచి కలెక్టర్ల వరకూ అంతా అధికారుల రాజ్యమే నడుస్తోంది. అందుకే మా క్యాడర్‌కు ఏమీ చేయలేకపోతున్నాం. ఎన్నికల్లో కార్యకర్తలు పనిచేస్తారు గానీ అధికారులు కదా? మరి వారికి పెత్తనమిచ్చి ఒకసారి దెబ్బతిన్నా మళ్లీ అదే పంథాలో వెళితే ఎలా..’ ఇదీ.. ఏపిలో మంత్రులు, అధికారపార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల గోడు.
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా క్యాడర్‌కు కావలసిన పనులు చేసుకోలేకపోతున్నామన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. సీఎం చంద్రబాబు అధికారులనే అందలమెక్కిస్తున్నారని, ముఖ్యంగా కలెక్టర్లు తమను లెక్కచేయడం లేదని వాపోతున్నారు. కలెక్టర్లకు పెత్తనం అప్పగించి తమను మరుగుజ్జులను చేస్తున్నారన్న ఆవేదన సర్వత్రా నెలకొంది. అధికారులకు పెత్తనం ఇవ్వడం వల్లే 2004లో పార్టీ ఓడిపోయిందని, ఇప్పుడూ అదే పరిస్థితి కనిపిస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పుడు అధికారులకు పెత్తనం ఇచ్చి తప్పు చేశానని, ఈసారి అధికారంలోకి వస్తే మీకే తొలి ప్రాధాన్యం ఇస్తానని గత ఎన్నికల్లో కార్యకర్తలకు భరోసా ఇచ్చిన బాబు, మళ్లీ పాత పంథాలో వెళుతున్నారంటున్నారు. సీఎంఓ అధికారులు కూడా తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు దగ్గర పనిచేసిన అధికారులు తప్ప, మిగిలిన వారెవరూ ఖాతరు చేయడం లేదని మంత్రులు కూడా వాపోతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ను మార్చాలని అక్కడి ఎమ్మెల్యేలంతా ఒత్తిడి చేస్తున్నారు. ప్రతి సమావేశంలోనూ ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారు. తాజా జడ్పీ భేటీలో తెదేపా ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యం బహిరంగంగానే విమర్శలకు దిగారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు కింది స్థాయి అధికారులు కూడా కలెక్టర్‌కు వ్యతిరేకంగానే ఉన్నా ఆయనను మాత్రం మార్చలేదు. వీఆర్‌ఓల బదిలీల అంశంలో ఇన్చార్జి మంత్రి దేవినేని ఉమ, రాజప్ప సూచనలను కూడా ఖాతరు చేయని కలెక్టర్‌ను కొనసాగిస్తే ఇక తమకు ఏమి విలువ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఆయన వద్దని ఎమ్మెల్యేలంతా కలసి సంతకాలు కూడా చేసినట్లు సమాచారం. విశాఖలో తాజాగా మంగళవారం జెసిపై ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేసిన వైనం సంచలనం సృష్టించింది. ఆయనపై ఇతర శాఖల మంత్రులు కూడా గుర్రుగా ఉన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో నలుగురు మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా కలెక్టర్‌కు వ్యతిరేకంగానే ఉన్నారు. సీఎం బంధువన్న ప్రచారం ఉండటంతో ఎవరూ బయటపడలేకపోతున్నారు. ఆక్వా వివాదంలో ప్రజాప్రతినిధులు, నేతల భాగస్వామ్యం లేకుండా, అధికారులకు అప్పగించడం వల్లే అది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిందంటున్నారు. సీఎం సొంత చిత్తూరు జిల్లాలో కలెక్టర్,మంత్రి, ఎమ్మెల్యేల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. జడ్పీ చైర్మన్, ఎంపి, ఎమ్మెల్యేలు కలెక్టర్ పనితీరుపై బహిరంగ విమర్శలు చేయడమే కాక స్వయంగా సీఎంకు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌పై ఎమ్మెల్యేలు ఆది నుంచీ వ్యతిరేకతతో ఉన్నారు. చివరకు సీఎస్‌ను కూడా ఆయన లెక్కచేయరన్న విమర్శలున్నాయి. గుంటూరు జిల్లా కలెక్టర్‌పై కూడా కొందరు ఎమ్మెల్యేలు వ్యతిరేకతతో ఉన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ ఫైళ్లు పెండింగ్‌లో పెడుతున్నారని, ఆమె కూడా తమ మాట వినడం లేదన్న విమర్శలు ఎమ్మెల్యేల నుంచి వినిపిస్తున్నాయి. కలెక్టర్ల విషయంలో సీఎం తెప్పించుకుంటున్న సర్వేల్లో పస లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.