ఆంధ్రప్రదేశ్‌

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలుకు విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. చంద్రన్న బీమా పథకం కింద ఈ మొత్తం చెల్లించనున్నట్లు తెలిపారు. విజయవాడ ఉండవల్లిలోని తన నివాసంలో రైలు ప్రమాద ఘటన వివరాలు ఆయన తెలుసుకొని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులకు సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఒడిశా పోలీసుల సహకారంతో మృతదేహాలను స్వాధీనం చేసుకుని బంధువులకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని డిజిపిని ఆదేశించారు. మార్గంమధ్యలో చిక్కుకున్న ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు తరలించేందుకు వీలుగా బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా రైలు సర్వీసులను పునరుద్ధరించాలని రైల్వే అధికారులను కోరుతూ విజయనగరం, విశాఖ జిల్లా కలెక్టర్లు దీనిపై దృష్టి సారించాలని ఆదేశించారు.
రైల్వే మంత్రి ప్రభు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లతో మాట్లాడారు. ఒడిశా సిఎస్‌తో మాట్లాడి పరిస్థితి సమీక్షించాల్సిందిగా రాష్ట్ర సిఎస్ టక్కర్‌ను ఆదేశించారు. కాగా, రైలు ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైలు ప్రమాదంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు.
మెరుగైన వైద్యం అందించాలి
రైలు ప్రమాద ఘటనపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి ఆదివారం ఇక్కడో ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరింత మంది గాయపడిన వారి వివరాలు తెలియాల్సి వుందని వారి బంధువులు ఆవేదన చెందుతున్నారని, ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మూడుచోట్ల రైలు ప్రమాదాలు జరిగాయని, దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా రైల్వే మంత్రి, అధికారులు ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయాలని రఘువీరారెడ్డి సూచించారు.
రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి
కూనేరు వద్ద శనివారం రాత్రి జరిగిన రైలు ప్రమాద కారణాలపై సమగ్రంగా దర్యాప్తు చేయించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరింది. తిరుపతిలో వాస్కోడిగామా రైలు పట్టాలు తప్పిందన్న వార్త మరింత ఆందోళన కలిగిస్తోందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఉప ముఖ్యమంత్రులు చినరాజప్ప, కెఇ కృష్ణమూర్తి కూడా రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.