ఆంధ్రప్రదేశ్‌

కాపు-బలిజల లేఖల యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 30: ఇప్పటివరకూ ఉద్యమంలో కలసి నడిచిన కాపు-బలిజల మధ్య దూరం పెరిగిన క్రమంలో కాపునేత ముద్రగడ రాసిన లేఖ బలిజలను మానసికంగా గాయపరిచినట్టయింది. బలిజ సొంత బాటపై వార్తలు రాస్తున్న మీడియాను ప్రభుత్వ పెంపుడు పత్రికంటూ ముద్రగడ లేఖ రాయడాన్ని బలిజలు సహించలేకపోతున్నారు. దానిపై బలిజ ఫ్రంట్ అధ్యక్షుడు రమణ నేరుగా ముద్రగడకు రాసిన లేఖ చర్చనీయాంశమయింది.
తాము ఎల్లకాలం తన నాయకత్వంలో పనిచేయాలన్న స్వార్థం ముద్రగడ లేఖతో స్పష్టమయిందని టిటిడి బోర్టు మాజీ సభ్యుడు, బలిజ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఓ.వి.రమణ ‘పోరాటం మొదలు’ అంటూ ముద్రగడకు రాసిన ఘాటు లేఖలో విరుచుకుపడ్డారు. కాపుల నుంచి విడిపోయి సొంత ఉద్యమం ప్రారంభించేందుకు మొదలైన ప్రయత్నాలకు నెల్లూరు, ప్రకాశం, అనంత, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన బలిజ వర్గం నుంచి అనూహ్య స్పందన లభించడంతో కాపు ఉద్యమం కొత్త మలుపు తిరగనుంది.
తమ సొంత ఉద్యమం ప్రారంభం అయిన నేపథ్యంలో సీమ జిల్లాల నుంచి వస్తున్న స్పందన చూసిన ముద్రగడ, కొందరు ప్రభుత్వ నీడకు చేరుతున్నారని, మరికొందరు అధికారదాహం తీర్చుకోవడానికి వెళుతున్నారంటూ లేఖ రాయడాన్ని బలిజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
‘మా ప్రాంతాల్లో బలిజలు సొంత ఉద్యమాలు చేస్తామని చెప్పగానే మీరు మేము రాజకీయ పార్టీలకు తొత్తులమని, మీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు మిమ్మల్ని విమర్శిస్తున్నామని, మా వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వం పంచన చేరుతున్నామని మీరు చెబుతున్నారు. మేం మీకు ఒక్కటే చెబుతున్నాం. అధికారపార్టీ లేదా ఆ నేతలతోగానీ, ప్రభుత్వం నుంచి గానీ ఒక్క లబ్థిపొందినట్లు మీరు నిరూపించగలిగితే మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామ’ని రమణ తాజాగా ముద్రగడకు రాసిన లేఖలో సవాల్ చేశారు. ఈ లేఖ వల్ల తమను ప్రభుత్వ ఏజంట్లుగా పద్మనాభం ముద్ర వేస్తున్నారన్న ఆగ్రహం బలిజల్లో వ్యక్తమవుత్నునట్లు స్పష్టమవుతోంది.
కాపు ఉద్యమాన్ని రైలుబండితో పోల్చి, దానికి తానే డ్రైవరుగా ఉంటానన్న ముద్రగడ వ్యాఖ్యలపైనా బలిజ ఫ్రంట్ ఆక్షేపణ వ్యక్తం చేసింది. ‘దీని ఉద్దేశం మీరే బండి నడుపుతారే తప్ప మా ప్రాంతంలోని నేతలకు ఆ శక్తిసామర్థ్యాలు లేనట్లు, మేము కేవలం మీ రైలులో ప్రయాణీకులుగానే ఉండాలన్నట్లు మీ ఆలోచనాధోరణి స్పష్టం చేస్తోంది. ఇది మీ భ్రమ మాత్రమే. మా ప్రాంతంలోని ఈ సామాజికవర్గం ఉద్యమాన్ని నిస్సందేహంగా ముందుకు తీసుకువెళుతుంది. మీరన్నట్లు ఎన్ని తుపానులు, భూకంపాలు వచ్చినా ఎన్నిశక్తులు అడ్డుపడినా మా ఉద్యమం కొనసాగిస్తామ’ని ఖరాఖండీగా ముద్రగడకు స్పష్టం చేయడం బట్టి, ఇకపై రాయలసీమ జిల్లాల్లో కాపులతో సంబంధం లేకుండానే బలిజలు సొంత ఉద్యమాలు చేసుకుంటామని చెప్పకనే చెప్పినట్టయింది.
