ఆంధ్రప్రదేశ్‌

‘ఆర్థిక’ మార్పు అమలయ్యేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 5: దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్థిక సంవత్సరాన్ని మార్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31వ తేదీ వరకూ దేశంలో ఆర్థిక సంవత్సరంగా పాటిస్తున్నారు. అయితే దీన్ని జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఉండేలా మార్పుచేయాలని నీతి ఆయోగ్ ప్రతిపాదన చేసింది. ఇది కార్యరూపం దాల్చాల్సి ఉంది. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్థిక సంవత్సరం పద్ధతి 1867 నుంచి అమలులో ఉంది. తొలుత ఈస్ట్ ఇండియా కంపెనీ వైశాఖీ పండుగను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరాన్ని ఏర్పాటు చేసింది. బిట్రీష్ పాలకులు కూడా అదే ఆర్థిక సంవత్సరాన్ని కొనసాగించారు. మనది వ్యవసాయక దేశం కావడం, ఆదాయం ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తుల నుంచే వస్తుండటంతో అప్పట్లో ఏప్రిల్ నుంచి అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దేశ జిడిపిలో 15 శాతం వ్యవసాయ రంగం నుంచే వస్తుండటం, 58 శాతం మంది వ్యవసాయ ఆధారిత పనులపై జీవిస్తుండటంతో ఏప్రిల్ నుంచి మార్చి వరకూ ఆర్థిక సంవత్సరంగా నిర్ణయించారు. దాదాపు 150 సంవత్సరాలుగా తొలి పాలకుల నిర్ణయమే అమలు జరుగుతోంది. దీంతో ఆర్థిక సంవత్సరాన్ని మార్చేందుకు ఇప్పటికి రెండుసార్లు ప్రయత్నం జరిగింది. 1984లో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ ఎల్‌కె ఝా నేతృత్వంలో ఒక కమిటీని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలో కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు నిధుల కేటాయింపు వేగంగా చేసేందుకు వీలవుతుందని భావిస్తూ ఆర్థిక సంవత్సరం మార్చేందుకు ప్రతిపాదించారు. కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ వివిధ కారణాల వల్ల అది అమలుకు నోచుకోలేదు. తాజాగా బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీతి ఆయోగ్ సూచనల మేరకు గత ఏడాది జూలైలో కేంద్ర ప్రభుత్వ మాజీ చీఫ్ ఎకానమీ అడ్వైజర్ శంకర్ ఆచార్య నేతృత్వంలో మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్థిక సంవత్సరాన్ని క్యాలెండర్ సంవత్సరానికి సమానంగా మార్చేందుకు వీలుగా ఉన్న అవకాశాలు, అవసరాలు, ప్రతికూలతలు వంటివి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ కమిటీ అధ్యయనం చేసి, ఆర్థిక సంవత్సరాన్ని కూడా జనవరి నుంచి డిసెంబర్‌కు మార్చాలని సూచిస్తూ అందుకు తగిన కారణాలను నివేదికలో పొందుపరిచింది. గత ఏడాది డిసెంబర్‌లో నివేదిక అందచేసింది. అయితే ఇప్పటికీ దానిపై కేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. వరుసగా రెండుసార్లు కరవు పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఆర్థిక సంవత్సరం మార్పు అవసరమన్న అభిప్రాయాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కరవు పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో త్వరగా రైతులకు ఉపశమన చర్యలు అందించేలా బడ్జెట్ కేటాయింపులు చేసేందుకు ఈ మార్పు ఉపయుక్తంగా ఉంటుందని కమిటీ పేర్కొంది. రుతుపవనాలు, పంటల కోతల సమయాలు, స్టాక్ మార్కెట్‌ను ఎక్కువగా పరిగణలోకి తీసుకుని కమిటీ సిఫారసు చేసింది. ఇప్పటికే 156 దేశాల్లో జనవరి నుంచి డిసెంబర్ వరకూ ఆర్థిక సంవత్సరంగా అమల్లో ఉంది. ఇతర దేశాలతో ఆర్థిక లావాదేవీలకు ఇది సులభంగా ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది. వ్యవసాయానికి కూడా మార్పువల్ల లబ్ధి చేకూరుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం మార్పు వల్ల నవంబర్‌లోనే బడ్జెట్ ప్రతిపాదనలు పార్లమెంట్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ బడ్జెట్ కేటాయింపులు ఆయా శాఖలకు చేరేందుకు దాదాపు ఆరు నెలల సమయం పడుతోంది. ఆర్థిక సంవత్సరం మార్పు వల్ల పనులు చేపట్టే సమయానికి నిధులు చేరతాయని భావిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం మార్పుల్లో భాగంగానే ఈ ఏడాది బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టారని భావిస్తున్నారు. ఈ నివేదికపై బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.