ఆంధ్రప్రదేశ్‌

కలసి ఉంటే.. లేదు సుఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 5: రాష్ట్రంలో తెలుగుదేశం, బిజెపిల మధ్య స్నేహానికి త్వరలోనే తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. టిడిపితో కలిసి ఉంటూ అవమానాలు భరించేకన్నా, విడిపోయి, సొంతంగా ఎదగాలని బిజెపి భావిస్తోంది. మరో నాలుగైదు నెలల్లో రాష్ట్రంలోని 11 నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. కలిసి ఉన్నా సుఖం లేదని భావిస్తున్న బిజెపి...టిడిపితో తెగతెంపులకు సిద్ధపడుతుందా? లేక విధిలేని పరిస్థితుల్లో కలిసి ఎన్నికలకు వెడుతుందా అనేది చర్చనీయాంశమైంది. మోదీ ఇమేజ్‌తో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని బిజెపి భావిస్తోంది. అందువలన రాష్ట్రంలో తమకు గౌరవం ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. గౌరవం సంగతి పక్కన పెడితే, రాష్ట్రంలో అడుగడుగునా తమకు అవమానాలే ఎదురవుతున్నాయని బిజెపి నేతలు వాపోతున్నారు. చంద్రబాబు కేబినెట్‌లో ఉన్న ఓ మంత్రి ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ మంత్రివర్గ సహచరులు, అధికారులు తనను మంత్రిగానే గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి నాయకులను, క్యాడర్‌ను టిడిపి నాయకులు ఏమాత్రం ఖాతరు చేయడం లేదన్న వాదనకు అనేక సంఘటనలు బలం చేకూర్చుతున్నాయి. కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు తన కష్టార్జితంగా చెప్పుకుని తన ఇమేజ్‌ను పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నారని, మోదీ ప్రస్తావనను ఎక్కడా తీసుకురావడం లేదని బిజెపి నాయకులు అంటున్నారు. దీనికి అనేక ఉదాహరణలు చెపుతున్నారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘వాడవాడలా చంద్రన్న బాట’కు మొత్తం నిధులు సమకూర్చుతున్నది కేంద్రమేనని బిజెపి సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటికి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు కేంద్రం 2500 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే, దాన్ని చంద్రబాబు నాయుడు నీరు-చెట్టు పేరుతో తన సొంత పథకం కింద చెప్పుకొంటున్నారన్నది వారి ఆవేదన. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని చంద్రబాబు మాట్లాడుతున్నారు. కానీ గుంటూరు, విజయవాడ ప్రాంతాల అభివృద్ధికి పట్టణాభివృద్ధి శాఖ నుంచి వెయ్యి కోట్లు మంజూరయ్యాయని, అమరావతిలో అమృత పథకం అమలుకు 70 కోట్లు, హెరిటేజ్ అభివృద్ధికి 50 కోట్లు కేంద్రం మంజూరు చేసింది వాస్తవం కాదా? అని బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి గడ్కరి 19,600 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ప్రభుత్వం ఏమేరకు ఖర్చు చేసిందో చెప్పాలని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న తాత్కాలిక సెక్రటేరియట్‌కు చదరపు అడుగుకు 350 రూపాయలను కేంద్రం మంజూరు చేసింది వాస్తవం కాదా? అని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
పార్టీపరంగా, ప్రభుత్వపరంగా టిడిపి తమను కలుపుకొనిపోనప్పుడు ఆ పార్టీతో ఎందుకు కలిసి ఉండాలన్నది వారి ప్రశ్న. సంస్థాగతంగా బలపడినట్టు బిజెపి నాయకులు చెపుతున్నా, ఎన్నికల్లో గెలిచేందుకు తగిన బలం ఆ పార్టీకి లేదన్నది కొంతవరకూ నిజం. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడే, ఆ పథకాలను అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవాలని బిజెపి నాయకులు తహతహలాడుతున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలకు ముందే తమ సత్తా నిరూపించుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. తెలంగాణాలో తెలుగుదేశం పార్టీతో పొత్తును వదులుకోవాలని అక్కడి బిజెపి నిర్ణయించిన నేపథ్యంలో ఇక్కడ కూడా అదే ఫార్ములాను ఉపయోగించాలని బిజెపి నేతలు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనే టిడిపితో బిజెపి నేతలు అమీతుమీ తేల్చుకోవాలనుకుంటున్నారు. ఎక్కువ సీట్లు డిమాండ్ చేసి, తమ బలం నిరూపించుకోవాలని భావిస్తున్నారు. ఉదాహరణకు విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో 72 డివిజన్లు ఉన్నాయి. వీటిలో సగం సీట్లు కావాలని బిజెపి కోరుకుంటోంది. సంస్థాగతంగా బలపడని బిజెపికి ఎన్ని సీట్లు ఇచ్చినా, ఇబ్బందులు కొని తెచ్చుకోవడమేనని టిడిపి నాయకులు వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు చైర్మన్, మేయర్లను ప్రత్యక్ష విధానంలో ఎన్నుకోడానికి చట్ట సవరణ చేస్తున్న నేపథ్యంలో బిజెపితో పొత్తు అవసరం ఏమిటని కూడా టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించి, సయోధ్య కుదర్చడం కోసం ఇరుపార్టీల అథినేతలు ప్రయత్నించకపోవడం కూడా పొత్తుపై వీరికున్న అభిప్రాయాన్ని చెప్పకనే చెపుతున్నాయి. పొత్తు కొనసాగించాలా? వద్దా? అన్నది కేంద్ర పార్టీ నిర్ణయిస్తుందని బిజెపి నాయకులు చెపుతున్నారు. ఈ విషయంలో టిడిపి ఆచి తూచి నిర్ణయం తీసుకుంటుందా? ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దూకుడుగా వ్యవహరిస్తుందా? వేచి చూడాలి.