ఆంధ్రప్రదేశ్‌

రివాల్వర్‌తో కాల్చుకుని రైటర్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 17: సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని పోలీస్టేషన్ రైటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిథిలోని గన్నవరంలో జరిగిన ఈ ఘటన పోలీసువర్గాల్లో సంచలనం రేపింది. అయితే ఘటనపై అనుమానాలు ఉన్నాయంటూ మృతుని భార్య ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గన్నవరం పోలీస్టేషన్ రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కనగాల దైవకృప డేవిడ్‌రాజు (55) ఎప్పటిలాగే శనివారం ఏడున్నర గంటలకు డ్యూటీకి వచ్చాడు. కొద్దిసేపటి తర్వాత పని ఉందని చెప్పి స్టేషన్ నుంచి వెళ్లిపోయాడు. ఎంతకీ తిరిగి రాకపోయేసరికి సిబ్బంది ఆయన సెల్‌ఫోన్‌కు ఫోన్ చేసినా స్పందన లేదు. ఈలోగా.. డయల్ 100కు వచ్చిన ఫోన్‌కాల్ సమాచారంతో అప్రమత్తమైన గన్నవరం సిఐ అహ్మద్ అలి, సిబ్బంది హుటాహుటినా బయలుదేరి వెళ్ళారు. పురుషోత్తమపట్నం-ముస్తాబాద్ పొలాల్లో యూనిఫారంలో ఉన్న రైటర్ డేవిడ్‌రాజును గుర్తించారు. పని ఉందని చెప్పి స్టేషన్ నుంచి వెళ్లిన రైటర్ ఇక్కడకు వచ్చి సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు.
సాధారణంగా అధికారులు తమ సర్వీసు రివాల్వర్లు విధులు ముగిశాక స్టేషన్‌లోనే ఉంచేసి వెళ్ళిపోతారు. ఈ రివాల్వర్లు స్టేషన్ రైటర్ ఆధీనంలో ఉంటాయి. కాగా.. చనిపోవాలని ముందుగానే నిర్ణయించుకున్న రైటర్ నేరుగా విధులకు హాజరై తన ఆధీనంలో ఉన్న సర్వీసు రివాల్వర్‌తో సూసైడ్ చేసుకోవడం అనుమానాలకు తావిస్తోంది. అతని వద్ద లభించిన సూసైడ్ నోటును పోలీసు స్వాధీనం చేసుకుని, అతని భార్యకు కూడా చూపించారు. కాగా.. అనారోగ్యం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్‌నోటులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం దావాజీగూడెంలో ఉంటున్న డేవిడ్‌రాజు కమిషనరేట్‌లోని వన్‌టౌన్, ఇబ్రహీంపట్నం, ఉంగుటూరు పోలీస్టేషన్లలో పని చేశారు. ఆర్ధికంగా లోటు లేని ఈయన నిజాయితీ ఉద్యోగిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే మరోవైపు స్ధానికంగా పాస్టర్‌గా వ్యవహరిస్తున్న రైటర్ డేవిడ్ రాజు ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనాస్థలాన్ని డిసిపి కోయ ప్రవీణ్, ఈస్ట్ ఏసిపి విజయభాస్కర్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసిన సిఐ అహ్మద్ అలీ దర్యాప్తు చేపట్టారు.