ఆంధ్రప్రదేశ్‌

చెన్నైకి ఆర్టీసీ సర్వీసులు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: తమిళనాడులో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రం నుంచి చెన్నై వెళ్లే ఎపిఎస్ ఆర్టీసీ బస్సులు సాయంత్రం నుంచి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆర్టీసీ మేనేజింగ్ డైరక్టర్ ఎం.మాలకొండయ్య ఉన్నతాధికారులతో సమావేశమై ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించారు. పరిస్థితులకు అనుగుణంగా తక్షణం నిర్ణయాలు తీసుకోవాలంటూ ఆయా జిల్లాల రీజనల్ మేనేజర్లను ఆదేశించారు. రాష్ట్రం నలుమూలల నుంచి నిత్యం చెన్నైకు 176 ఆర్టీసీ సర్వీస్‌లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిల్లో 90 శాతం బస్ సర్వీసులను సాయంత్రం నుంచి వెనక్కి పంపించేశారు. ఇక రాష్ట్ర రాజధాని విజయవాడ నుంచి నిత్యం రెండు సూపర్ లగ్జరీ, రెండు గరుడ బస్సులు బయలుదేరుతుండగా ఈ సర్వీసులను రద్దు చేసినట్లు రీజనల్ మేనేజర్ పివి రామారావు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. విశాఖపట్టణం, కాకినాడ నుంచి విజయవాడ మీదుగా చెన్నై వెళ్లే మరో ఆరు సర్వీసులు కూడా రద్దయ్యాయి. ఇక విజయవాడ నుంచి రైళ్లలో చెన్నైకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.
తమిళనాడు సరిహద్దులో ఏపి పోలీసులు అప్రమత్తం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించడంతో పొరుగు రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాల్లో రాష్ట్ర పోలీసు శాఖ అప్రమత్తమైంది. తీవ్ర అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో వైద్యచికిత్సలు పొందుతున్న తరుణంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించిందనే సమాచారం తెలియగానే అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఏ క్షణం ఎలాంటి వార్త వినాల్సి వస్తోందన్న ఆందోళన చోటుచేసుకున్న తరుణంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పకుండా అక్కడి ప్రభుత్వం పోలీసు శాఖను అప్రమత్తం చేసింది. దీంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైన నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కూడా ప్రభావం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు ఆయా జిల్లాల ఎస్పీలకు ఈమేరకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. చిత్తూరు, పుత్తూరు, నగరి, సత్యవేడు, పలమనేరు, తదితర ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసు బలగాలు మోహరించాయి. పికెట్లు, పెట్రోలింగ్ కొనసాగిస్తున్నట్లు రాష్ట్ర శాంతిభద్రతల విభాగం ఐజి హరీష్‌కుమార్ గుప్తా ‘ఆంధ్రభూమి’కి తెలిపారు. సమాచారం తెలియగానే ఆదివారం రాత్రి నుంచే బలగాలను అప్రమత్తం చేశామన్నారు. ప్రధానంగా ఆంధ్రా, తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన తడ, ఆరంబాకం ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు మోహరించాయని, ఆయా జిల్లాల ఎస్పీలతో పాటు ప్రత్యేకంగా అనంతపురం, తిరుపతి డిఐజిలు, గుంటూరు ఐజి పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉన్నప్పటికీ పక్క రాష్ట్రంలో క్షణక్షణం మారుతున్న స్థితిగతులను అంచనా వేస్తున్నారు.