ఆంధ్రప్రదేశ్‌

పర్యాటకంలోకి పురావస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 6 :పురావస్తు శాఖ పర్యాటక బోర్డులో విలీనమైంది. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటూ హడావిడిగా ఆర్డినెన్స్ జారీ చేసింది. కాగా పర్యాటకంతోపాటు సాంస్కృతిక, పురావస్తు శాఖలను టూరిజం బోర్డు పరిధిలోకి తీసుకు రావడం చరిత్రను అవమానించడమేనని చరిత్రకారులు ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్ర పురావస్తు శాఖను రద్దుచేసి పర్యాటక బోర్డుగా ప్రకటించిన ఆర్డినెన్స్ 2016ను రద్దు చేయాలని మేధావులు డిమాండుచేస్తున్నారు. భారతదేశంలో మొదటిసారిగా 1784లో రాయల్ ఎసియాటిక్ సొసైటీని కోల్‌కతాలో ప్రారంభించారు. దీని ఆలంబనగా బ్రిటీష్ పాలకులు 1861లోనే ఆర్కీయలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఏర్పాటుచేసి భారతదేశంలోని పురాతన కట్టడాలు, వాటి పరిరక్షణ, శాసనాలపై పరిశోధన, చరిత్ర మూలాలను తెలుసుకునేందుకు, భారతదేశ చరిత్ర సంస్కృతి పరిరక్షణకు పునాదులు వేశారు. 1914లో హైదరాబాద్ సంస్థానంలో రాష్ట్ర పురావస్తు శాఖ ఏర్పాటైంది. రాష్ట్ర పురావస్తు శాఖ ఎన్నో బౌద్ధ, జైన, హిందూ ఆలయాలను, ఆధునిక మానవుల జీవన స్థితిగతులకు సంబంధించిన బృహత్ శిలాయుగం నాటి గుహాలయాలు, గుహల్లో రాతిపై గీసిన చిత్రాలు వంటి ఎన్నో ప్రదేశాలను పరిరక్షిత కట్టడాలుగా పరిగణించి, వాటి సంరక్షణను చేపట్టింది. తవ్వకాల్లో లభ్యమైన ప్రాచీన వస్తువులు, నాణేలు, శాసనాలెన్నింటినో భద్రపరిచారు. ఇంతటి అమూల్యమైన చరిత్ర సంపదను భద్రపరిచిన పురావస్తు శాఖను అర్థంతరంగా ఒక్క రోజులో ఆర్డినెన్స్ ద్వారా రద్దుచేసి పర్యాటక బోర్డులో విలీనం చేయడం దారుణమంటున్నారు. ఎన్నో కేంద్ర చట్టాలతో రాష్ట్ర పురావస్తు శాఖ నడుస్తోంది. 1878 నాటి ఇండియన్ ట్రజర్ ట్రోప్ యాక్టు, ద ఏనిషెంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్టు తదితర చట్టాలన్నీ కేంద్రమే జారీచేసింది. వీటన్నింటినీ కాదని రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా పురావస్తు శాఖను విలీనం చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పర్యాటక బోర్డులో విలీనాన్ని రద్దుచేయాలని కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు చరిత్రకారులు కొందరు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి కేంద్రం జారీ చేసిన ఈ చట్టాలను రద్దుచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అయినప్పటికీ విలీనం చేశారంటే కచ్చితంగా ముఖ్యమంత్రి అవగాహనాలోపమేనని చరిత్రకారులు, మేధావులు పెదవి విరుస్తున్నారు. కాగా బోర్డు పరిధిలో ఎటువంటి పరిశోధనలకు అవకాశం ఉండదు. విలువ కట్టలేని మ్యూజియం వస్తువులు, పంచలోహ విగ్రహాలు, పురాతన నాణేలు, పురావస్తు కళాఖండాలు, బంగారు నాణాలు, శాసనాలు, తాళపత్ర గ్రంథాలు తదితరాలన్నీ ప్రైవేటుకిచ్చేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక కుట్రతో బోర్డులో విలీనం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆర్డినెన్స్ ద్వారా పురాతన స్థలాలు, మ్యూజియంలు ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం బోర్డుగా మార్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చిత్రం..పర్యాటక బోర్డు అధీనంలోకి వెళ్లనున్న రాజమహేంద్రవరంలో కందుకూరి నివాస గృహం