తమపై అధికారపార్టీ ప్రభావం ఉందన్న ముద్రగడ వ్యాఖ్యలపై బలిజ ఫ్రంట్ అంతే ధాటిగా బదులిచ్చింది. ‘మీకు ఒక రాజకీయపార్టీ మద్దతునిచ్చినప్పుడు, ఇస్తామని మీడియా సమక్షంలోనే ప్రకటించినప్పుడు మీరు ఆ పార్టీ కనుసన్నలలో నడుస్తున్నారని సొంత సామాజికవర్గంలో మాట్లాడుతున్నప్పుడు, మేము కూడా మీరు ఆ పార్టీ తొత్తుఅని ఎవరైనా అంటే మీరెంత మథనపడతారు? అదేవిధంగా మేం మా ప్రాంతంలో బలిజల భావాలు వ్యక్తీకరిస్తే మీరు అధికారపార్టీ తొత్తులని మాపై ముద్రవేయడం సమంజసమా? ఒక్కసారి ఆలోచించాల’ని ముద్రగడకు జగన్ సారథ్యంలోని వైసీపీ మద్దతును, పరోక్షంగా తెరపైకి తీసుకువచ్చినట్లు స్పష్టమవుతోంది. బలిజలకు జరుగుతున్న అన్యాయాలను మీడియాలో ప్రస్తావిస్తే వాటిని ప్రచురించి, ప్రసారం చేసిన మీడియాను కించపరుస్తూ మాట్లాడటం ఎంతవరకూ సంస్కారమని ప్రశ్నించారు. మీకు అనుకూలంగా ఏ పత్రిక, మీడియా రాస్తుందో అవి మంచి పత్రికలు, ఇతర ప్రాంత కులాల భావాలు ప్రస్తావించే మీడియా అధికారపార్టీ తొత్తులుగా విమర్శించడం ఉద్యమనాయకుడిగా తగదని బలిజ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు రమణ, ముద్రగడకు రాసిన లేఖలో విరుచుకుపడ్డారు. రెండు కులాలు కలసి పనిచేద్దామని, ఒకవేళ సాంకేతికకారణాలతో ముందు బలిజలను బీసీల్లో చేరిస్తే, గతంలో మున్నూరు-తూర్పు కాపులకు ఇచ్చినట్లుగానే తమకూ సహకరించాలని కోరారు.
కాగా కాపుల నుంచి వేరుపడి, ఐదారు జిల్లాల్లో సొంత ఉద్యమం ప్రారంభించనున్న బలిజ ఉద్యమానికి అనూహ్య స్పందన లభిస్తోందని బలిజ ఫ్రంట్ నేతలు చెప్పారు. త్వరలో ఒంగోలు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో పర్యటిస్తామని వెల్లడించారు. ఇన్నాళ్లూ కాపుల నీడలో, ఏకనాయతకత్వంలో జరిగిన నష్టం ఇక కొనసాగడానికి వీల్లేదని బలిజలు గ్రహించారంటున్నారు. తమకు కాపులతో పనిలేదని, వారి నాయకులకే తమ సంఖ్యాబలం అవసరమని, అందుకే తమకు ఇష్టం లేకున్నా తమతో బలవంతంగా కలసి పనిచేసి, కాపులు తమ రాజకీయ లబ్థి చూసుకుంటున్నారని బలిజ నేతలు స్పష్టం చేస్తున్నారు.
దశాబ్దాల నుంచి కాపుల నాయకత్వంలో పనిచేసి, సొంత ఉద్యమం ప్రారంభించాలన్న ఆలోచనను నీరుగార్చేందుకే ముద్రగడ తమపై ప్రభుత్వతొత్తులని ముద్ర వేయడం, తాను మాత్రమే ఉద్యమానికి నాయకత్వం వహించాలే తప్ప ఇతరులకు ఆ అర్హత లేదనేలా మాట్లాడటం ముద్రగడ మనస్తత్వానికి నిదర్శనమని, దీనిని బలిజలు గ్రహించి కళ్లుతెరవాలని రమణ వ్యాఖ్యానించారు.