ఆంధ్రప్రదేశ్‌

జనవరి 7 నుంచి డయాఫ్రమ్ వాల్ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 13: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా డయాఫ్రమ్ వాల్ పనులను జనవరి 7 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చరిత్రను పదిలంగా కాపాడుకునేందుకు వీలుగా డాక్యుమెంటరీగా చిత్రీకరించాలని ఆదేశించారు. వెలగపూడిలోని సచివాలయం నుంచి పోలవరం ప్రాజెక్టు పనులపై మంగళవారం ఆయన వర్చ్యువల్ ఇన్స్‌పెక్షన్ నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు సాకారం కావాలంటే నిర్దేశిత లక్ష్యం ప్రకారం పనులు ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. సమయం తక్కువగా ఉన్నందున పెండింగ్ పనులను సత్వరమే చేపట్టాలని నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. ఈ వారం నిర్దేశించిన లక్ష్యానికికన్నా 5.87 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టి తవ్వకాల్లో వెనుకబడి ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల ప్రగతిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గడచిన వారంలో స్పిల్‌వే, స్పిల్ చానల్, పవర్‌హౌస్ ఫౌండేషన్, అప్రోచ్ చానల్, పైలట్ చానల్ పనులన్నీ కలిపి 13.87 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకాలు జరిగాయని వివరించారు. రోజుకు సగటున 37 వేల క్యూబిక్ మీటర్ల చొప్పున స్పిల్‌వే, 1.09 లక్షల క్యూబిక్ మీటర్ల మేరకు స్పిల్ చానల్ వద్ద తవ్వకాలు చేపట్టామన్నారు. మరో రెండు నెలల్లో స్పిల్‌వే, ఆరు నెలల్లో స్పిల్ చానల్ పనులు పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జనవరి 7 నుంచి డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభించాలన్నారు. ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే కాంక్రీట్ పనులకు వీలుగా యంత్ర పరికరాలను నిర్మాణ ప్రాంతంలో అందుబాటులో ఉంచామని, సిమెంట్, ఇనుము తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కాంక్రీట్ పనులు ప్రారంభించేందుకు వీలుగా అన్ని పరీక్షలు నిర్వహించామన్నారు. 960 మెగావాట్ల విద్యుత్ కర్మాగారం నిర్మాణానికి టెండర్లు పిలవనున్నట్లు ఎపి జెన్కో అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చరిత్రలో నిలిచిపోయేలా ప్రతిదశలోనూ పనులను చిత్రీకరించి డాక్యుమెంటరీ రూపంలో భద్రపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పోలవరం నిర్మాణం గురించి భావితరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎగ్జిబిషన్, మ్యూజియం ఏర్పాటుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే నేషనల్ జియోగ్రఫిక్ చానళ్ల వంటి సేవలను ఇందుకు వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. సమీక్షలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ఇఎన్‌సి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటివరకూ రూ.2900 కోట్లు ఖర్చు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇప్పటివరకూ 2900 కోట్ల రూపాయలు ఖర్చుచేశామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఖర్చుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే నాబార్డ్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖకు పంపామని చెప్పారు. విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి వచ్చే వారం టెండర్లు పిలవనున్నామన్నారు. డ్యాం సైట్‌లో జరుగుతున్న ప్రతి పనినీ వీడియో ద్వారా చిత్రీకరించి మీడియాకు పంపుతామన్నారు. గడచిన రెండున్నరేళ్లలో తమ శాఖ ద్వారా దాదాపు 19,830 కోట్ల రూపాయలు ఖర్చుచేశామని, ఇప్పటికే 18,740 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించామన్నారు. పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టప్రకారం న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను ప్రతిపక్ష నేత అడ్డుకుంటున్నారని, కోర్టులో కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు.

చిత్రం..పోలవరం పనులపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు