ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరులో ఎన్‌సిఇఆర్‌టి కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 26: రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో ఇప్పటికే పలు కేంద్ర రంగ సంస్థలు, విద్యాలయాలు ఏర్పడుతున్న తరుణంలో మరో కేంద్రస్థాయి విద్యాసంస్థ నెల్లూరులో ఏర్పాటవుతోంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) కేంద్రాన్ని నెల్లూరు జిల్లా వెంకటాచలంలో నిర్మించనున్నారు. దీనికి సంబంధించి మంగళవారం భవన నిర్మాణ పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, ప్రకాశ్ జవదేకర్ విచ్చేస్తున్నారు. వారితో పాటు రాష్ట్ర మంత్రులు పి.నారాయణ, గంటా శ్రీనివాసరావు హాజరవుతున్నారు. దేశంలో అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్, షిల్లాంగ్ నగరాల్లో మాత్రమే ఇప్పటివరకు ఈ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రాంతీయ కార్యాలయ కేంద్రం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పాఠశాల విద్య, అధ్యాపక వృత్తి శిక్షణ రంగాల్లో ఉన్నత ప్రమాణాలు సాధించేందుకు ఉపయోగపడనుంది.
ఆయిల్‌ఫెడ్‌లో డైరెక్టర్లుగా రైతు ప్రతినిధులు!

విజయవాడ, డిసెంబర్ 26: ఆయిల్‌ఫెడ్‌లో ఇద్దరు రైతు ప్రతినిధులను డైరెక్టర్లుగా నియమించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సుముఖత వ్యక్తం చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రిని ఆంధ్రప్రదేశ్ ఆయిల్‌పామ్ రైతు సంక్షేమ సంఘం ప్రతినిధులు సోమవారం కలిశారు. ఇద్దరు డైరెక్టర్లను నియమించేందుకు విజ్ఞప్తి చేయగా మంత్రి అంగీకరించారు. మార్కెట్ ఇంటర్‌వెన్షన్ పథకం కింద నిధులు విడుదల చేయాలని కూడా వారు మంత్రిని కోరారు. గత సంవత్సరం ప్రభుత్వం అంగీకరించిన విధంగా ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్‌ను 2 శాతం కలిపి ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఉద్యానవన శాఖ కమిషనర్‌ను ఆదేశించారు.
ఎమ్మెల్సీ బరిలో వైకాపా అభ్యర్థి

నెల్లూరు, డిసెంబర్ 26: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసేందుకు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం జిల్లా పార్టీ పరిశీలకుడిగా వచ్చిన ఒంగోలు పార్లమెంటు సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి జిల్లా నాయకులు స్పష్టం చేశారు. నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి నివాసంలో ఆయన జిల్లాలోని వైకాపా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ముఖ్యనేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో తప్పక పోటీచేయాలని తమ అధినేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారని, ఆ మేరకు జిల్లా నేతలు సిద్ధమవ్వాలని ఆయన సూచించారు. ఇదిలావుండగా నల్లధనాన్ని రూపుమాపేందుకు నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దు చేయడం మంచి పనే, కాని ప్రజలు పడుతున్న కష్టాలను పరిష్కరించడంలో విఫలమయ్యారని నెల్లూరు, ఒంగోలు ఎంపిలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని వైకాపా జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం విలేఖరుల సమావేశం జరిగింది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే 45 రోజులుగా బ్యాంకుల ముందు ప్రజలు పడుతున్న కష్టాలను ఓ కొలిక్కి తీసుకురావడంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. నరేంద్రమోదీ పెద్దనోట్లు రద్దు చేస్తే చంద్రబాబునాయుడు తాను చెప్పి చేయించానని చంకలు గుద్దుకోవడం తప్ప సమస్యను పరిష్కరించిన పాపాన పోలేదన్నారు.

31న మంత్రివర్గ సమావేశం!

విజయవాడ, డిసెంబర్ 26: వెలగపూడిలోని సచివాలయంలో ఈ నెల 31న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుందని తెలిసింది. ఆరోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. ఈ సంవత్సరానికి సంబంధించి ఇదే చివరి మంత్రివర్గ సమావేశం కానుంది.
హత్యారాజకీయాల ఉసురు
మీ కుటుంబానికే తగిలింది
జగన్‌పై మండలి డిప్యూటీ చైర్మన్ సతీశ్‌రెడ్డి ధ్వజం

కడప, డిసెంబర్ 26: హత్యారాజకీయాలకు ఎవరు పాల్పడేది ప్రజలకు బాగా తెలుసునని, ఆ ఉసురు వైఎస్ కుటుంబానికే తగిలిందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం కడప జిల్లా వేంపల్లెలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు పరామర్శ పేర జగన్ మొద్దునిద్ర నుంచి మేల్కొని తెలుగుదేశంపార్టీ నేతలపై విమర్శలు చేయడం విచారకరమన్నారు. హత్యారాజకీయాలకు పాల్పడుతోంది వైకాపా నేతలేనన్నారు. పైగా టిడిపి వారే ఫ్యాక్షన్ హత్యలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపించడం సిగ్గుచేటన్నారు. జగన్ అబ్బ రాజారెడ్డి, జగన్ తండ్రి రాజశేఖరరెడ్డి వల్లే సీమ జిల్లాల్లో ఫ్యాక్షనిజం పెరిగిందన్నారు. హత్యలు, హత్యాయత్నాలు చేసిన ఘనత వారిదేనన్నారు. సామరస్యం, శాంతిని కోరే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విమర్శించడం తగదన్నారు.
హత్యారాజకీయాలను తమ పార్టీ ఎప్పుడూ కోరుకోదన్నారు. ఫ్యాక్షనిజం అంటే తమకు తెలియదని, తాము శాంతియుతంగానే పోరాడుతామన్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి హత్యారాజకీయాలు చేసేది వైఎస్ కుటుంబమేనన్నారు. 40 ఏళ్లలో వైఎస్ కుటుంబం వల్ల ఎంతో మంది అమాయకులు బలయ్యారన్నారు. ఎన్నో కుటుంబాలు రోడ్లపాలయ్యాయన్నారు. వారందరి ఉసురు జగన్ కుటుంబానికి తగులుకుందని అన్నారు. పులివెందులలో ఏ ఎన్నికలైనా ప్రశాంతంగా జరిగాయా అని సతీష్‌రెడ్డి ప్రశ్నించారు.

నేటి నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్
తరలిరానున్న మంత్రులు, సినీ ప్రముఖులు

నెల్లూరు, డిసెంబర్ 26: ప్రతి ఏడాది నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట కేంద్రంగా జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను జిల్లా అధికారులు పూర్తి చేశారు. ఈ ఏడాది అనుకున్న స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పులికాట్ తీరం నీరు లేక బోసిపోయింది. ఇటీవల వార్దా తుఫాన్‌తో కొంతమేర ఆ కొరత తీరింది. ఇప్పుడిప్పుడే గత వారం రోజుల నుంచి పులికాట్ సరస్సుకు విదేశీ వలస పక్షుల రాక కూడా మొదలైంది. దేశంలో అతిపెద్ద సరస్సుల్లో ఒకటైన పులికాట్‌కు పాకిస్తాన్, ఆస్ట్రేలియా,బర్మా,శ్రీలంక,నైజీరియా తదితర దేశాల నుంచి శీతాకాలంలో ఆహారం కోసం వలస వచ్చి ఇక్కడే గుడ్లు పెట్టి పొదిగి పిల్లలకు ఎగిరే సామర్ధ్యం వచ్చిన తరువాత ఎగిరిపోతాయి. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉండడంతో ఈ ఏడాది మరిన్ని విస్తృత ఏర్పాట్లతో అతిథులను, పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. ప్రభుత్వం రూ.2కోట్ల నిధులను ఈ ఫెస్టివల్ కోసం మంజూరు చేసింది. నెల్లూరు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రత్యేక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు.
తొలిరోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సినీ ప్రముఖులతో పాటు మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పి.నారాయణ, శిద్దా రాఘవరావు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. చివరిరోజైన గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ ఫెస్టివల్‌కు హాజరయ్యే అవకాశం ఉందని, పర్యటన ఖరారు దశలో ఉందని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు తెలిపారు.