ఆంధ్రప్రదేశ్‌

మన భాషను గౌరవించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 4: తెలుగులో మాట్లాడితే దండించడం, విద్యార్థుల మెడల్లో పలకలు వేయడం వంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడే పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఆదేశించారు. శుక్రవారం ఎపి శాసనసభ అర్జీల కమిటీ, విద్యారంగంలో తెలుగుభాష పరిరక్షణ, పరిపాలన, అమలు అంశాలపై సబ్ కలెక్టర్ సమావేశ మందిరంలో మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలుగుభాష అమలులో అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో కమిటీ సమావేశం విజయవాడలో జరిగిందన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో తెలుగుభాష అమలుతీరుపై పలు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ విషయంలో విద్యాశాఖ అప్రమత్తంగా వ్యవహరించి ప్రజల భాష తెలుగును కాపాడ వలసిన బాధ్యత ఉందన్నారు. తెలుగు పదకోశంతో పాటు ముఖ్యమైన చట్టాలను అంతర్జాలంలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాణిజ్య సముదాయాలు, పాఠశాలల్లో ఏర్పాటు చేసి నేమ్ బోర్డులను తప్పనిసరిగా తెలుగులోనే ఉంచాలన్నారు. అతిక్రమించిన వారి పేర్లతో జాబితా రూపొందించి కమిటీ దృష్టికి తీసుకురావాలన్నారు. పిటిషన్ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే కె శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుభాష ఔన్నత్యాన్ని, గౌరవాన్ని పరిరక్షించే విధంగా కమిటీ పని చేస్తుందన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు భాష ఔన్నత్యానికి చేస్తున్న కృషిని అభినందిస్తూ అలాంటి సంకల్పం ఉండాలని ఆకాంక్షించారు. కమిటీ సభ్యుడు జె వెంకటరెడ్డి మాట్లాడుతూ మంచి సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలు విస్మరించటం సమంజసం కాదన్నారు. సామాన్యమైన ప్రజానీకానికి క్షేత్రస్థాయిలో మన తెలుగుభాష ఔన్నత్యం ఇనుమడించే విధంగా అధికారులు అంకితభావంతో పని చేయాలన్నారు.

చిత్రం.. సమావేశంలో మాట్లాడుతున్న బుద్ధప్రసాద్