ఆంధ్రప్రదేశ్‌

కేంద్రంపై ఒత్తిడికి టిడిపి ఎంపీల వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 30: పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది. కేంద్రమంత్రులు సుజనాచౌదరి, అశోక్ గజపతిరాజు, ఎంపిలు సిఎం రమేష్, కేశినేని నాని, రాయపాటి సాంబశివరావు, గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, మురళీమోహన్, కొనకళ్ల వెంకటనారాయణ, తదితరులు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో గుంటూరులోని రాష్టప్రార్టీ కార్యాలయంలో సోమవారం తొలిసారి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రత్యేకహోదా ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో ప్యాకేజీకైనా చట్టబద్ధత కల్పించాల్సిందిగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. వచ్చేనెల 15వ తేదీలోగా ప్యాకేజీకి చట్టబద్ధత సాధించుకుందామని సుజనాచౌదరి స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తే హోదా అంశం కంటే ప్యాకేజీ, పెండింగ్ ప్రాజెక్టుల ప్రస్తావన బలంగా తీసుకురావాలని లోకేష్ సూచించారు. పార్లమెంటు సమావేశాల్లో వైసిపి ఎంపిలు హోదా అంశంతో ఆందోళన నిర్వహిస్తే అందుకు దీటుగా స్పందించాలని సమావేశంలో కార్యాచరణ రూపొందించారు. అవసరమైతే సమావేశాల ద్వారానే హోదా, ప్యాకేజీ వాదనలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని టిడిపి భావిస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఓ కీలకమైన మైలురాయి అని, విమానాశ్రయాల విస్తరణకు ఎంపిలు చొరవ చూపారని లోకేష్ అభినందించారు. అదే స్ఫూర్తితో రాష్ట్రానికి మరిన్ని నిధులు సమీకరించాలని సూచించారు. వచ్చేనెలలో జరగనున్న అంతర్జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు గురించి విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ఎంపిలు తమ పరిధిలోని శాసనసభ్యుల సమన్వయంతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా లోకేష్ నిర్దేశించారు. దక్షిణ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలో స్థానిక సమస్యలపై ఉద్యమాలు నిర్వహించాలని లోకేష్ సూచించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు మాత్రమే మంజూరు చేసింది. గతంలో కేటాయించిన మరో 15 వందల కోట్లలో విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో పనులకు మంజూరయ్యాయని, వచ్చే రెండేళ్లలో కనీసం మరో ఐదువేల కోట్ల మేర నిధులు సమీకరిస్తే ప్రభుత్వ భవనాలను పూర్తి చేయవచ్చనే భావనను ఎంపిలంతా సమర్ధించారు. కాగా రెవిన్యూ లోటు భర్తీపై కేంద్రం ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు పట్టుపట్టాలని నిర్ణయించారు. విభజన సందర్భంగా 16వేల 200 కోట్ల లోటు ఏర్పడింది. ఇది ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరానికి 20వేల కోట్లకు చేరుకోనుంది.
అయితే విభజన నాడు ఉన్న లోటును దశలవారీగా భర్తీచేసేందుకు కేంద్రం అప్పట్లో అంగీకరించిందనే అంశాన్ని పార్లమెంటులో టిటిడి ఎంపిలు ప్రస్తావించనున్నారు. కాగా రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వేజోన్ అంశంలో కేంద్రం జాప్యం కారణంగా ప్రాంతాల మధ్య అపోహలు తలెత్తుతున్నాయని దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందిగా పార్లమెంటు సమావేశాల్లో కోరనున్నట్లు తెలిసింది. కాగా విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య 9,10 షెడ్యూల్డ్ సంస్థల బదలాయింపు ప్రక్రియ ఇంకా కొలిక్కిరాలేదు. షెడ్యూల్డ్ ఆస్తుల బదలాయింపును వేగవంతం చేయాలని కూడా ఇదే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రాన్ని కోరాలని టిడిపి పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. కాగా పెండింగ్‌లో ఉన్న జాతీయ విద్యాసంస్థలు, వాటికి నిధుల కేటాయింపుపై తగిన ఆమోదం పొందాలని లోకేష్ పార్టీ ఎంపిలకు సూచించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా- ప్యాకేజీల మధ్య వ్యత్యాసాలపై పూర్తిస్థాయిలో తమ వాణి వినిపించేందుకు టిడిపి ఎంపిలు సన్నద్ధమయ్యారు.