ఆంధ్రప్రదేశ్‌

పార్టీ ‘పాలన’ పట్టని మంత్రులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 24: తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టం వృధా అవుతోందా? విపక్షాలు ఏకమయి, సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నా ఇప్పటివరకూ అసలు ఆ సమస్యలనే గుర్తించడంలో మంత్రులు విఫలమవుతున్నారా? జిల్లాల్లో పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం సాధించడం, విపక్షాలపై ఎదురుదాడిలో మంత్రులు చేతులెత్తేశారా? వాటి కోసం బాబు గంటల తరబడి నిర్వహిస్తోన్న సమీక్షల వల్ల కంఠశోష తప్ప ఫలితాలు రావడం లేదా?.. పార్టీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చ ఇది. ఆరుపదులు దాటిన బాబు స్పీడును అందుకోకపోయినా, కనీసం జిల్లా స్థాయిలో అప్పగించిన బాధ్యతల నిర్వహణలోనూ, చాలామంది మంత్రులు విఫలమవుతున్నారన్న విమర్శ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. విపక్షాలన్నీ ఏకమై సర్కారు, పార్టీపై ముప్పేట దాడిని ముమ్మరం చేసిన తీరు చూస్తుంటే, అప్పుడే ఎన్నికలు సమీపిస్తున్నాయా అన్న భావన ప్రజల్లో మొదలయిందని పార్టీ నేతలు విశే్లషిస్తున్నారు. పార్టీ ఆఫీసు నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఎవరూ ఎదురుదాడి చేయని దుస్థితి నెలకొందని, ఎవరిలోనూ బాధ్యత కనిపించడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇటీవలి కాలంలో వైసీపీ నిర్వహిస్తోన్న ప్రజాందోళన కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోందని, వాటికి తగిన జవాబు ఇచ్చే మంత్రులు కూడా కరవయ్యారంటున్నారు. ఈ విషయంలో సమర్ధులైన మంత్రులు కరవయ్యారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో అనుభవం ఉన్న మంత్రులుండేవారని, ఇప్పుడు అదే లోపించిందని, నమ్మకంతో ఇచ్చిన పదవులకు న్యాయం చేయలేకపోతున్నారంటున్నారు. విపక్షాలపై ఎదురుదాడి, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారంపై ఎంతసేపటికి పార్టీ కార్యాలయ మేధావులే తప్ప, మంత్రులకు బాధ్యత లేకుండా పోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోనీ జిల్లా స్థాయిల్లో ఏమైనా విపక్షాలపై ఎదురుదాడి, సొంత పార్టీ విస్తృతి కోసం కష్టపడుతున్నారా అంటే అదీలేదంటున్నారు. మంత్రులు పార్టీకి లాభం చేకూర్చకపోగా, వారి చర్యలు మరింత నష్టం తీసుకువస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వంశధార నిర్వాసితులకు సకాలంలో డబ్బులివ్వకపోవడంతో బాధితులు తిరగబడ్డారని, ఆ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు ముందుచూపు ప్రదర్శించలేకపోయారంటున్నారు. భూమి చాలా సున్నితమైన అంశమైనందున, దానిని అదే కోణంలో పరిష్కరించాల్సి ఉందని, దానికి అనుభవం కూడా అవసరం ఉందని విశే్లషిస్తున్నారు. ప్రస్తుతం క్యాబినెట్ బయట చాలామంది అనుభవం ఉన్న సీనియర్లు ఉన్నా వారిని కాదని, కొత్తవారిని, కుల సమీకరణలో మంత్రివర్గంలో తీసుకున్నందుకు పార్టీ మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. అనుభవం, చిత్తశుద్ధి లేనివారిని తీసుకుంటే ఇంతకుమించి ఫలితాలు ఎలా వస్తాయంటున్నారు. రాయలసీమతోపాటు.. గుంటూరు, కృష్ణా, విజయనగరం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పుంజుకోవడం ఆందోళన కలిగిస్తున్నా.. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని ఎదురుదాడి చేయడంలో మంత్రులు పూర్తిగా వైఫల్యం చెందారంటున్నారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య చాలా పాతదేనని అయినా ఆ సమస్యపై పవన్ కల్యాణ్ స్పందిస్తేగానీ ప్రభుత్వం కదలేదన్న భావన ఏర్పడేందుకు ఆ జిల్లా మంత్రే కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా బాధితుల సమస్యలపైనా ఆ జిల్లా మంత్రులు ముందుగా స్పందించి ఉంటే అది పవన్, జగన్‌కు రాజకీయంగా లాభించేది కాదని విశే్లషిస్తున్నారు. ఒంగోలులో కిడ్నీ బాధితుల సమస్యపై జగన్ మాట్లాడకముందే జిల్లా మంత్రి స్పందించి ఉంటే వైసీపీకి పొలిటికల్ మైలేజీ దక్కది కాదంటున్నారు. మంత్రులయి రెండున్నరేళ్లయినా ఇప్పటివరకూ జిల్లాలో ప్రధాన సమస్యలేమిటో తెలుసుకోలేకపోతున్నారంటే, వారు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘చాలామంది మంత్రులు వచ్చే ఎన్నికల్లో పోటీకి కావలసిన ఆర్ధిక వనరులను ఇప్పటినుంచే పోగేసుకుంటున్నారు. మరికొందరు మళ్లీ టికెట్లు ఇస్తారో ఇవ్వరోనన్న భయంతో పదవి ఉన్నప్పుడే సంపాదించుకోవాలన్న ధోరణితో ఉన్నారు. కుటుంబసభ్యులు కూడా రంగంలోకి దిగి అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. పోనీ సంపాదించుకున్న దానితో కార్యకర్తల కష్టసుఖాలు చూస్తున్నారా అంటే అదీ లేదు. వీరివల్ల కార్యకర్తలు, పార్టీ నష్టపోతోంద’ని ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.