ఆంధ్రప్రదేశ్‌

మా నోట్లో మట్టికొట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, జనవరి 27: పోలవరం పనుల మట్టి డంపింగ్ చేయడానికి సేకరించిన తమ భూముల పరిహారం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన మూలలంక రైతులు శుక్రవారం నుంచి ఆమరణ దీక్షకు దిగారు. పోలవరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తాడి మంగారాం, నంగినీడి వెంకట కృష్ణారావు దీక్షలో కూర్చున్నారు. వీరికి మద్దతుగా కుటుంబ సభ్యులు, రైతులు, గ్రామస్థులు దీక్షాస్థలం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న రైతులు మాట్లాడుతూ తమ అనుమతి లేకుండా తమ భూముల్లో మట్టిని డంపింగ్ చేస్తున్నారని, ఈ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సైతం ధిక్కరిస్తున్నారని తెలిపారు. అడ్డుకుంటే 144వ సెక్షన్ అమల్లో ఉందని అరెస్టుచేస్తున్నారన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ గత ఆరు నెలలుగా ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి, కలెక్టర్ తదితరులను కలిసినా ఫలితంలేదన్నారు. తమ సమస్యపై ఎవరూ స్పందించడంలేదన్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను కలిశామని, ఆయన సమస్యపట్ల స్పందించిన తీరు బాగుండటంతో తమ సమస్య పరిష్కారమవుతుందని భావించామన్నారు.
అయితే జిల్లా కలెక్టర్ మొండి వైఖరి కారణంగా తమ సమస్య పరిష్కారం కావడంలేదన్నారు. కలెక్టర్ మూలలంక రైతులపట్ల క్షక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మూలలంకకు చెందిన మహిళా రైతులు తాడి సత్యవతి, గూడపాటి నిర్మలాకుమారి, నంగినీడి నారద మాట్లాడుతూ తమ పొలాల్లో పంటలున్నా దౌర్జన్యంగా మట్టి డంపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం రైతులను రోడ్డున పడేస్తోందన్నారు. తమను చంపేసి, డంపింగ్ చేసుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు. తక్షణం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. కాగా దీక్షాస్థలి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున దీక్షచేయరాదని, తక్షణం విరమించుకోవాలని పోలవరం సిఐ కె బాలరాజు, ఎస్సై కె శ్రీహరిరావు రైతులకు తెలిపారు. 203 ఎకరాల భూమిపై హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులున్నా ప్రభుత్వం దౌర్జన్యంగా మట్టి డంపింగ్ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని రైతులు నిలదీశారు. తాము శాంతియుతంగా దీక్ష చేస్తున్నామని, శాంతిభద్రతలకు విఘాతం కలగనివ్వబోమని పేర్కొన్నారు. తమను అరెస్టుచేసినా, దీక్ష విరమించమని కరాఖండీగా చెప్పారు.

చిత్రం..ఆమరణ దీక్షచేస్తున్న మూలలంక రైతులు