రాష్ట్రీయం

అడుగంటుతున్న తుంగభద్ర ఆయకట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 2: రాయలసీమ జిల్లాలకు సాగు, తాగు నీటిని అందిస్తూ కరవుసీమకు కల్పతరువుగా ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు కింద సాగు చేసే ఆయకట్టు నానాటికీ తగ్గిపోతోంది. దీంతో రాయలసీమ లోని జిల్లాలకు తుంగభద్ర ప్రాజెక్టు నుంచి ప్రతిఏటా చేస్తున్న నీటి కేటాయింపుల్లో అత్యధిక శాతం వాటా తాగునీటికే పరిమితమవుతోంది. ఇలా సాగు నీటి కోసం నిర్మించిన ప్రాజెక్టు చివరకు తాగునీటి ప్రాజెక్టుగా రూపాంతరం చెందే పరిస్థితి ఏర్పడడం ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలకు సాగునీటిని అందించే హెచ్‌ఎల్‌సి, ఎల్‌ఎల్‌సి, కెసి కెనాల్ కు తుంగభద్ర డ్యామ్ నుంచి 72 టిఎంసిల కేటాయింపులతో 7,14,214 ఎకరాల స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. కానీ ప్రస్తుతం మూడు లక్షల ఎకరాలకు మించి సాగవని పరిస్థితి నెలకొని ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి వచ్చే నీటితో కెసి కెనాల్ కింద 2,67,036 ఎకరాలు, తుంగభద్ర ఎగువ, దిగువలకు కలిపి 4,47,178 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందాలి. అయితే తుంగభద్ర డ్యామ్ మొత్తం ఎగువన ఉన్న కర్నాటక రాష్ట్రంలో ఉంది. దీంతో ప్రతి ఏటా సాగునీటి విడుదల సమయంలో సరిహద్దు దాటి ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చే లోపు నీటివాటా క్రమేణా తగ్గిపోతూ వస్తోంది.ఇక తుంగభద్ర దిగువ కాల్వ కర్నాటకలో 250 కిలోమీటర్లు ప్రవహించి కర్నూలులోకి ప్రవేశిస్తుంది. ఈ కాల్వ కింద కర్నూలు జిల్లాలో1.53 లక్షల ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. దీనిద్వారా ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, పాణ్యం నియోజకవర్గాలకు సాగునీరు అందుతోంది. అయితే ప్రస్తుతం 50 వేల ఎకరాలకు కూడా సాగు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. తుంగభద్ర ఎగువ కాల్వ కర్నాటకలో 105 కిలోమీటర్లు ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. ఈ కాలువ కింద కర్నూలు జిల్లాలో14,774 ఎకరాలు, అనంతపురంలో 1,38,804 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఇందులో ప్రస్తుతం 60 వేల ఎకరాలకు కూడా సక్రమంగా సాగు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. కడప జిల్లాలోనూ ఎగువ కాలువ కింద 1,40,600 ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టు ఉండగా 40 వేల నుంచి 50 వేల ఎకరాలకు మించి సాగునీరు అందడం లేదు. తుంగభద్ర, కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. దీనివల్ల కాలువల్లో చెట్లు, గుర్రపుడెక్క పేరుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారుతున్నాయి. కర్నాటకలో కాలువలు శిథిలావస్థకు చేరుకుని పూడికలు పెరిగిపోవడం, జల చౌర్యం వల్ల రాయలసీమలోని మూడు జిల్లాల్లో తుంగభద్ర ఆయకట్టు నానాటికీ తగ్గిపోతోంది. దీనిని నివారించేందుకు కర్నాటకలో సమాంతర కాలువ తవ్వాలని లేదా పైపులైను ద్వారా ఎపికి సంబంధించిన వాటాను తీసుకుని రావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. అయితే దీనిని కర్నాటక సర్కారు పెడచెవిన పెడుతోంది. కాలువల ఆధునీకరణ పనులు అయినా చేపడితే న్యాయం జరుగుతుందని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైతే కర్నాటక ప్రభుత్వం ఎగువ, దిగువ కాలువల ఆధునీకరణ పనులకు అంగీకరించింది. ఈ మేరకు తుంగభద్ర బోర్డు హెచ్‌ఎల్‌సి, ఎల్‌ఎల్‌సి ఆధునీకరణపై సర్వే చేయించింది. ఆధునీకరణకు అయ్యే మొత్తానికి ఎపి, కర్నాటక ప్రభుత్వాలు వారి వారి వాటాగా నిధులు కేటాయించాలి. దీంతో నిధుల కేటాయింపుల వద్దకు వచ్చేటప్పటికి కర్నాటక ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తుండడం ఆధునీకరణ పనులకు అడ్డంకిగా మారుతోంది.