రాష్ట్రీయం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎక్సైజ్ అధికారి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 17: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అదనపు కమిషనర్‌ను అవినీతి నిరోధక శాఖాధికారులు శనివారం విజయవాడలో అరెస్టు చేశారు. విశాఖపట్నం, ఏలూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర చోట్ల మొత్తం 11 ప్రాంతాల్లో సోదాలు జరిపిన అధికారులు సుమారు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే అక్రమాస్తులు గుర్తించారు. మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ దాదాపు 25కోట్ల వరకు ఉంటుందని అంచనా. వీటితోపాటు 170 గ్రాముల బంగారం, ఏడు లక్షల నగదు, విలువైన డాక్యుమెంట్లతోపాటు, ఏడు విదేశీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో అదుపులోకి తీసుకున్న సదరు అధికారిని శనివారం రాత్రి అతను నివాసముంటున్న హైదరాబాద్‌కు తరలించారు. ఆయాచోట్ల ఇంకా సోదాలు కొనసాగిస్తున్నట్లు విశాఖపట్నం ఏసిబి డిఎస్పీ కెవి రామకృష్ణప్రసాద్ తెలిపారు. కేసుకు సంబంధించి ఆయన తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం కాటంవారితోట స్వస్ధలమైన కాటం లక్ష్మణ్ భాస్కర్ (55) వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. ప్రస్తుతం ఏపి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అదనపు కమిషనర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్న ఈయన విభజన అనంతరం ప్రభుత్వ శాఖలు విజయవాడకు తరలిరావడంతో ఇప్పుడు ఇక్కడ గురునానక్ కాలనీలో ఇల్లు తీసుకుని ఒక్కరూ ఉంటూ ఎక్సైజ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. 1994లో ఎక్సైజ్‌శాఖలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా అడుగుపెట్టిన లక్ష్మణ్ భాస్కర్ ఆ తర్వాత ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా, అసిస్టెంట్ కమిషనర్‌గా, డిప్యూటీ కమిషనర్‌గా వివిధ హోదాల్లో శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం తదితర చోట్ల పని చేశారు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన ఈయన ఆదాయానికి మించి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ఫిర్యాదులు రావడంతో విశాఖపట్నం అవినీతి నిరోధక శాఖ కేసులు నమోదు చేసింది. దీంతో రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో మూడు బృందాల అధికారులు శనివారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. విశాఖపట్నంలో జరిపిన సోదాల్లో 1700 చదరపు అడుగుల స్థలం, భార్య పేరుతో ఉన్న 600 చదరపు గజాల మరో స్థలం, మరోచోట 175 గజాల స్థలం, పెందుర్తిలో 325 గజాల స్థలాన్ని గుర్తించారు. విశాఖపట్నంలోనే ఈయన కనుసన్నల్లో ఉండే ఎక్సైజ్ కానిస్టేబుల్ వద్ద నుంచి 3.25లక్షలు నగదు, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలోని మద్యం దుకాణాల నుంచి ఈయనకు మాముళ్ళు రూపంలో వచ్చిన సొమ్ముగా అనుమానిస్తున్నారు. అదేవిధంగా విజయవాడలోని కార్యాలయం, అద్దెకుంటున్న ఇంట్లో సోదాలు జరిపి నాలుగు కవర్లలో ఉన్న 3.80లక్షల రూపాయలు నగదు, 170గ్రాముల బంగారం, ఏడు విదేశీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ముందురోజు ఇక్కడ జరిగిన అధికారుల సమావేశం సందర్భంగా అందిన సొమ్ముగా అనుమానిస్తున్నారు. వీటితోపాటు ఈయన స్వస్ధలంలో భార్య పేరుతో ఉన్న ఐదు ఎకరాల భూమిని గుర్తించారు. అదేవిధంగా హైదరాబాద్‌లో ఈయన నివాసముంటున్న 1524 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్ సొంత ఫ్లాట్‌తోపాటు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నాలుగు స్థలాలు, హయత్‌నగర్‌లో ఓ స్థలం ఉన్నట్లు సోదాల్లో గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, విజయవాడలో అదుపులోకి తీసుకున్న లక్ష్మణ్ భాస్కర్‌ను హైదరాబాద్ తరలించి బ్యాంకు అకౌంట్లు, ఇతరత్రా మరిన్ని సోదాలు చేయాల్సి ఉందని డిఎస్పీ రామకృష్ణప్రసాద్ తెలిపారు. ఏసిబి డిజి ఆర్‌పి ఠాకూర్ ఆదేశాల మేరకు ఈ దాడుల్లో ఈయనతోపాటు విశాఖ, విజయవాడ, హైదరాబాద్ ఏసిబి అధికారులు వి గోపాలకృష్ణ, గణేష్, శ్రీనివాస్, సురేంద్రరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సికిందరాబాద్‌లో రూ.1.8 కోట్ల గుర్తింపు
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులున్నాయని అభియోగాలపై ఆంధ్రప్రదేశ్‌కు ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ లక్ష్మణ్ భాస్కర్‌కు సంబంధించి సికిందరాబాద్‌లోని ఐదు చోట్ల అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. శనివారం సాయంత్రం ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహించారు. దాదాపు రూ. కోటి 80 లక్షల ఆస్తులున్నట్టు ఏసిబి అధికారులు గుర్తించారు. లక్ష్మణ్ భాస్కర్ సోదరి, స్నేహితుడు సత్యనారాయణ, మరో ఇద్దరి ఇళ్ళల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్టు ఎసిబి అధికారులు తెలిపారు. అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. నగదుతోపాటు బంగారు ఆభరణాలు ఈ సోదాల్లో గుర్తించినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా లక్ష్మణ్ భాస్కర్‌కు సంబంధించిన ఇళ్లల్లో కూడా సోదాలు జరుగుతున్నాయని, ఎన్ని అక్రమాస్తులు కూడబెట్టారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని, ఆదివారం కూడా ఈ సోదాలు నిర్వహించి అక్రమాస్తుల విలువను ప్రకటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం.