ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా కోసం పవన్‌తో కలిసి పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 13: ప్రత్యేక హోదా కోసం సిపిఐ ముందు నుంచీ పోరాటం చేస్తోందని, పవన్‌కళ్యాణ్‌తో పాటు ఎవరు ముందుకొచ్చినా కలిసి పోరాటాన్ని సాగిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొంటున్నారని, ప్రత్యేక హోదా రాకపోతే మాత్రం ఆయన కథ ముగిసిన అధ్యాయంగా మారుతుందన్నారు. వెంకయ్యనాయుడుతో పాటు సిఎం చంద్రబాబునాయుడు కూడా మునిగిపోతారని, నాయుడు మరో నాయుడిని ముంచేస్తారని ఎద్దేవాచేశారు.
ఆరు వేల కోట్లతో ఆరంభమైన పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఇప్పటికి రూ.36వేల కోట్లకు చేరుకుందని, ప్రభుత్వాలు మారినపుడల్లా అంచనా వ్యయాలు మారుతున్నాయని, కానీ నిర్వాసితుల స్థితి మాత్రం మారలేదని రామకృష్ణ ఆందోళన వ్యక్తంచేశారు. పోలవరం నిర్వాసిత ప్రాంతంలో పర్యటించి ఆదివాసీ, నిర్వాసితుల పరిస్థితులు తెలుసుకుంటున్నామన్నారు. త్వరలో ముఖ్యమంత్రికి పోలవరం నిర్వాసితుల సమస్యలపై లేఖ రాస్తామని, త్వరలో కలుస్తామని చెప్పారు. పోలవరం నిర్మాణానికి వంద శాతం నిధులు కేంద్రమే భరించడం హర్షణీయమన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టుకు లేని విధంగా లక్షలాది మంది నిర్వాసితులు కావడం, వందలాది గ్రామాలు ఖాళీ చేయడమనేది ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే ఎదురైందని, నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా రూ.1000, రూ.500 నోట్ల రద్దు తగదని, దీనివల్ల సామాన్య ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రంలోని ఎన్‌డిఎ పెద్దలకు నోట్ల రద్దు విషయం ముందుగానే తెలుసని అనుమానాలు కలుగుతున్నాయన్నారు. విదేశీల బ్యాంకుల్లో మూలుగుతున్న సుమారు రూ.80 లక్షల కోట్ల నల్లధనాన్ని తిరిగి తీసుకురావాలన్నారు. నోట్ల విషయంలో అన్ని పార్టీలతో చర్చించి, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. రూ.10 వేల కోట్లు హైదరాబాద్‌లో మార్చుకున్నవారి పేరు బహిర్గతం చేయాలని, ఇటువంటి వారిపై చర్యలు తీసుకుంటే మిగిలిన వారికి భయం కలుగుతుందన్నారు.
రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా తెస్తామని ఎపి బిజెపి నేతలు హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం వుందన్నారు. బిజెపికి చెందిన ఇద్దరు ఎంపిలు, నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో గెలిస్తే ప్రజల్లో ప్రత్యేక హోదా సెంటిమెంటు ఉందో లేదో బయటపడుతుందన్నారు. వైసిపికి బదులు బిజెపి ప్రజాప్రతినిధులే రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని హితవు పలికారు. సమవేశంలో సిపిఐ రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, నాయకులు జిత్తుక కుమార్ తదితరులు పాల్గొన్నారు.