ఆంధ్రప్రదేశ్‌

‘మండలి’ సీటుకు టిడిపిలో పోటాపోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 22: ప్రధాన రాజకీయ పక్షాల్లో శాసనమండలి ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఒకసారి శాసన మండలిలోకి ప్రవేశిస్తే ఆరేళ్లపాటు నిశ్చింతగా వుండవచ్చు. మరో రెండేళ్లలో శాసనసభకు సాధారణ ఎన్నికలు ఎటూ రాబోతున్నాయి. అప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ తమ స్థానం ఆపై నాలుగేళ్లపాటు సుస్థిరంగా వుంటుంది. దీంతో శాసనమండలి సీటు ఆశించేవారి సంఖ్య అధికార పక్షం టిడిపిలో, ప్రతిపక్ష వైకాపాలోనూ పార్టీ బలాబలాలను బట్టి పోటాపోటీగానే కన్పిస్తోంది. ప్రస్తుతం దాదాపు 22 స్థానాలు ఖాళీ అవుతుండగా వీటిలో శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికయ్యేవారు ఏడుగురు ఉన్నారు. ఆరేళ్ల క్రితం ఎన్నికైన మహ్మద్ జానీ, సి రామచంద్రయ్య, చెంగల్రాయుడు, సుధాకరరావు, పిజె చంద్రశేఖరరెడ్డి, ప్రతిభాభారతి, అంగర రామ్మోహన్ పదవుల్లో ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన పాలడుగు వెంకట్రావు అకాల మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ప్రతిభాభారతి గెలిచారు. చంద్రశేఖర్ సిపిఐ అయితే, రామ్మోహన్ టిడిపికి చెందినవారు. ఈ ఏడుగురి పదవీకాలం వచ్చే మాసాంతంతో ముగియనుంది. ప్రస్తుత బలాబలాలను బట్టి టిడిపికి 6, వైకాపాకు ఒక స్థానం లభించనున్నాయి. ఇదిలావుంటే రాజధాని ప్రాంత కృష్ణా, గుంటూరు జిల్లాలకు టిడిపి ఒక స్థానం కేటాయించనుండటంతో ఆ సీటునాశించేవారి సంఖ్య రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. రాజధాని ప్రాంతంలో తమ ప్రాబల్యం పెంచుకోటానికి కూడా ఎమ్మెల్సీ పదవి ఎంతగానో దోహదపతుందనే భావన ఆశావహుల్లో లేకపోలేదు. తెలుగుదేశం తరపున ప్రధానంగా కృష్ణా జిల్లా నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి నాగుల్‌మీరా ఎవరికివారు తమ రాజకీయ గాడ్‌ఫాదర్ల ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. వీరిలో ఇప్పటివరకు ఎలాంటి నామినేటెడ్ పదవికి గాని, ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారైనా పోటీచేసే అవకాశం గాని రాలేదంటూ గొట్టిపాటి వాదిస్తున్నారు. ఈ ప్రకారం చూస్తే అర్జునుడు గతంలో ఒకమారు ఐదేళ్లపాటు జిల్లా కేంద్రం మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్‌గా వ్యవహరించారు. అయితే గత ఎన్నికల్లో నూజివీడు సీటునాశించి కొంతకాలం పాటు ఇన్‌చార్జ్‌గానూ అక్కడ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. తీరా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన గన్నవరం మాజీ శాసనసభ్యుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆ సీటును దక్కించుకున్నా గెలువలేకపోయారు. ప్రస్తుతం అర్జునుడు జిల్లా పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ఇక నాగుల్‌మీరా 1999 ఎన్నికల్లో పోటీచేసి జలీల్ ఖాన్ (వైకాపా) చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. తరువాత నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ గత ఎన్నికల్లో తిరిగి సీటునాశించగా ఆఖరి క్షణంలో మిత్రపక్ష బిజెపికి వదలాల్సి వచ్చింది. తాజాగా ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టిడిపిలోకి ప్రవేశించడంతో వచ్చే ఎన్నికల్లో కూడా సీటు రాదనే భావనతో ఆయన ఎమ్మెల్సీ సీటును ఆశిస్తున్నారు. అయితే మైనార్టీ కార్పొరేషన్ నుంచి దూదేకుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి నాగుల్ మీరాను చైర్మన్‌గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక గొట్టిపాటి టిడిపి తరపున గోదావరి జిల్లా నల్లజర్లలోని శిక్షణ కేంద్రానికి ఇన్‌చార్జ్‌గా ఉంటూ ఇప్పటికి దాదాపు 10వేల మంది నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి గుర్తింపు పొందారు. ఇక గుంటూరు జిల్లాలో మాజీ శాసనసభ్యులు జియావుద్దీన్, డాక్టర్ చందు సాంబశివుడు, డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, మిర్చియార్డు చైర్మన్ మన్నవ సుబ్బరావు పోటీ పడుతున్నారు. ఇక ఛోటామోటా నేతలు కూడా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు. వీరిలో ఎవరిని అదృష్టం వరిస్తుందో వేచిచూడాల్సిందే!