ఆంధ్రప్రదేశ్‌

‘తుని కేసు’ తూచ్చేనా..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్తి సుబ్రహ్మణ్యం
అమరావతి, జనవరి 31: ఒక నేరం లేదా ఘోరం జరిగినప్పుడు పోలీసులు ఏవిధంగా స్పందిస్తారు? జాగిలాల నుంచి ప్రత్యేక బృందాల వరకూ రంగంలోకి దిగి దుర్భిణీ వేసిమరీ విచారించి నిందితులను పట్టుకుంటారు. ఎక్కడెక్కడి కలుగుల్లో దాగున్న ఐసిస్ తీవ్రవాదులు, కారడవుల్లో డంపుల మాటున ఉండే మావోయిస్టులను జల్లెడ వేసి పట్టుకుంటారు. మరి.. జనారణ్యంలో, వేలాది మంది సమక్షంలో ఒక రైలు, ఒక పోలీస్టేషన్, వాహనాలను నిర్భయంగా తగులబెట్టిన అరాచక శక్తుల విషయంలో మాత్రం పోలీసు నేత్రాలు ఎందుకు మూసుకుపోయాయి? సాధారణంగా డ్యూటీలో ఉండే కానిస్టేబుల్‌పై ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తేనే వారి కీళ్లు విరిచి, చుక్కలు చూపించే పోలీసులు తమ స్టేషన్లు, వాహనాలు తగులబెట్టినా పౌరుషం చూపించడం లేదెందుకు? పేరుగొప్ప సీఐడి ఈ కేసులో నిందితులను ఎందుకు అరెస్టు చేయడం లేదు? సర్కారు వారి చేతులు ఎందుకు కట్టివేస్తోంది? రేపు మరో కులం రోడ్డెక్కినా సర్కారు చర్యలు ఇంతమెత్తగా ఉంటాయా? నేరాలకు-కులాలకు లంకెను రాజకీయ కోణంలో ఆలోచిస్తే ఇక కేసులు తేలేందుకు ఏళ్లూ, పూళ్లూ పట్టవూ!? రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ మహా వైఫల్యంగా ముద్రపడి, ఏడాది క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తుని ఘటనపై సగటు మనిషి భావన ఇది. గత ఏడాది జనవరి 31న తునిలో జరిగిన కాపుగర్జన సభ సందర్భంగా జరిగిన రైలు, పోలీస్టేషన్, పోలీసు వాహనాల దగ్ధం కేసు ఇంకా పురోగతి సాధించకపోవడం, నిందితులను అరెస్టు చేయకపోవడం ప్రభుత్వ- పోలీసు వైఫల్యమేనన్న భావన ప్రజల్లో నెలకొంది. ఒకపక్క ఇందులో సంఘ విద్రోహ శక్తుల హస్తం ఉందని హోంమంత్రి సహా అధికార పార్టీ నేతలంతా ఆరోపించినా ఇప్పటివరకూ వారిలో ఒక్కరినీ అరెస్టు చేయకపోవడం పోలీసు సమర్థతను వెక్కిరిస్తోంది. ఐసిస్, మావోయిస్టు, డ్రగ్స్ రాకెట్లను ఛేదిస్తున్న పోలీసులు కేవలం ఒక కులానికి భయపడి చర్యల అస్త్రాన్ని ఉపసహరించుకోవడం విమర్శలకు తావిస్తోంది. తుని ఘటనకు సంబంధించి వేసిన సీఐడి విచారణ బృందం ఇప్పటివరకూ 336 మంది నిందితులను గుర్తించి ఆమేరకు విచారణను 6 నెలల క్రితమే పూర్తిచేసి, నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈవిషయంలో అప్పటి సీఐడి అధికారి సత్యనారాయణ గానీ, చీఫ్ ద్వారకాతిరుమలరావు గానీ శరవేగంగా పనిచేసి, ఒత్తిళ్లను కూడా ఖాతరు చేయకుండా తమ విధులు నిర్వర్తించారు. కానీ, నివేదికను అమలుచేయాల్సిన ప్రభుత్వమే చర్యల కొరడా ఝుళిపించకుండా మీనమేషాలు లెక్కించటం వల్ల, నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిందితులెవరో కళ్లెదుటే కనిపిస్తున్నా ఎవరినీ అరెస్టు చేయలేని దుస్థితిలో తామున్నామని, చివరకు తమ స్టేషన్లపై దాడిచేసినా ఏమీచేయలేని నిస్సహాయులయ్యామని, ప్రభుత్వం తమ చేతులు కట్టేసిందని అక్కడి పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ కేసులో సీఐడి 140 మందిని విచారించి, 336 మందిని బాధ్యులుగా గుర్తించింది. 13 మందిని అరెస్టు చేసింది. ఘటన జరిగిన రోజు సాగిన సెల్‌ఫోన్ సంభాషణలు, టవర్ లొకేషన్స్, శాటిలైట్ ఇమేజెస్ వంటి సాంకేతిక పద్ధతుల్లో విధ్వంసకారులను గుర్తించిన పోలీసులు, వారిపై ఇప్పటివరకూ చర్యలు మాత్రం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిందితులుగా భావిస్తున్న కాపులను అరెస్టు చేస్తే ఆ సామాజిక వర్గమంతా వ్యతిరేకవౌతారన్న రాజకీయ కోణంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని మిగిలిన సామాజిక వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. అరెస్టయి జైలుకు వెళ్లిన వారి బెయిల్ పిటిషన్లను అడ్డుకోకుండా, ప్రభుత్వమే వారికి పరోక్షంగా బెయిల్‌కు రాచమార్గం వేయడాన్ని మిగిలిన వర్గాలు తప్పుపడుతున్నాయి. రేపు కాపులకు బీసీ హోదా ఇవ్వవద్దని బీసీలు కూడా రెండు రైళ్లు, నాలుగు పోలీస్టేషన్లు, పది వాహనాలు తగులబెడితే అప్పుడు కూడా ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకుంటే, బీసీలు దూరమవుతారన్న భయంతో చర్యలకు వెనుకంజ వేస్తే ఇక నిందితులకు శిక్షలు ఎప్పుడు పడతాయన్న ప్రశ్నలు అన్ని సామాజిక వర్గాలు, మేధావుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ కేసులో రైల్వే శాఖ రికవరీ యాక్టు కింద కేసులు కూడా పెట్టింది. తుని రూరల్ స్టేషన్‌లో 57 కేసులు, టౌన్ స్టేషన్‌లో 8 కేసులు నమోదయ్యాయి. డిమాండ్లు తీర్చేవరకూ రైలుపట్టాల మీదనే కూర్చుందామంటూ పిలుపునిచ్చిన కాపునేత ముద్రగడ పద్మనాభం సహా అనేక మందిపై కేసులు పెట్టారు. రాజకీయ పార్టీలు తరచూ నిర్వహించే రైల్‌రోకో కేసులనే సీరియస్‌గా తీసుకునే రైల్వే పోలీసులు కూడా తుని ఘటనపై నిద్ర నటించటం విమర్శలకు తావిస్తోంది. ఏతావాతా తమ ఆస్తులనే కాపాడుకోలేని పోలీసులు ఇక ప్రజల ఆస్తులు ఏమి కాపాడతారనే ప్రశ్న తెరపైకి వచ్చింది.

నాటి విద్రోహ ఘటనలో దగ్ధవౌతున్న రైలు (ఫైల్ ఫొటో)